‘కరోనా వైరస్ కట్టడికి దీర్ఘకాలిక చర్యలు తప్పనిసరి’

ABN , First Publish Date - 2020-04-01T01:56:48+05:30 IST

కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే తప్పనిసరిగా దీర్ఘకాలిక చర్యల అమలు తప్పదని తాజా అధ్యయనం వెల్లడించింది.

‘కరోనా వైరస్ కట్టడికి దీర్ఘకాలిక చర్యలు తప్పనిసరి’

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే తప్పనిసరిగా దీర్ఘకాలిక చర్యల అమలు తప్పదని తాజా అధ్యయనం వెల్లడించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో భారత దేశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించారు. 


వ్యాధుల వ్యాప్తి, మహమ్మారి భవిష్యత్తు ప్రవర్తనలను అంచనా వేయడం, మహమ్మారిని నియంత్రించే వ్యూహాల మూల్యాంకన చేయడం, జనాభా గణాంకాలు వంటివాటిని పరిశీలించి ఈ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. 


భారత దేశంలో మూడు తరాల కుటుంబాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల వృద్ధులకు కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ అని ఈ అధ్యయనం వెల్లడించింది. 


ప్రస్తుతం అమలవుతున్న 21 రోజుల అష్ట దిగ్బంధనాన్ని పొడిగించాలనే ఆలోచన ఇప్పటికి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో, ఇది పొరపాటు కావచ్చునని ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. 


పరిశోధకుల్లో ఒకరైన రొనోజోయ్ అధికారి మాట్లాడుతూ 21 రోజుల అష్ట దిగ్బంధనం తర్వాత ఈ వైరస్ నియంత్రణకు వేర్వేరు వ్యూహాల గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ఇన్ఫెక్షన్ పెరిగే రేటు చాలా ఎక్కువగా ఉంటుందని, ఇన్ఫెక్షన్లు రెట్టింపు కావడానికి చాలా తక్కువ సమయం పడుతుందని, అవి సగానికి తగ్గడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. 


కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో మాత్రమే కాకుండా ఇళ్ళలో కూడా సామాజిక దూరం పాటించవలసిన అవసరం ఉందని తెలిపారు. దీనికి కారణాలను వివరిస్తూ, యువత బయటకు వెళ్ళి, వైరస్‌ను ఇళ్ళకు తీసుకొస్తారని, ఆ వైరస్ ఇళ్ళలో ఉన్న వృద్ధులకు సోకే అవకాశం ఉంటుందని, వృద్ధులు దీని ప్రభావంతో మరణించే అవకాశాలు ఎక్కువ అని వివరించారు.


21 రోజుల అష్ట దిగ్బంధనం పూర్తయినప్పటికీ, ఇంటా, బయటా సామాజిక దూరాన్ని, ఏకాంతాన్ని పాటించాలని, ముఖ్యంగా వృద్ధులు ఈ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలలను మరికొంత కాలం మూసివేయాలని తెలిపారు.  విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. 


అష్ట దిగ్బంధనం లేని రోజు ఒకటి ఉంటే, అష్ట దిగ్బంధనం అమలు చేయవలసిన రోజులు ఒకటి కన్నా ఎక్కువ అవసరమవుతాయన్నారు. 


తమ అధ్యయన నివేదికను ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జనరల్‌లో ప్రచురించబోతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-04-01T01:56:48+05:30 IST