Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 04 Dec 2021 04:31:18 IST

మీరు ఇవ్వాల్సిందే ఇవ్వట్లేదు!

twitter-iconwatsapp-iconfb-icon
మీరు ఇవ్వాల్సిందే ఇవ్వట్లేదు!

బియ్యం సేకరణపై తెలంగాణను తప్పుబట్టిన పీయూష్‌ గోయల్‌

ఒప్పందం మేరకు ఇవ్వలేకపోతున్నారు

29 లక్షల టన్నుల ముడి, 17 లక్షల టన్నుల 

ఉప్పుడు బియ్యం ఇంకా పెండింగులోనే..

గత ఖరీఫ్‌ సీజన్‌లో 50 లక్షల టన్నులకు 

32.66 లక్షల టన్నులే సరఫరా చేశారు

రబీ సీజన్‌లో 55 లక్షల టన్నులకు ఇప్పుడు

61.87 లక్షల టన్నులు ఇస్తామంటున్నారు

ఈ ఖరీఫ్‌ కోటానూ ఇంకా ఇవ్వాల్సి ఉంది

ఎఫ్‌సీఐతో ఒప్పందం మేరకు 94.53 లక్షల 

టన్నుల్లో ఎంత ఇస్తే అంత సేకరిస్తాం

ఉప్పుడు సహా మొత్తం బియ్యం సేకరిస్తాం

ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్‌కే చెప్పా

పదే పదే రాజకీయం చేయడం మంచిది కాదు

తెలంగాణ నిల్వల్లో అవకతవకల గుర్తింపు

రాజ్యసభలో కేంద్ర ఆహార మంత్రి పీయూష్‌ 

కిషన్‌రెడ్డి హామీకి కట్టుబడి ఉన్నారా?: కేకే

పార్లమెంటులో ఐదో రోజూ 

టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసనలు.. వాకౌట్‌


మా వద్ద పెద్ద ఎత్తున ఉప్పుడు బియ్యం నిల్వలు పోగై ఉన్నాయి. అయినా, తెలంగాణ వద్ద ఉన్న మొత్తం ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే స్పష్టం చేశా. భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని హామీ ఇచ్చినందువల్ల ప్రస్తుతం వారి వద్ద నిల్వ ఉన్న బియ్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని సీఎంకు చెప్పాను.


తెలంగాణ ఇచ్చే అంచనాల్లో పొంతన ఉండదు. వాస్తవ సరఫరాల కంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అయినా సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్రం అడిగినన్ని సార్లు బియ్యం సేకరిస్తున్నాం


న్యూఢిల్లీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఖరీఫ్‌ సీజన్‌లోనూ, రబీ సీజన్‌లోనూ సరఫరా చేస్తామన్న బియ్యాన్ని కూడా సరఫరా చేయలేకపోయారు. ఇప్పటికీ తెలంగాణ నుంచి మాకు 29 లక్షల టన్నుల ముడి బియ్యంతోపాటు 17 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం కూడా రావాల్సి ఉంది. ఈ 17 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యంతోపాటు కొద్ది మొత్తాన్ని అధికంగా కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ వద్ద ఉన్న అన్ని రకాల బియ్యాన్ని కేంద్రం తీసుకుంటుంది’’ అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ‘‘భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ ఇచ్చింది. ఇప్పుడు మీ దగ్గర ఉప్పుడు బియ్యం ఉన్నాయా? ముడి బియ్యం ఉన్నాయా? అన్న విషయం మాకు తెలియదు. అయినా, దాన్నంతటినీ మేం సేకరిస్తాం. పదే పదే ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ధాన్యం, బియ్యం సేకరణ పేరుతో పదే పదే రాజకీయం చేయడం మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు. గతాన్ని, భవిష్యత్తునముడి పెట్టడమే అసలు సమస్యని తప్పుబట్టారు. తెలంగాణలోని బియ్యం నిల్వలను తనిఖీ చేసేందుకు కేంద్ర బృందాలను పంపితే.. నిల్వల విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని గుర్తించాయని, సరైన విధంగా నిల్వలు చేయలేకపోతున్నారని తప్పుబట్టారు. 


