నారాయణ.. మాస్టారట..!

ABN , First Publish Date - 2021-09-15T06:03:33+05:30 IST

కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించే నారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యాడు..!

నారాయణ.. మాస్టారట..!
తన నలుగురు పిల్లలతో పులుసు ముక్రమ్మ

  1. మరణించిన కూలీకి ఉద్యోగం 
  2. కుటుంబానికి రేషన్‌, పింఛన్‌ కట్‌ 
  3. అధికారుల నిర్లక్ష్యంతో పేదింటికి కష్టం


కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించే నారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యాడు..! ప్రస్తుతం కోసిగి మండల పరిధిలోని జంపాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాడు. ‘మంచిదే.. సెభాష్‌..’ అని అనకండి. రెక్కల కష్టం మీద బతికే ఆ కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి.. అని అనుకోకండి..! ఎందుకంటే.. నారాయణ నాలుగేళ్ల క్రితమే గుండెపోటుతో మృతి చెందాడు. చివరి క్షణం వరకూ కూలి పనులు చేస్తూనే కుటుంబాన్ని పోషించాడు. సరే.. ఎక్కడో పొరపాటు జరిగింది.. వదిలేద్దాం అనుకోకండి..! అంతటితో అధికారులు వదల్లేదు. ఇంకా చాలా ఉంది..!


కోసిగి పట్టణంలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌కు చెందిన పులుసు నారాయణ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య  ముక్రమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిది దినసరి కూలీల కుటుంబం. దంపతులు ఇద్దరూ కష్టపడి కూలి పనులు చేసి బిడ్డలను పోషించుకునేవారు. భర్త మరణం తరువాత ఆ విషాదాన్ని దిగమింగుకొని ముక్రమ్మ కూలి పనులు చేస్తూ బిడ్డలను పోషిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆమెకు వితంతు పింఛన్‌ మంజూరు అయింది. రేషన్‌ కార్డు కూడా ఉండటంతో నిత్యావసర సరుకులు అందేవి ఈ పేద కుటుంబానికి.  పింఛన్‌, రేషన్‌ సరుకులు ఎంతో ఊరటనిచ్చేవి. ఇప్పుడు అధికారులు ఆ రెండింటికీ ఎసరు పెట్టారు. దీనికి కారణం.. నాలుగేళ్ల క్రితం మరణించిన నారాయణ.. ప్రస్తుతం కోసిగి మండల పరిధిలోని జంపాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తు న్నాడని ఆన్‌లైన్‌లో చూపి స్తోంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రేషన్‌ కార్డు ఉండకూడదని తొలగించారు. దీంతో కూలి డబ్బులు చాలక, అప్పు చేసి బియ్యం కొనాల్సి వస్తోందని ముక్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన బిడ్డలకు అమ్మ ఒడి పథకం కూడా వర్తింప జేయడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తమకు అందడం లేదని వాపోతోంది. అక్టోబరు నుంచి పింఛన్‌ కూడా నిలిపివేస్తున్నామని సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీరు ముక్రమ్మకు సమాచారం ఇచ్చారు. అధికారులు చేసిన పొరపాటుకు వీరి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. పులుసు ముక్రమ్మ భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు అని ఆన్‌లైన్‌లో చూపిస్తోందని, అందుకే రేషన్‌ కార్డు తొలగించామని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రజిత తెలిపారు. పింఛన్‌ తొలగింపు జాబితాలో కూడా ముక్రమ్మ పేరు ఉందని అన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి విచారించామని, ఆమె భర్త నాలుగేళ్ల క్రితం మరణించాడని, దినసరి కూలీగా పనిచేసేవాడని తెలిసిందని అన్నారు.                          - కోసిగి

Updated Date - 2021-09-15T06:03:33+05:30 IST