నాయక్‌ పై అంత కక్షేల నాయకా?

ABN , First Publish Date - 2022-02-27T07:03:01+05:30 IST

అలనాటి పాలెగాడు వంటి వ్యక్తి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. అనవసర సమస్యలు సృష్టించి, వాటివల్ల నష్టపోయే వారిని...

నాయక్‌ పై అంత కక్షేల నాయకా?

అలనాటి పాలెగాడు వంటి వ్యక్తి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడు అలాగే ఉన్నాయి. అనవసర సమస్యలు సృష్టించి, వాటివల్ల నష్టపోయే వారిని, ఇబ్బంది పడే వారిని చూసి రాక్షసానందం పొందడం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి దైనందిన చర్యగా మారింది. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టకుండా గిట్టని వారిని వేధించడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా మార్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం కల్పించిన ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేయడం ద్వారా నాయకులను కాళ్లబేరానికి రప్పించి కొంతకాలం పాటు ఆనందం పొందారు. కోల్పోయామనుకున్న ప్రయోజనాలను సాధించుకోవడమే తాము సాధించిన ఏకైక విజయమని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పుకోవలసి వచ్చిందంటే ప్రభుత్వ ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబాయ్‌ హత్య కేసులో దోషులకు అండగా నిలుస్తూ బాధితులనే నిందితులుగా చిత్రించే ప్రయత్నాలలో ప్రభుత్వ పెద్దలు ఉండటం జీర్ణించుకోలేని విషయం. ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ సినిమా విషయంలో కూడా ప్రభుత్వం పంతానికి పోవడం పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే పేదల కోసమే ఆ పని చేశామన్నారు. సినిమా ప్రముఖులను తన వద్దకు రప్పించుకుని పాహిమాం అన్నంతలా వేడుకునేలా చేసి తన అహాన్ని సంతృప్తిపరచుకున్న జగన్‌్‌రెడ్డి ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదల సందర్భంగా తనలోని అపరిచితుడిని బయటకు వదిలారు. టికెట్ల ధరను పెంచే విషయం నిర్ణయించడానికి కమిటీ వేశామని చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఏ కమిటీ చెప్పకుండానే, ప్రజలు ఎవరూ ఆర్తనాదాలు చేయకపోయినా ఏకపక్షంగా టికెట్ల ధరలు తగ్గించిపడేసిన జగన్‌్‌ రెడ్డికి ఇప్పుడు ధరలు పెంచడానికి నివేదిక అవసరమా? ‘భీమ్లా నాయక్‌’ సినిమా రిలీజ్‌ అయ్యేవరకు టికెట్ల ధరలు పెంచకూడదని జగన్‌్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు కనుక కమిటీ రిపోర్టు ఇవ్వడం లేదు. రేట్లు తగ్గించిన తర్వాత ఆదాయం తగ్గినా ఫర్వాలేదనుకున్న కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేశారు. వాటిలో కొన్నింటిని ప్రజలు ఆదరించారు. నాగార్జున నటించి, నిర్మించిన ‘బంగార్రాజు’ వంటి చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపించిన నాని నటించిన ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా విడుదలైనప్పుడు మాత్రం జగన్‌్‌రెడ్డిలోని పాలెగాడు ఇప్పటి మాదిరిగానే బయటికొచ్చాడు. నన్నే విమర్శిస్తావా అంటూ ‘శ్యామ్‌సింగరాయ్‌’ ప్రదర్శిస్తున్న థియేటర్లపైకి తనిఖీల పేరిట అధికారులను ఉసిగొల్పారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వంతు వచ్చింది. జనసేనానిగా జగన్‌ ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తనను విమర్శించడాన్ని సహించలేని జగన్‌్‌రెడ్డి ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’పై పడ్డారు. పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా శుక్రవారం విడుదలైంది. అంతే, రెవెన్యూ అధికారులు అందరూ తమ పనులు వదిలేసి సదరు చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో తనిఖీలకు బయలుదేరారు. ఫలానా సినిమా విడుదల సందర్భంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో పేర్కొన్నారంటే పాలకుల నైజం ఏమిటో తెలుస్తుంది. ‘భీమ్లా నాయక్‌’కు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అన్న టాక్‌ సొంతం చేసుకుంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించిన పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పలు థియేటర్ల వద్ద ఆందోళన చేశారు. గతంలో ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే వారి అభిమానులు థియేటర్ల వద్ద ఘర్షణ పడేవారు. ఇప్పుడు ప్రభుత్వంతో ఘర్షణ పడే పరిస్థితులు కల్పించిన ఘనత జగన్‌్‌రెడ్డి సొంతం. తెలంగాణలో కూడా ‘భీమ్లా నాయక్‌’ సినిమా విడుదలైంది. నిర్మాతలు కోరిన విధంగా ఐదో ఆటకు ప్రభుత్వం అనుమతించింది. టికెట్‌ ధరలను గతంలోనే పెంచారు. తెలంగాణలో సినిమా ప్రదర్శన సాఫీగా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే వివాదంగా ఎందుకు మారుతోందన్నది ఇక్కడ ప్రశ్న. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సినిమా ప్రముఖులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా వారి సమస్యలను మాత్రం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు.


