కాక్‌టెయిల్‌ కావాలా?

ABN , First Publish Date - 2022-01-22T05:33:12+05:30 IST

కరోనా మూడోవేవ్‌ వచ్చేసింది. అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఓ వైపు కరోనా.. మ

కాక్‌టెయిల్‌ కావాలా?

కరోనా బాధితులను ఆరాతీస్తున్న ఆసుపత్రుల నిర్వాహకులు 

భయాన్ని సొమ్ము చేసుకుంటున్న వైనం

ముందస్తు జాగ్రత్త అంటూ ప్రచారం

పనిచేస్తోందా? లేదా? అన్నది సందిగ్ధం

ఖమ్మం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడోవేవ్‌ వచ్చేసింది. అక్కడ ఇక్కడా అన్న తేడా లేకుండా రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమైక్రాన భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిపై భయంతో ఉన్న ప్రజలు ముందు జాగ్రత్తగా బూస్టర్‌ డోసుల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు జనం భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో పలు ఆసుపత్రులు టీకాల పేరుతో వసూళ్లకు తెరలేపాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాక్‌టెయిల్‌ టీకా పేరుతో అందినకాడికి దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. కరోనా లక్షణాలున్న, నిర్ధారణైన వారికి దానిని ఇచ్చి మరీ దోపిడీ చేస్తున్నట్టు సమాచారం. 

కరోనాకు కాక్‌టెయిల్‌ మందు అంటూ ప్రచారం.. 

మొదటి, రెండో దశల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు మూడోవేవ్‌ విజృంభిస్తుండటం, దాంట్లో ఒమైక్రాన్‌ లాంటి కేసులు కూడా నమోదవుతుండటంతో వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం బూస్టర్‌ డోసులను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిన కాక్‌టెయిల్‌ టీకాకు ప్రాధాన్యం ఏర్పడింది. కాక్‌టెయిల్‌ వేయించుకుంటే కరోనా స్పైక్‌ ప్రొటీన మానవ కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని, దానివల్ల కరోనాబారిన పడిన వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని, ఒకవేళ చేరినా ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉండదంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. అలాగే ఇది కొవిడ్‌ను ప్రాథమిక దశలోనే నియంత్రించగలుగుతుందన్న అవకాశం ఉందన్న అంశంపైనా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్‌ బారిన పడిన వారు ముందు జాగ్రత్తగా కాక్‌టెయిల్‌ కావాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎలా అయినా సరే వేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దాన్నే ఆసరాగా చేసుకుంటున్న పలు ప్రైవేటు ఆసుపత్రుల వారు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణవగానే కాక్‌టెయిల్‌ కావాలా? ఈ టీకా తీసుకుంటే మంచిదంటూ ప్రచారం చేసి.. విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

అధిక వయస్కులే అత్యధికం.. 

అయితే కాక్‌టెయిల్‌ ఇంజక్షన వేయించుకునే వారిలో అత్యధికశాతం మంది అధిక వయస్కులే ఉన్నట్టు తెలుస్తోంది. కొవిడ్‌ సోకిన వారిలో 65 ఏళ్ల వయసున్నవారు, స్థూలకాయులు, మధుమేహ బాధితులు, కిడ్నీ సంబంధ వ్యాధులున్నవారు, రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉన్నవారు, ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారిని సైతం ఈ ఇంజక్షన కాపాడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వైరస్‌ సోకినట్టు గుర్తించిన వెంటనే దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇతర ప్రయోజనాలు లభిస్తాయన్న అభిప్రాయాలు ఉండటంతో దీనిపై ఆయా వయసు ఉన్నవారు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆయా వ్యక్తులు కాక్‌టెయిల్‌ ఇంజక్షన వేయించుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాల ద్వారా ఆసుపత్రుల వారిని సంప్రదించి కాక్‌టెయిల్‌ తెప్పించుకుంటున్నారు. అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందల సంఖ్యలో ఈ వ్యాక్సిన్లు వేయించుకుంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

బ్లాక్‌ దందా?

