లెక్క తేలేదెన్నడో?

ABN , First Publish Date - 2020-05-26T05:44:56+05:30 IST

నస్పూర్‌ చెరువు శిఖం కబ్జాకు గురువుతోంది. చెరువు హద్దులను ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్‌ శాఖ ఏడాదికాలంగా

లెక్క తేలేదెన్నడో?

కొలిక్కిరాని చెరువు శిఖం హద్దులు

కబ్జాకు గురవుతున్న నస్పూర్‌ చెరువు

హద్దులు నిర్ణయించాలని అధికారులకు ఫిర్యాదు

యేడాది కాలంగా పూర్తికాని సర్వే 


నస్పూర్‌, మే 25: నస్పూర్‌ చెరువు శిఖం కబ్జాకు గురువుతోంది. చెరువు హద్దులను ఏర్పాటు చేయడానికి ఇరిగేషన్‌ శాఖ ఏడాదికాలంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంది.  నస్పూర్‌ చెరువు 144 ఎకరాల శిఖం భూమి కలిగి ఉండగా చుట్టూ పక్కల కొందరు రియల్‌ వ్యాపారులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతులు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు అధికారులకు ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో చెరువుకు ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) హద్దులు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం నిర్ణయించినప్పటికీ నేటి వరకు పూర్తికాలేదు.


హద్దుల ఏర్పాటులో నీటి పారుదల శాఖ నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోందని రైతు, ప్రజా సంఘా ల నేతలు ఆరోపిస్తున్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే చెరువు శిఖం కబ్జాకు గురవుతూ నానాటికి కుచించుకుపోతోందని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. గతేడాదిలోనే రూ 10 లక్షల వ్యయంతో చెరువు శిఖం హద్దురాళ్ళను వేయ డానికి దాదాపు పదిసార్లు సర్వే చేసిన అధికారులు ఏడాది గడిచినా లెక్క తేల్చలేదు. గత సంవత్సరం చెరువులో నీరు నిండుగా ఉన్నందున ఎఫ్‌టీఎల్‌ ఏర్పాటు చేయడం కష్టమని చెప్పిన అధికారులు చెరువు నీరు తొలగించినా ఎఫ్‌టీఎల్‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.


చెరువును కాపాడేదెవరూ...

శిఖం భూమిలోని చొచ్చుకు వచ్చిన రియల్‌ వ్యాపారులు అధికారులకు, కొందరు నేతలకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్పారనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి.  144 ఎకరాల శిఖంలో దాదాపు 35 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేను పూర్తిస్థాయిలో చేయక పోవడం, ఇరిగేషన్‌ అధికారులు నెలలో రెండు సార్లు చెరువు చుట్టూ తిరిగి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. చెరువు శిఖం ఎంత భూమి కబ్జాకు గురైందో కచ్చితంగా అధికారులు చెప్పలేకపోతున్నారు.


చెరువు ద్వారా సుమారు 600 ఎకరాలకు వానా కాలంలో, యాసంగిలో 300 ఎకరాలకు సాగు నీరు అందేదని, నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు పేర్కొంటున్నారు. చెరువులో పేరుకుపోయిన పూడికతో పాటు శిఖంలోకి చొచ్చుకురావడం వలన  నీటిమట్టం యేటా తగ్గిపోతోంది. చెరువు శిఖం హద్దు లు తేలితే  కొందరి కబ్జా బాగోతం బహిర్గతం అవు తుందనే సర్వే పనులను అడ్డుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఇరిగేషన్‌ డీఈ సత్యనారాయణను సంప్రదించగా తొందరలోనే సర్వే పూర్తి చేసి హద్దులను ఏర్పాటు చేస్తామన్నారు.  

Updated Date - 2020-05-26T05:44:56+05:30 IST