నాడలా.. నేడిలా!

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి చొరవ తీసుకున్నారు. స్టూడియోల నిర్మాణానికి, సినీప్రముఖులు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ భూములు కేటాయించారు. ఫలితంగా తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చింది. హిందీ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగులు జరుపుకుంటున్నాయి. వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఉమ్మడి రాష్ర్టానికి రాజధాని కావడంతో సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు సినిమా షూటింగులు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు విదేశాల్లో షూటింగులు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతోంది. హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందింది. రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జగన్‌్‌రెడ్డి పుణ్యమా అని పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇలాంటి స్థితిలో సినిమా పరిశ్రమను ఏపీకి ఆహ్వానించాలంటే వారికి కావలసినవి సమకూర్చాలి. జగన్‌్‌రెడ్డి ఈ మార్గాన్ని వదిలేసి హీరోలను, నిర్మాతలను ఏడిపించడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన అనేక సినిమాలు గతంలో విడుదలయ్యాయి. వాటిలో కొన్ని విజయం సాధించగా కొన్ని ఫ్లాపయ్యాయి. కానీ ఇప్పటిలా ప్రభుత్వ జోక్యం ఉండేది కాదు. అధికారులెవరూ థియేటర్లపై దాడులకు వెళ్లలేదు. ‘భీమ్లా నాయక్‌’ సినిమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సమస్య కావడం విషాదం. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూసి ఇతర ప్రాంతాల ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగితం కూడా పాలకులకు లేకుండా పోయింది. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో కూడా పంతం పెరిగిపోయింది. ఫలితంగా ‘భీమ్లా నాయక్‌’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పవన్‌ సినిమాలకు ఉండే క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి కొన్నిచోట్ల వైసీపీ నాయకులు టికెట్లను టోకుగా కొనుగోలు చేసి బ్లాక్‌లో విక్రయించినట్టు వార్తలు వచ్చాయి. ‘ఇదేదో బాగుందే! మనవాళ్లకు ఆదాయం సమకూరుతోంది కనుక ఇలాగే కొనసాగిద్దాం’ అని ప్రభుత్వ పెద్దలు ఆలోచించే అవకాశం లేకపోలేదు అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. తాజా వివాదం నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. తనదాకా వస్తేగానీ అన్న అర్థం వచ్చేలా పాస్టర్‌ మార్టిన్‌ నియో మోలర్‌ చేసిన వ్యాఖ్యలను పవన్‌ ఉటంకించారు. ‘‘మొదట్లో నాజీలు సోషలిస్టుల కోసం వచ్చారు. నేను సోషలిస్టును కాదు గనుక స్పందించలేదు. తర్వాత వాళ్లు ట్రేడ్‌ యూనియన్ల నాయకుల కోసం వచ్చారు. నేను యూనియన్లలో లేను గనుక అప్పుడూ స్పందించలేదు. తర్వాత యూదుల కోసం వచ్చారు. నేను యూదును కాదు గనుక స్పందించలేదు. చివరిగా వాళ్లు నా కోసం వచ్చారు. అప్పుడు నా కోసం మాట్లాడ్డానికి ఒక్కరూ లేరు’’ అని మార్టిన్‌ చెబుతారు. సినీ ప్రముఖులను దృష్టిలో పెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ ఈ ఫేమస్‌ కొటేషన్‌ను ప్రస్తావించి ఉంటారు. అవును మరి ‘భీమ్లా నాయక్‌’ సినిమాకు ఆటంకాలు కల్పిస్తున్న జగన్‌్‌రెడ్డి ప్రభుత్వంపై నోరెత్తడానికి ఒక్కరూ ముందుకు రాకపోవడం విషాదమే. పవన్‌ కల్యాణ్‌కు అండగా నిలబడితే జగన్‌్‌రెడ్డి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని వారు భయపడుతూ ఉంటారు. పెద్ద సినిమాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విడుదల