ప్రస్తుతం కేసులు పెరుగుతున్న సమయంలో కాక్‌టెయిల్‌ ఇంజక్షన వేయించుకోవాలని భావిస్తున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. వారు ఇంజక్షన కావాలంటూ ఆసుపత్రులను సంప్రదించినప్పుడు వారు అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట్లో రెమెడెసివర్‌ను బ్లాక్‌ చేసి ఎలాంటి దందా చేశారో ప్రస్తుతం కాక్‌టెయిల్‌ ఇంజక్షన్ల వ్యవహారంలోనూ అదే తరహా దందా చేస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు. అత్యధిక వయస్సు ఉండి ఇతర లక్షణాలతో వచ్చిన వారికి కాక్‌టెయిల్‌ వేయాలంటూ చెబుతూనే... అది  ప్రస్తుతం దొరకడం లేదని కొంచెం ఎక్కువ మొత్తంలో వెచ్చించి తెప్పించాలంటూ కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు రోగుల కుటుంబ సభ్యుల నుంచి దోచుకుంటున్నట్టు సమాచారం. అయితే వాస్తవానికి కాక్‌టెయిల్‌లో రెండు డోసులు కలిపి ఉంటుండగా.. సంబంధిత రోగికి ఒక్కటే డోసు వేయాల్సి ఉంటుంది. దాన్ని అదనుగా భావిస్తున్న మరికొన్ని యాజమాన్యాలు అందులోని రెండో డోసును మరో వ్యక్తికి వేస్తూ.. ఒక్కో పేషంట్‌నుంచి రెండు డోసులకు సంబంధించిన నగదుతోపాటుగా అదనంగా రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో డోసు రూ.65వేల వరకు ఉంటుండగా.. కొన్ని ఆసుపత్రుల వారు రోగుల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు కాక్‌టెయిల్‌ డోసు ఇచ్చిన అనంతరం లక్షణాలు తగ్గకపోతే రెమెడెసివిర్‌ సైతం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు పాత పంథా ఉపయోగిస్తూ అదనంగా దోచుకుంటున్నట్టు వినికిడి. అయితే దీనిపై అవగాహన లేనికారణంగా పాజిటివ్‌ వచ్చిన ప్రతీ ఒక్కరూ అప్పులు చేసి మరీ కాక్‌టెయిల్‌ టీకా తీసుకుని ఆర్థికంగా చితికిపోయే ప్రమాదమూ ఉంది. 

కాక్‌టెయిల్‌ పనితీరుపై భిన్నాభిప్రాయాలు

కాక్‌టెయిల్‌ వ్యాక్సినకు ప్రస్తుతం ప్రాధాన్యం పెరిగినా.. అసలు ఏమేరకు అది పనిచేస్తుందనే దానిపై సందిగ్ధం నెలకొంది. కొందరు వైద్యులు సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతుండగా.. మరికొందరు ఈ టీకా అందరికీ పనిచేయదని అభిప్రాయపడుతున్నారు. ఇది ఒమైక్రానకు అయితే అసలే పనిచేయదని, కాక్‌టెయిల్‌ ఎక్కువ రిస్కు ఉన్నవారికి, జబ్బు తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నవారూ ఉన్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు కలిగి ఐదు రోజుల వరకు నయం కాని వారుంటే అప్పుడు కాక్‌టెయిల్‌ వేయొచ్చని ఇంకొందరు వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని కొందరు చెబుతుండగా.. స్వల్ప లక్షణాలుండగానే తీసుకుంటే త్వరగా తగ్గింపోతుందని అనుకోవద్దని మరికొందరు హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్లు మాదిరిగా దీనిని ఎక్కువగా వినియోగిస్తే కొత్త వేరియంట్లు ఏర్పడి సమస్య వచ్చే అవకాశం ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఆక్సిజన అవసరమైన పేషంట్లు, ఐసీయూ, వెంటిలేటర్లపై ఉన్న వారికి ఇది ఉపయోగపడదని మరికొందరు డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో మంత్రి పువ్వాడ కూడా అవగాహన కల్పించాలని చెప్పడం, కాక్‌టెయిల్‌ వ్యాక్సిన వినియోగించే ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని దేశించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రైవేటు ఆసుపత్రుల వారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-22T05:33:12+05:30 IST