కేకే అభ్యంతరం

మంత్రి గోయల్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ధాన్యం ఉత్పత్తుల సేకరణ అంశాన్ని తాము ప్రస్తావిస్తున్నామని చెప్పారు. తొలుత, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమైన వెంటనే ధాన్యం సేకరణ సమస్యలు పరిష్కరించాలంటూ ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. చైర్మన్‌ వెంకయ్యనాయుడు సర్ది చెప్పడంతో తిరిగి వారి స్థానాల్లోకి వచ్చారు. అనంతరం, ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.కేశవరావు తన అనుబంధ ప్రశ్నలో భాగంగా.. ధాన్యం, బియ్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. ‘‘తెలంగాణలో పండిన ఽధాన్యమంతటినీ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఉంటే.. పండిన ఏ రకమైన ధాన్యమైనా సేకరించాల్సిందే. నేను మద్దతు ధర గురించి అడగడం లేదు. మిగిలిన ధాన్యం గురించే మాట్లాడుతున్నాను. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి (కిషన్‌ రెడ్డి మాట్లాడిన పేపర్‌ క్లిప్పింగ్‌ను చూపించారు) హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా?’’ అని ప్రశ్నించారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులే సేకరించారని చెప్పారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలనుకుంటే, ఎంత పరిమాణంలో సేకరిస్తారని ప్రశ్నించారు.


మాట నిలబెట్టుకోలేదు: మంత్రి గోయల్‌

 కేకే ఆరోపణలపై మంత్రి పీయూష్‌ గోయల్‌ సుదీర్ఘంగా జవాబిచ్చారు. ‘‘ఇతరులు ఏయే ప్రకటనలు ఇచ్చారో నాకు తెలియదు. కానీ, బియ్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది. తెలంగాణ అడిగినన్ని సార్లు బియ్యం సేకరణ చేస్తున్నాం. నిజానికి తెలంగాణయే హామీ ఇచ్చిన మేరకు సరఫరా చేయలేకపోయింది. 2019-20లో మాకు 61.92 లక్షల టన్నుల బియ్యాన్నిస్తామని, కేవలం 42.99 లక్షల టన్నులు సరఫరా చేశారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. గత ఖరీఫ్‌ సీజన్లో 50 లక్షల టన్నులు కేంద్రానికి ఇస్తామన్నారు. కానీ, 32.66 లక్షల టన్నులే ఇవ్వగలిగారు. రబీ సీజన్లో 55 లక్షల టన్నులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు, 61.87 లక్షల టన్నుల బియ్యానికి అనుగుణంగా ధాన్యం సేకరించామని చెబుతున్నారు. అందుకు కూడా కేంద్రం అంగీకరించింది. మా వంతుగా.. ఒప్పందం మేరకు, 94.53 లక్షల టన్నుల వరకూ తెలంగాణ ఎంత అందిస్తే అంత బియ్యం సేకరిస్తామని మేం స్పష్టం చేశాం. ప్రస్తుత ఖరీ్‌ఫకు సంబంధించి కూడా తెలంగాణ చెప్పిన మేరకు ఇంకా మాకు సరఫరా చేయాల్సి ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ఇచ్చే అంచనాల్లో పొంతన ఉండదని, వాస్తవ సరఫరాల కంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయని తప్పుబట్టారు. అక్టోబరు 7న తాను రాసిన లేఖ ప్రకారం.. ఇప్పటికే ఐదుసార్లు పొడిగింపు ఇచ్చామని, తెలంగాణ తగిన నిల్వలను సరఫరా చేయలేకపోయిందని చెప్పారు. ‘‘ఉప్పుడు బియ్యం 24.75 లక్ష ల టన్నుల మేరకు తొలుత లక్ష్యంగా విధించారు. ఈ మొత్తాన్ని పెంచాలని అడిగారు. దాంతో, దానిని 44.75 లక్షల టన్నులకు పెంచాం. ఇందులో కూడా కేవలం 27.78 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మిగతా 17లక్షల టన్నులు పెండింగ్‌లో ఉంది’’ అని వివరించారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే.. తెలంగాణకు, ఎఫ్‌సీఐకి మధ్య ఒప్పందం ఉందని, అది పెద్ద మనుషుల ఒప్పందం వంటిదని, దాని ప్రకారమే బియ్యం సేకరిస్తున్నామని చెప్పారు. పెండింగులో ఉన్న 29 లక్షల బియ్యాన్ని ముందు సరఫరా చేయాలని, అప్పటికీ సమస్య కొనసాగితే ప్రభుత్వంతో చర్చించవచ్చని, అప్పుడు ఒప్పందం ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