తేదీలు కూడా ప్రకటించారు. ‘భీమ్లా నాయక్‌’ ఎలా పోయినా ఫర్వాలేదు -తమ సినిమాలు విడుదలయ్యే నాటికి టికెట్ల ధరలను పెంచితే చాలు అని భావిస్తూ ఉండవచ్చు. సినీ ప్రముఖుల ఈ బలహీనతే జగన్‌్‌రెడ్డి వంటి వారికి బలంగా మారుతోంది. ‘భీమ్లా నాయక్‌’ చిత్రంపై క్రేజ్‌ తగ్గిపోగానే జగన్‌్‌రెడ్డి ప్రభుత్వం టికెట్ల ధరలను ఎంతో కొంత పెంచవచ్చు. ఈ చర్యల వల్ల పవన్‌ కల్యాణ్‌ను ఏడిపించాం అని మానసిక ఆనందం పొందేవారు పొందుతుండవచ్చు గానీ ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించకపోతే ఎలా? థియేటర్లలో తనిఖీలను సమర్థించుకోవడానికి మంత్రి పేర్ని నాని శుక్రవారం నానా తంటాలు పడ్డారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సెగ ఆయనకు బాగానే తగిలిందని ఆయన ముఖం చూస్తే తెలుస్తుంది. పేర్ని నానిపై కాపు సామాజిక వర్గం నుంచి ముప్పేట దాడి జరిగి ఉంటుంది. టికెట్ల ధరలు గిట్టుబాటు కావడం లేదనుకుంటే పవన్‌ కల్యాణ్‌ కూడా తన సినిమా విడుదల వాయిదా వేసుకొని ఉండవచ్చు కదా? అని పేర్ని నాని ఉచిత సలహా ఇస్తున్నారు. సినిమాల విషయంలో ప్రభుత్వ పెత్తనం ఏమిటో ఆయన చెప్పాలి. జగన్‌్‌రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చింది ఇలాంటి గిల్లికజ్జాలు పెట్టుకోవడానికేనా? టికెట్ల ధరలు తగ్గిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదే? పొరుగు రాష్ర్టాల కంటే ఎక్కువ ధరలకు పెట్రోల్‌, డీజిల్‌ అమ్ముతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా? సినిమా టికెట్ల గురించి మాట్లాడే మంత్రులు ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నిజానికి జగన్‌్‌రెడ్డి అధికారంలోకి రావడానికి పవన్‌ కల్యాణ్‌ కూడా పరోక్షంగా కారకుడే. అదేవిధంగా ఉద్యోగులు కూడా! అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ సొంతంగా పోటీ చేసి జగన్‌్‌రెడ్డికి మేలు చేశారు. తాము కుడిచేత్తో, ఎడమ చేత్తో ఓట్లు వేసి జగన్‌్‌రెడ్డిని గెలిపించుకున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌, ఉద్యోగులకు కూడా జగన్‌్‌రెడ్డి వాతలు పెడుతున్నారు. వీళ్లు మాత్రమే కాదు- తాను అధికారంలోకి రావడానికి కారకులైన వారందరి పైనా ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా జగన్‌్‌రెడ్డి చర్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అవడానికే తాను పుట్టానని జగన్‌్‌రెడ్డి బలంగా నమ్ముతారు. 2014లోనే తాను ముఖ్యమంత్రి అవాల్సింది, కాకుండా పోవడానికి పవన్‌ కల్యాణ్‌తో పాటు కొన్ని వర్గాల ప్రజలు కారణమని జగన్‌్‌రెడ్డి భావిస్తున్నారేమో తెలియదు. తండ్రి రాజశేఖర రెడ్డి మరణానంతరమే ముఖ్యమంత్రి కావాలని జగన్‌్‌రెడ్డి తలపోశారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించలేదు. దీంతో ఆ పార్టీపై పగబట్టారు. 2014లో ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడానికి కారణమైన వారిపై ఇప్పుడు ప్రతీకార చర్యలకు దిగారు. జగన్‌్‌రెడ్డి ఇలా తన పగను తీర్చుకుంటూ ఉండవచ్చు గానీ 2024లో ఆయన తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి చాలామంది ప్రతినబూనుతున్న విషయాన్ని ఎందుకో విస్మరిస్తున్నారు. జగన్‌్‌రెడ్డి చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్‌ కూడా నవ్వులపాలవుతోంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు బారులు తీరుతున్నాయి. విదేశాలను తలపించేలా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కరు కూడా రావడం లేదన్న దిగులు ముఖ్యమంత్రి జగన్‌్‌రెడ్డికి ఉండివుంటే సిల్లీ వివాదాలు సృష్టించి ఆనందిస్తూ కూర్చోరు.


