ఎన్‌సీఎస్‌ భూముల వేలం వాయిదా

ABN , First Publish Date - 2022-01-19T04:33:22+05:30 IST

లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ భూముల వేలం ప్రక్రియ వాయిదా పడింది. పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్న నేతృత్వంలో మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో భూముల వేలానికి శ్రీకారం చుట్టారు.

ఎన్‌సీఎస్‌ భూముల వేలం వాయిదా
భూముల వేలం నిర్వహిస్తున్న సబ్‌ కలెక్టర్‌ భావ్న

19 ఎకరాలను విభజించాలని పాటదారుల పట్టు

ఉన్నతాధికారులకు నివేదిస్తామని సబ్‌ కలెక్టర్‌ వెల్లడి

బొబ్బిలి రూరల్‌/ సీతానగరం, జనవరి 18: లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ భూముల వేలం ప్రక్రియ వాయిదా పడింది. పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్న నేతృత్వంలో మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో భూముల వేలానికి శ్రీకారం చుట్టారు. వేలం వేస్తున్న భూములు రెండు మండలాల్లో విస్తరించి ఉండగా... ఒకే ధరను నిర్ణయించడంపై పాటదారులు అభ్యంతరం తెలిపారు. వేర్వరు ధరలతో చేపట్టాలని పట్టుబట్టారు. దీంతో వేలం ప్రస్తుతానికి వాయిదా పడింది. చెరకు రైతుల బకాయిల చెల్లింపు కోసం రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయడంలో భాగంగా అధికారులు మంగళవారం వేలం చేపట్టారు. బొబ్బిలి మండలం కింతలివానిపేట రెవెన్యూలోని 14.67 ఎకరాలు, సీతానగరం మండలంలోని 5.23 ఎకరాలు కలిపి 19.90 ఎకరాలను బహిరంగ వేలం వేసేందుకు ప్రకటన ఇచ్చారు. సీతానగరం మండలం లచ్చయ్యపేటలో 5.23 ఎకరాలు, బొబ్బిలి మండలం కింతలివానిపేట, రంగరాయపురం, లింగంవలస గ్రామాలకు చెందిన 14.67 ఎకరాల భూములు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి మొత్తం 19.23 కోట్లకు ఎవరైనా పాడుకోవచ్చని అధికారులు వేలం నిర్వహణలో తొలుత ప్రకటించారు. గతంలో ఈ ఫ్యాక్టరీకి చెందిన 62.47 ఎకరాల భూములను నాలుగు భాగాలుగా విభజించి రూ.27.49 కోట్లకు వేలం వేశారని, అవన్నీ ఒకే రెవెన్యూలో ఉన్నాయని పాటదారులు తెలిపారు. ఈసారి వేలం వేస్తున్న భూములు రెండు మండలాల పరిధిలో ఉన్నాయని, అన్నిటికీ ఒకే రకమైన ధరను నిర్ణయించడం సహేతుకం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగోవంతు భూములకు మాత్రమే అధికారులు చెప్పిన ధర ఉంటుందని, మిగిలిన భూములకు అంత ధర లేదన్నది వారి వాదన.  వేలంలో 14 మంది పాల్గొన్నారు. భూములను విభజించి వేలం వేస్తేనే తాము పాడగలమని వారు స్పష్టం చేయడంతో వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నామని సబ్‌కలెక్టర్‌ తెలిపారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడిన తరువాత వేలం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీతానగరం, బొబ్బిలి  తహసీల్దార్లు అప్పలరాజు, రామస్వామి, సర్వేయర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా  34, 762  క్వింటాళ్ల  పంచదార నిల్వలను రూ. 11.54 కోట్లకు ఇటీవల బహిరంగ వేలం వేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు కూడా మంగళవారం వాదన జరిగి మళ్లీ వాయిదా పడింది. రెండేళ్ల నుంచి రైతులకు ఎనసీఎస్‌ యాజమాన్యం రూ.16.35 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  

అత్యాశా? అవగాహన లోపమా?

పార్వతీపురం, జనవరి 18 : ఎనసీఎస్‌ భూముల వేలంపై రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. వేలం పూర్తయితే తమకు బిల్లులు వస్తాయని ఆశించారు. అందుకు భిన్నంగా జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం వాయిదా పడడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల్లో అవగాహన లోపమే కారణంగా పలువురు భావిస్తున్నారు. ఆ భూములకు ఎకరా సుమారు కోటి రూపాయలు నిర్ణయించారు. కానీ ఆ ప్రాంతంలో ప్రభుత్వ ధర ఎకరా రూ.11 లక్షలే ఉందని సమాచారం. మొత్తం 19.90 ఎకరాలకు రూ.19 కోట్ల 23 లక్షలుగా ఎలా నిర్ణయించారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అంతమొత్తం చెల్లించి...భూములు సొంతం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో సమస్య పరిష్కారం కాదు. తమకు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. బకాయిలపై కర్మాగార యాజమాన్యం ఎందుకు జాప్యం చేస్తోందని అధికారులూ నిలదీయడం లేదని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పంచదార అమ్మకాల సమయంలో వచ్చిన లాభాల సంగతేంటో బయట పెట్టడం లేదు. భూములను ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించడం మంచిదే కానీ భారీగా విలువ నిర్ణయిస్తే ఎవరు కొంటారనేది ప్రశ్నార్థకంగా ఉంది. సంక్రాంతి పూట చెరకు రైతులు ఇళ్లల్లో పండుగ చేసుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. 


Updated Date - 2022-01-19T04:33:22+05:30 IST