ఉధృతిలో ఊరట

ABN , First Publish Date - 2021-05-12T07:05:51+05:30 IST

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల తగ్గుదల ప్రారంభమైందని.. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ క్షీణతకు ఇది సూచిక అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల వరకు రెండో దశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌తో...

ఉధృతిలో ఊరట

  • 18 రాష్ట్రాల్లో కేసుల తగ్గుదల.. జాబితాలో మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌
  • సెకండ్‌ వేవ్‌ క్షీణతకు ఇది ప్రారంభ సూచిక: కేంద్రం
  • రెండు నెలల అనంతరం యాక్టివ్‌ కేసుల తగ్గుదల
  • 14 రోజుల అత్యల్ప సంఖ్యలో పాజిటివ్‌లు నమోదు
  • కొత్తగా 3.29 లక్షల కేసులు; 3,876 మరణాలు
  • కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా 16 రాష్ట్రాల్లో వృద్ధి
  • తొలిసారి మహారాష్ట్రను మించి కర్ణాటకలో పాజిటివ్‌లు
  • గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 26 మంది మృతి
  • అంబులెన్స్‌ల నుంచి గంగలోకి మృతదేహాలు
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ వద్ద నదిలోకి శవాలు


న్యూఢిల్లీ, మే 11: దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల తగ్గుదల ప్రారంభమైందని.. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ క్షీణతకు ఇది సూచిక అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల వరకు రెండో దశ ఉధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు మరో 14 రాష్ట్రాల్లో ప్రస్తుతం వైరస్‌ నెమ్మదించిందని తెలిపింది. అయితే, దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడు, కేరళలో కేసుల పెరుగుదల కొనసాగుతోందని వివరించింది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ సహా 16 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. 13 రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు లక్షపైగా ఉన్నాయని చెప్పింది. 26 రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు 15పైగా ఉందని తెలిపింది. మరోవైపు దేశంలో సోమవారం 3,29,942 కేసులు నమోదయ్యాయి. గత 14 రోజుల్లో ఇవే తక్కువ. కొత్తగా 3.56 లక్షల మంది కోలుకున్నారు. రెండు నెలల తర్వాత కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం నాటికి 37.15 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. గత 61 రోజుల్లో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజే యాక్టివ్‌ కేసులు 30 వేలపైగా తగ్గాయి. కాగా, కరోనాతో దేశంలో మంగళవారం 3,876 మంది చనిపోయారు. మొత్తమ్మీద పాజిటివ్‌ రేటు 21గా ఉందని కేంద్రం వివరించింది మూడు రోజుల్లో రాష్ట్రాలకు 7 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికి 90 లక్షలపైగా టీకాలు ఉన్నట్లు పేర్కొంది.


మహారాష్ట్రను మించిన కర్ణాటక

కరోనా ప్రారంభం నుంచి దేశంలో రోజువారీ అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యలో అతి కొద్ది రోజులు కేరళలో ఎక్కువ పాజిటివ్‌లు వచ్చాయి. ఫిబ్రవరి మధ్య నుంచి ప్రారంభమైన సెకండ్‌ వేవ్‌లో మాత్రం మొదటినుంచి మహారాష్ట్రలోనే గరిష్ఠ సంఖ్యలో కేసులు వచ్చాయి. తాజాగా కర్ణాటక పాజిటివ్‌లతో పాటు మరణాల్లోనూ దానిని అధిగమించింది. సోమవారం కర్ణాటకలో 39,305 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా, 596 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 37,236 కేసులు రాగా, 549 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో మరో 12,481 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. 13,583 మంది కోలుకున్నారు. 347 మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 17.76కు తగ్గింది. దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ మూడు వారాలుగా లాక్‌డౌన్‌ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. సగానికి పైగా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది. దీంతో ప్రభుత్వం పొడిగింపు ఆలోచన చేస్తోంది. ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో శుక్రవారం నుంచి ఏడు రోజులు లాక్‌డౌన్‌ అమలు కానుంది.


గోవా ఆస్పత్రిలో 26 మంది మృతి

ఆక్సిజన్‌ కొరత, సరఫరా లోపాలతో ఆస్పత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గోవాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దారు ణం జరిగింది. రాజధాని పనాజీలోని గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు 26 మంది కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం, కొవిడ్‌ వార్డులకు సరఫరాలో లోపం వల్ల ఈ ఉదంతం జరిగి ఉండొచ్చని సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన వైద్య కళాశాలలో ఆక్సిజన్‌కు మాత్రం కొరత లేదని చెప్పారు. కాగా, వైద్య శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె మాత్రం సోమవారం నాటికి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందని తెలిపారు. 





అంబులెన్స్‌ నుంచి గంగలోకి శవాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మంగళవారం గంగా నదిలో కొన్ని మృతదేహాలు కనిపించాయి. వీరంతా కరోనా మృతులేనని తెలుస్తోంది. సోమవారం బిహార్‌లోని బక్సర్‌ జిల్లా చౌసా వద్ద ఇదే తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. యూపీ నుంచే తమ రాష్ట్రంవైపు శవాలు కొట్టుకొచ్చాయని బిహార్‌ అధికారులు చేస్తున్న వాదన వాస్తవమని తెలుస్తోంది. అంబులెన్స్‌ల్లో తీసుకొచ్చిన మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌- బిహార్‌ సరిహద్దులో బలియా వద్ద ఉన్న జై ప్రభ వంతెన మీదుగా గంగా నదిలోకి విసిరేశారని బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్‌ సిగ్రివాల్‌ తెలిపారు. గుర్తుతెలియని, బంధువులు తీసుకెళ్లని శవాలను ఇలా పడేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని శ్మశానాల్లో రద్దీ పెరగడం, అక్కడకు వెళితే కరోనా వ్యాపిస్తుందన్న భయంతో స్థానికులు గంగానది ప్రవాహంలో శవాలను వదిలివేస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై దర్యాప్తు జరగాలని, మోదీ ప్రభుత్వం గంగానది స్వచ్ఛతకు కట్టుబడి ఉన్నదని, సంబంధిత రాష్ట్రాలు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ ట్వీట్‌ చేశారు.



బిహార్‌కు కొట్టుకొస్తున్న మరిన్ని మృతదేహాలు

యూపీ నుంచి బిహార్‌కు గంగానదిలో కొట్టుకొస్తున్న మృతదేహాల వెల్లువ మంగళవారం కూడా కొనసాగింది. యూపీతో రాష్ట్ర సరిహద్దుల్లోని ఓ వారధి కింద భారీగా మృతదేహాలు దర్శనమిచ్చాయి. సోమవారం బక్సర్‌ జిల్లాకు కొట్టుకొచ్చిన వాటి సంఖ్య 71 వరకూ ఉంటుందని, యూపీ అధికారులే దీనికి కారణమని బిహార్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అంబులెన్సు డ్రైవర్లు మృతదేహాలను ఒక బ్రిడ్జి మీది నుంచి నదిలోకి విసిరేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. యూపీలోని బలియా, బిహార్‌లోని సరన్‌కు మధ్య ఉన్న జైప్రభ సేతు అనే వంతెన వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని బిహార్‌ బీజేపీ ఎంపీ జనార్దన్‌ సింగ్‌ సిగ్రివాల్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-12T07:05:51+05:30 IST