బాబాయ్‌ హత్య వెనుక...

జగన్‌్‌రెడ్డి ప్రభుత్వ చర్యలు కొన్ని మరీ విపరీతంగా అనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం ఇలాంటి విపరీతాల్లో ముందు వరుసలో ఉంటుంది. వివేకా హత్య కేసు నిందితులలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారిపై కేసు పెట్టారు. ఈ కేసు విషయంలో తదుపరి చర్యలు అన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది కానీ లేకపోతే పరిస్థితి ఏమిటి? దర్యాప్తులో భాగంగా నిందితులను హింసించకూడదని చట్టం చెబుతుండటం నిజమే గానీ వివేకా కేసులో చోటుచేసుకుంటున్న ట్విస్ట్‌లను గమనిస్తున్న వారికి అసలు దోషులను తప్పించడానికే పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవహారం నడుస్తోందని అనిపిస్తోంది. దోషులను తప్పించడం కోసం బాధితులనే దోషులుగా చిత్రించే ప్రయత్నాలు జరగడం, వాటికి ముఖ్యమంత్రి జగన్‌్‌రెడ్డి అండదండలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఆ హత్య వెనుక తెలుగుదేశం నాయకులు ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్న జగన్‌్‌రెడ్డి ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ హత్యపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగా మాట్లాడకుండా హైకోర్టుకు వెళ్లి గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణకు నిరాకరించారు. దీంతో అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉందని పసిగట్టిన వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ తుది దశకు చేరింది. దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి వంటి వారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హత్య వెనుక సూత్రధారుల ముసుగులు కూడా తొలగిపోతున్నాయి. దీంతో ఉలిక్కిపడిన ప్రముఖులు నయా స్కెచ్‌ రూపొందించారు. సీబీఐ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం వారిపైనే కేసు పెట్టించారు. సీబీఐ అంటేనే సామాన్య ప్రజలు భయపడతారు. అలాంటిది సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టారంటే దీని వెనుక ఉన్నవారు గుండెలు తీసిన బంట్లని భావించక తప్పదు. ముఖ్యమంత్రి జగన్‌్‌రెడ్డి ఆమోదం లేకుండా ఇదంతా జరుగుతుందని భావించలేం. సీబీఐ కేసులలో స్వయంగా నిందితుడైన జగన్‌్‌రెడ్డికి ఇంతటి తెగింపు ఎలా సాధ్యం? పైవాళ్ల అండ చూసుకొనే ఆయన ఇలా చేస్తుండవచ్చు. రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు పట్టుబట్టి ఉంటే ఇప్పటికే జగన్‌్‌రెడ్డికి బెయిలు రద్దై జెలుకు వెళ్లవలసి వచ్చేది. అయినా జరగలేదంటే ఎవరో కాపాడుతున్నారని భావించాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినే టార్గెట్‌ చేసుకున్నారు. జగన్‌్‌రెడ్డి సొంత పత్రికలో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను పరిశీలిస్తే వివేకా కేసులో దోషులకు జగన్‌ మద్దతుగా నిలుస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఎన్నికల సమయంలో బాబాయ్‌ హత్యను వాడుకుని రాజకీయంగా ప్రయోజనం పొందిన జగన్‌్‌రెడ్డి, ఇప్పుడు అసలు దోషులు బయటకు రాకుండా ఉండటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నదే ప్రశ్న? ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి మాత్రమే. అయితే అసలు వాస్తవం వెలుగు చూడకుండా అడ్డుకోవడం కోసం నిందితుల కుటుంబసభ్యులతో రకరకాల పిటిషన్లను కోర్టుల్లో వేయించడమే కాకుండా వాటికి జగన్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో జగన్‌్‌రెడ్డి ఎవరి పక్షం వహిస్తున్నారో అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి హత్య వెనుక ఆయన అల్లుడు, బావమరిది ఉన్నారని దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను జగన్‌్‌రెడ్డి పత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. దీన్నిబట్టి వివేకానంద రెడ్డిని ఆస్తి కోసం సొంత కూతురు, అల్లుడు, బావమరిది కలసి హత్య చేయించారని సరికొత్త ప్రచారానికి తెర తీయించారు. ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోతుందా అని అనుకుందామంటే.. డాక్టర్‌ సునీత దంపతుల పోరాటం అందుకు భిన్నంగా ఉంది. వారే దోషులై ఉండివుంటే అసలు దోషులను పట్టుకోవడానికి సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు? ఆ తర్వాత కూడా కేసు ఎక్కడా నీరుకారకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు కదా? డాక్టర్‌ సునీత మొదటి నుంచి తనకు భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డిపై అనుమానం ఉందని చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పరోక్షంగా అదే అభిప్రాయం వ్యక్తమైంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా వారిద్దరూ తనకు డబ్బు, పొలం ఆఫర్‌ చేసినట్టు చెప్పారు. జగన్‌్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. డబ్బు, అధికారం పుష్కలంగా ఉంది. దస్తగిరి డబ్బుకు ఆశపడి అప్రూవర్‌గా మారాడని చేస్తున్న ప్రచారం నిజమని ఎలా నమ్మగలం? డబ్బు కావాలంటే ఎంతైనా ఇచ్చే శక్తి జగన్‌ అండ్‌ కోకు ఉంది. డాక్టర్‌ సునీతకు కానీ, సీబీఐ అధికారులకు కానీ అంత శక్తి లేదు. అంతే కాదు వివేకా కుటుంబసభ్యులపై అనుమానం ఉంటే అవినాశ్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి గుండెపోటు సిద్ధాంతాన్ని తెర మీదకు ఎందుకు తెచ్చారు? అయినా కన్ను మాదే.. వేలు మాదే అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన జగన్‌్‌రెడ్డి ఇప్పుడు దోషులుగా ముద్రపడిన వారికి అండగా ఎందుకు నిలుస్తున్నారన్నదే ప్రశ్న. 


