‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్‌

ABN , First Publish Date - 2022-07-04T10:11:22+05:30 IST

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ-సీఎం షిండేవర్గం బలపరిచిన రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికయ్యారు.

‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్‌

షిండే వర్గం, బీజేపీ మద్దతుతో ఘన విజయం

ఎంవీఏ తరఫున రాజన్‌ సాల్వీ నామినేషన్‌

నర్వేకర్‌కు 164.. సాల్వీకి 107 ఓట్లు

దేశంలోనే అతి చిన్నవయస్కుడైన స్పీకర్‌: ఫడణవీస్‌


ముంబై, జూలై 3: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ-సీఎం షిండేవర్గం బలపరిచిన రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, శివసేన(ఉద్ధవ్‌ వర్గం) ఎమ్మెల్యే, మహా వికాస్‌ ఆఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి రాజన్‌ సాల్వీపై 57 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సీఎం షిండే బలనిరూపణ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు నిర్వహించిన స్పీకర్‌ ఎన్నికలో.. నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా.. సాల్వీ 107 ఓట్లతో సరిపెట్టుకున్నారు. నర్వేకర్‌ ఘనవిజయం సాధించిన వెంటనే బీజేపీ-షిండేవర్గం సభ్యులు చేసిన ‘జై శ్రీరామ్‌’.. ‘వందే మాతరం’ నినాదాలతో  సభ మార్మోగిపోయింది. మొత్తం 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో.. శివసేన ఎమ్మెల్యే రమేశ్‌ లాట్కే మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మిగతా 287 మంది సభ్యులకు.. 12 మంది గైర్హాజరవ్వగా.. ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ స్పీకర్‌ స్థానంలో ఉండడంతో.. ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ, ఒకరు మజ్లి్‌సకు చెందినవారున్నారు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు.


వీరిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్‌సీపీకి చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌ జైలులో ఉండడంతో ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరో ఐదుగురు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సెషన్‌కు డుమ్మా కొట్టారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సెషన్‌కు హాజరుకాలేదు. మజ్లిస్‌ ఎమ్మెల్యే ముఫ్తీ మహమ్మద్‌ కూడా స్పీకర్‌ ఎన్నికకు గైర్హాజరయ్యారు. దేశంలోనే అతి పిన్నవయస్కుడైన స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ అని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కొనియాడారు. ఇక బీజేపీ-శివసేన నేతృత్వంలో బాలాసాహెబ్‌ హిందూత్వ సిద్ధాంతాన్ని కొనసాగిస్తామని ఏక్‌నాథ్‌ షిండే అసెంబ్లీలో సీఎం హోదాలో తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. స్పీకర్‌ ఎన్నికలో షిండే వర్గం విజయం సాధించడంతో.. సోమవారం జరగనున్న బలపరీక్ష లాంఛనమే అని తెలుస్తోంది. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలిని నడిపేది మామ అల్లుళ్లు కావడం గమనార్హం. ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికవ్వగా.. మండలి చైర్మన్‌గా ఆయన మామ రామ్‌రాజ్‌ నాయక్‌(ఎన్‌సీపీ) కొనసాగుతున్నారు. ఉద్ధవ్‌ వర్గం శాసనసభా పక్ష నేత అజయ్‌ చౌదరిని స్పీకర్‌ నర్వేకర్‌ తొలగించారు. బల పరీక్ష నేపథ్యంలో షిండే వర్గం విప్‌ జారీ చేసింది. ఉద్ధవ్‌ వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు షిండేకు వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. 

Updated Date - 2022-07-04T10:11:22+05:30 IST