నేచర్‌... డేంజర్‌!!

ABN , First Publish Date - 2020-06-05T10:30:28+05:30 IST

ప్రకృతి ప్రకోపం మనిషి మనుగడను ప్రశ్నిస్తోంది. ఆధునిక సమాజంలో ప్రజలు అనుసరిస్తున్న వింత పోకడలు, ..

నేచర్‌... డేంజర్‌!!

ప్రమాదం అంచున పర్యావరణం

పారిశ్రామికీకరణ, కాలుష్యంతో విఘాతం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం


నెల్లూరు  (వైద్యం), జూన్‌ 4 : ప్రకృతి ప్రకోపం మనిషి మనుగడను ప్రశ్నిస్తోంది. ఆధునిక సమాజంలో ప్రజలు అనుసరిస్తున్న వింత పోకడలు, విలాసాల కోసం పర్యావరణ సమతుల్య తను పట్టించుకోకపోవడంతో జీవ వైవిధ్యం దెబ్బతిని విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతి తప్పిన రుతు పవనాలు, కాలుష్యం, చెట్ల నరికివేత, సహజ నిక్షేపాల వెలికితీత, విపరీతంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ వంటి వాటితో ఉష్ణోగ్రతలు పెరిగి భూగోళం మండుతోంది. పర్యవసానంగా భూకంపాలు, సునామీలు సంభవిస్తున్నాయి.


భూమికి కవచంలా ఉన్న ఓజోన్‌ పొరకు తూట్లు పడుతున్నాయి. పరిశ్రమల కాలుష్యం కారణంగా సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లాంటి విష వాయువులు విడుదలై జీవుల మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 1972 నుంచి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. ఏటా జూన్‌ 5వతేదీన పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది. ఈ ఏడాది ప్రకృతి కోసం సమయం కేటాయించండి అన్న నినాదాన్నిచ్చింది.


జిల్లాలో పరిస్థితి మరీ దారుణం

రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత ఆ స్థాయి పరిశ్రమలు నెల్లూరుకు తరలివస్తున్నాయి. తడ నుంచి రామయ్యపట్నం దాకా 92 కి.మీ విస్తరించి ఉన్న సముద్ర తీరంలో 13 కిలోమీటర్ల పరిధిలోనే 27 థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమలు నిర్మిస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ పరిశ్రమల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి పంటల దిగుబడి 30 శాతం తగ్గుతోంది. ఆక్వా పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఆ పరిశ్రమల ద్వారా రోజుకు రెండు లక్షల టన్నుల బూడిద వెదజల్లబడి తాగు, సాగునీరు కలుషితమై మనుషులు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.


థర్మల్‌ కేంద్రాల వేడి వల్ల సముద్రంలోని వేల టన్నుల రొయ్యలు, చేపలు చనిపోయి మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక వాహన కాలుష్యం వల్ల జీవ జాతుల మనుగడ కష్టతరంగా మారుతోంది. గతంలో 43 డిగ్రీలకే అల్లాడిపోయిన జిల్లావాసులు ఈ ఏడాది 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఫ్రిజ్‌లు, ఏసీల వాడకం పెరగడంతో క్లోరోఫ్లోరో కార్బన్లు విడుదలై ఓజోన్‌ పొరను మరింత దెబ్బతీస్తున్నాయి. 


గ్రీన్‌ బెల్టుపై నిర్లక్ష్యం

మనం పెంచే ఒక చెట్టు వంద మందికి ఆక్సిజన్‌ అందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రతి పరిశ్రమకు కేటాయించే 100 ఎకరాల్లో 30 ఎకరాలు (గ్రీన్‌ బెల్ట్‌) చెట్లు పెంచాలి. ఈ నిబంధనను ఏ పరిశ్రమ కూడా అమలు చేస్తున్న దాఖలాల్లేవు. దీనికితోడు రహదారుల విస్తరణకు చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేయడం, మరలా మొక్కలు నాటక పోవడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు కనీసం ఒక మొక్క అయినా నాటాలని పర్యావరణ ప్రేమికులు పదేపదే చెబుతున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం కొంత మేర తగ్గి ప్రకృతి పునరుజ్జీవానికి కొంత వరకు మార్గం ఏర్పడినా ప్రజల జీవన శైలిలో మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నిపుణులు అంటున్నారు.


కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చొరవ ...ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ శాఖ ఈఈ

జిల్లాలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పరిశ్రమ 30 శాతం గ్రీన్‌ బెల్ట్‌ నిబంధనలు పాటించేలా కృషి చేస్తున్నాం. పరిశ్రమల అనుమతుల సమయంలో కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం.

Updated Date - 2020-06-05T10:30:28+05:30 IST