మామూలోళ్లు కాదు!

జగన్‌్‌రెడ్డి స్థానంలో ఎవరున్నా సొంత బాబాయ్‌ని హత్య చేయించిన వారిని శిక్షించాలనే కోరుకుంటారు. అందుకు సహకరిస్తారు. జగన్‌్‌రెడ్డి అందుకు భిన్నంగా హతుడు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులనే అనుమానించేలా తన సొంత మీడియా ద్వారా ఎందుకు ప్రచారం చేయిస్తున్నారు? ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే జగన్‌ అండ్‌ కో మామూలు మనుషులు కారు. తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరులు అని భావించవలసి ఉంటుంది. అందుకే అవినీతికి సంబంధించిన కేసులలో కూడా విచారణ ముందుకు సాగకుండా జగన్‌ అండ్‌ కో అడ్డుకోగలుగుతున్నారు. పశు దాణా కుంభకోణంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సీబీఐ కోర్టు వరుసగా శిక్షలు వేస్తోంది. అనేక సంవత్సరాలుగా ఆయన జైలు జీవితానికే పరిమితమయ్యారు. జగన్‌్‌రెడ్డిపై కేసులు నమోదై పదేళ్లవుతోంది. ఇంతవరకు అసలు విచారణ ప్రారంభం కాలేదు. అలా జాప్యం చేయగలిగారంటే జగన్‌ అండ్‌ కో ఎంతటి ఘటనాఘటన సమర్థులో తెలుస్తోంది కదా! ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కొత్త ట్విస్టులు తెర మీదకు తేవడం ద్వారా అసలు దోషులు తప్పించుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో వివేకా హత్య తనకు కొంత మేరకు ఉపయోగపడింది కనుక ఇప్పుడు అసలు దోషులతో తనకు పని ఉంటుందని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నారేమో తెలియదు. డాక్టర్‌ సునీత మానసికంగా బలహీనురాలు కాదు గనుక సరిపోయింది గానీ లేకపోతే జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచార విన్యాసాలకు బెంబేలెత్తిపోయి కేసు దర్యాప్తూ వద్దు- ఏమీ వద్దు అని అస్త్రసన్యాసం చేసి ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి వెనుక జగన్‌్‌రెడ్డి హస్తం ఉందని కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అది నిజమైతే ఇప్పుడు వివేకాను ఆయన కుటుంబ సభ్యులే హత్య చేయించారని జగన్‌ అండ్‌ కో చేస్తున్న ప్రచారం కూడా నిజమని నమ్మవచ్చు. ఏది ఏమైనా సీబీఐ అధికారులకు ఈ కేసు సవాలుగా మారింది. అసలు దోషులను పట్టుకుంటారా? లేదా? అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి ఉండాలి. ఈలోపు జగన్‌ అండ్‌ కో ఎన్ని ప్రచారాలకు తెర తీస్తుందో చూద్దాం. సొంత కుటుంబసభ్యులు కూడా ఈసడించుకుంటున్న జగన్‌్‌రెడ్డి పాలనా ఒక పాలనేనా!

ఆర్కే




యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-02-27T07:03:01+05:30 IST