నటదర్శక ప్రయోక్త విజయప్రకాష్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-06-06T13:13:54+05:30 IST
రుద్రవీణ నాటికతో నాటకరంగంలో గొప్ప పేరు తెచ్చుకున్న బి.విజయప్రకాష్(75) అనారోగ్యంతో
హైదరాబాద్ సిటీ /చిక్కడపల్లి : రుద్రవీణ నాటికతో నాటకరంగంలో గొప్ప పేరు తెచ్చుకున్న బి.విజయప్రకాష్(75) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు భార్య హేమావతి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాటక ప్రయోక్త హనుమంత రావు శిష్యులైన విజయప్రకాష్ నాటకమే జీవితంగా బతికారు. ఆర్టీసీక్రాస్‌రోడ్స్ ఎస్‌ఆర్‌టీ క్వార్టర్స్‌లో ఆయన నివాసం. పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ దగ్గర, అనంతరం నటుడు, నాటకప్రయోక్త డీఎస్ దీక్షిత్ స్థాపించిన అక్కినేని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నాటకానికి దగ్గరగా విశేష సేవలు అందించారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
ప్రముఖుల నివాళి...
నాటకం అంటే ఇష్టంగా అహోరాత్రులు శ్రమించిన ఉత్తమ నట దర్శక ప్రయోక్త బి. విజయప్రకాష్ అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా.కె.వి.రమణాచారి నివాళులర్పించారు. తన హయాంలో నంది నాటకోత్సవాలు ప్రారంభం నుంచి కమిటీలో ఉండి దిగ్విజయం కావడానికి విశేష కృషి చేశారని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్‌రఫీ, వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డా. వంశీ రామరాజు, కిన్నెర ఆర్ట్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్, త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, జీవీఆర్ ఆరాధన అధ్యక్షుడు గుదిబండి వెంకటరెడ్డి, ఫాస్ వ్యవస్థాపకులు డా. కె.ధర్మారావు, కేంద్ర సెన్సార్ బోర్డుసభ్యులు, కథక్ కళాక్షేత్ర నిర్వాహకులు పండిట్ అంజుబాబు, సత్కళాభారతి కార్యదర్శి సత్యనారాయణ, ఈవెంట్ నిర్వాహకులు సతీ్‌షచౌదరి, యువకళావాహిని అధ్యక్ష, ఉపాధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, బొప్పన నరసింహారావు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసి నివాళులర్పించారు