అంగారకుడిపైకి మరోటి.. కారంత సైజు రోవర్‌ను పంపిన నాసా

ABN , First Publish Date - 2020-07-31T00:51:52+05:30 IST

అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’

అంగారకుడిపైకి మరోటి.. కారంత సైజు రోవర్‌ను పంపిన నాసా

వాషింగ్టన్: అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా అంగారకుడిపైకి రోవర్, ఆర్బిటర్‌ను పంపింది. ఏడు నెలల ప్రయాణం తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అది మార్స్ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత చైనా కూడా అంగారకుడిపైకి రోవర్‌ను పంపింది. ‘తియాన్వెన్-1’గా పిలిచే దీనిని లాంగ్‌మార్చ్ 5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. 


తాజాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మార్స్ పైకి అతిపెద్ద రోవర్‌ను పంపింది. కెమెరాలు, మైక్రోఫోన్లు, డ్రిల్స్, లేజర్లు వంటి వాటితో కారంత పరిమాణంలో రూపొందించిన ఈ రోవర్‌ను అట్లాస్ ‘V’ రాకెట్ ద్వారా నేడు విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఈ సమ్మర్‌లో ఇది మూడోది, చివరి మార్స్ ప్రయోగం. చైనా, యూఏఈ, అమెరికా మిషన్లు ఏడు నెలలు, 300 మిలియన్ మైళ్లు (480 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించిన తర్వాత రెడ్ ప్లానెట్‌ను చేరుకుంటాయి. 


ప్లూటోనియం శక్తితో పనిచేసే ఆరు చక్రాల రోవర్ మార్స్‌పై దిగి భౌగోళిక నమూనాలు సేకరిస్తుంది. 2031లో తిరిగి భూమిపైకి చేరుకుంటుంది. ఈ మిషన్ ఖర్చు 8 బిలియన్ డాలర్లు. మార్స్‌పై జీవం ఉందా? అన్న విషయంతోపాటు 2030 నాటికి మార్స్‌పై వ్యోమగాములు వెళ్లేందుకు ఈ మిషన్ బాటలు వేయనుందని నాసా పేర్కొంది. 

 

అంతరిక్ష నౌకను మార్స్‌పై విజయవంతంగా ల్యాండ్ చేసిన ఒకే ఒక్క దేశం అమెరికా. అది కూడా తొమ్మిది ప్రయత్నాల తర్వాత. ఫలితంగా అంతరిక్ష పరిశోధనల్లో ఇది బెర్ముడా ట్రయాంగిల్ అనిపించుకుంది. ప్రపంచంలో చాలా దేశాల మార్స్ మిషన్‌లు ఇక్కడ పేలిపోవడం, క్రాష్ అవుతుండడంతో ఆ పేరు వచ్చింది.  

Updated Date - 2020-07-31T00:51:52+05:30 IST