బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-07-08T08:56:48+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా

మంత్రులు, పార్టీ ఎంపీల వరుస రాజీనామాల నేపథ్యంలో నిర్ణయం

పార్టీ నేత క్రిస్‌ పించర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో రేగిన రగడ


లండన్‌, జూలై 7: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (58) తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీ క్రిస్‌ పించర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నేపథ్యంలో సహచర మంత్రులు, పార్టీ ఎంపీలు వరుసగా రాజీనామాలు చేస్తుండడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి దిగిపోవాలని బోరిస్‌ నిర్ణయించుకున్నారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే దాకా ఆయనే ఆ పదవిలో కొనసాగనున్నారు. అక్టోబరులో కన్జర్వేటివ్‌ పార్టీ సదస్సు జరిగేనాటికి కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. అప్పటిదాకా బోరిసే బ్రిటన్‌ ప్రధానిగా ఉంటారు. టామ్‌వర్త్‌ ఎంపీ క్రిస్‌ పించర్‌.. 2018 జనవరి 24న లండన్‌లోని సోహోలో ఒక గే బార్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తమను లైంగికంగా వేధించారని.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి ఇబ్బంది పెట్టారని ఇద్దరు యువకులు ఆరోపించారు. కానీ, ఎక్కడా అధికారికంగా ఫిర్యాదు నమోదు కాలేదు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రిస్‌పించర్‌ను పార్టీ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా బోరిస్‌ జాన్సన్‌ నియమించారు. దీంతో నాటి ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలో నేపథ్యంలో పించర్‌ కిందటివారమే తన పదవికి రాజీనామా చేశారు. ఆరోజు క్లబ్బులో బాగా మద్యం తాగేసి ఇతరులను ఇబ్బంది పెట్టానని రాజీనామా లేఖలో ఒప్పుకొన్నారు. దీంతో కన్జర్వేటివ్‌ పార్టీ ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అప్పట్నుంచీ ఆయన పార్లమెంటులో స్వతంత్ర సభ్యుడుగా కొనసాగుతున్నారు. మరోవైపు.. పించర్‌ సంగతి తెలిసే ఆయనకు పార్టీ పదవి కట్టబెట్టారనే విమర్శలు వెల్లువెత్తడం ప్రారంభమైంది. దీంతో బోరిస్‌ జాన్సన్‌ అధికార నివాసం జూలై 1న ఒక ప్రకటన విడుదల చేసింది. పించర్‌ను పార్టీ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించడానికి ముందు.. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణల గురించి బోరిస్‌కు తెలియదని అందులో పేర్కొంది. కానీ 2019 నాటికే బోరి్‌సకు పించర్‌పై వచ్చిన ఆరోపణల గురించి తెలుసని బ్రిటన్‌ విదేశాంగ శాఖకు చెందిన సీనియర్‌ ఉన్నతాధికారి సైమన్‌ మెక్‌డోనాల్డ్‌ తాజాగా రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. దీంతో 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ మరో ప్రకటన విడుదల చేసింది. పించర్‌పై ఆరోపణల గురించి తెలుసుగానీ.. అధికారికంగా ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదు కాబట్టి ఆ పదవి ఇచ్చారంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. పార్టీ గేట్‌ కుంభకోణానికి సంబంధించి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్న బోరిస్‌ క్షేమంగా బయటపడినప్పటికీ.. ఈ వివాదంలో మాత్రం పూర్తిగా కూరుకుపోయారు. ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతుండడంతో పార్టీ ఎంపీలు, మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్‌, హెల్త్‌ సెక్రటరీ సాజిద్‌ జావేద్‌తో మొదలుపెట్టి పదుల సంఖ్యలో పార్టీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో బోరిస్‌ రాజీనామా చేయక తప్పలేదు. బ్రిటన్‌ చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇంతమంది మంత్రులు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.


ప్రధాని రేసులో రిషి సునక్‌

బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ప్రధాని ఎవరా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కన్జర్వేటివ్‌ పార్టీలోని ఎనిమిది మంది పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఎనిమిది మందిలోనూ ముందంజలో ఉన్నది.. భారత సంతతికి చెందిన వ్యక్తి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు, ఇటీవలే ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన రిషి సునక్‌  (42). అలాగే..  రక్షణ మంత్రి బెన్‌వాలె్‌స, లిజ్‌ ట్రస్‌, పెన్నీ మార్డాంట్‌, జెరిమీ హంట్‌, నదీమ్‌ జహావీ తదితరుల పేర్ల పైనా బెట్టింగులు నడుస్తున్నాయి. రిషి సునక్‌ గనుక ప్రధాని అయితే.. ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా, ఆసియావాసిగా చరిత్ర సృష్టించినట్టే. అంతేకాదు.. భారతదేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా దాస్యశృంఖలాలతో బందించిన దేశ ప్రధాని బాధ్యతలు ఒక భారత సంతతి వ్యక్తి చేతికి రావడం ప్రతి భారతీయుడికీ గర్వకారణమే. రిషి సునక్‌ తాతముత్తాతలు పంజాబ్‌కు చెందినవారు. ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత.. రిషి సునక్‌ భార్య. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు.

Updated Date - 2022-07-08T08:56:48+05:30 IST