ఉప్పుడు బియ్యం తీసుకుంటారా?: సురేశ్‌రెడ్డి

ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘‘అవకతవకలు జరిగాయని అంటున్నారు. తెలంగాణలో వరి పంట సాగుపై కేంద్రానికి అనుమానాలు ఉన్నాయి. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. 99.99 శాతం అంచనాలకు తగినట్లుగానే ఉందని నిర్ధారించారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అనుమానాలు నివృత్తి అయ్యాయి’’ అని వ్యాఖ్యానించారు. ఉప్పుడు బియ్యం కొనబోమని పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారని, కానీ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి మాత్రం ప్రతి గింజా కొంటామని అంటున్నారని వివరించారు. రబీ(యాసంగి) సీజన్లో వరి సాగు ద్వారా ఉప్పుడు బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, దానిని కొనుగోలు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత రబీలో ఉత్పత్తయ్యే పారా బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేస్తారా? లేదా? చెప్పాలని పట్టుబట్టారు. దాంతో, భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమంటూ తెలంగాణ లేఖ ఇచ్చిన విషయాన్ని మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రస్తావించారు. దాంతో, మంత్రి తమకు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. 


ఒడిసా సభ్యుడి సమర్థన

ఒడిసాకు చెందిన బీజేడీ ఎంపీ సుస్మిత్‌ పాత్రా కూడా సురేశ్‌ రెడ్డి వాదనను సమర్థించారు. ఒడిసాలో కూడా ఉప్పుడు బియ్యమే ఎక్కువ ఉత్పత్తి అవుతోందని, ఎఫ్‌సీఐ ద్వారా దానిని కొనుగోలు చేయాలని కోరారు. తమ రాష్ట్రంలో మొత్తం ఉప్పుడు బియ్యాన్నే ఉత్పత్తి చేస్తామని, ప్రస్తుతం 28 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని, ఇప్పుడు తుపాను ప్రమాదం పొంచి ఉందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ బియ్యం అంతటినీ కొనుగోలు చేయాలని బీజేడీ సభ్యుడు ప్రసన్నాచార్య డిమాండ్‌ చేశారు. ‘‘ఉప్పుడు బియ్యాన్ని మీరు సేకరించకపోతే మేం బంగాళా ఖాతంలో పారబోసుకోవాలా?’’ అని నిలదీశారు.


పేపర్లు చించేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో ఐదో రోజూ టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసనలు కొనసాగాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్ల కార్డులు పట్టుకుని వెల్‌లోకి వెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జీరో అవర్‌ సమయంలో ఈ అంశంపై మాట్లాడేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావుకు అవకాశం లభించింది. దాంతో, ఏడాది మొత్తంలో ఎంత సేకరిస్తారో వార్షిక కోటాను ఖరారు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోటాను ఖరారు చేస్తే దాని ప్రకారం రైతులకు చెబుతామన్నారు. ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ కొనుగోలు విధానాన్ని తీసుకురావాలని, పంటల కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. ‘‘కొన్నిసార్లు తీసుకుంటామని, కొన్నిసార్లు తీసుకోబోమని అంటున్నారు. యాసంగి పంట కొనబోమని ఒకసారి.. ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమని కొన్నిసార్లు అంటున్నారు’’ అని తప్పుబట్టారు. తెలంగాణ రైతులు రోడ్లపై ఉన్నారని, వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఆయన మాట్లాడిన వెంటనే పలువురు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కాగితాలు చించేసి పైకి విసిరేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు.


బీజేపీ నిజ స్వరూపం బయటపడింది: కేకే

ఉప్పుడు బియ్యం సేకరణపై మంత్రి గోయల్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని, పార్లమెంటు సాక్షిగా బీజేపీ నిజ స్వరూపం బయటపడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే తప్పుబట్టారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో రాజకీయం చేయవద్దని సూచించారు. గత ఏడాది 94 లక్షల టన్నులు సేకరించారని, ఈసారి తీసుకుంటారా లేదా? ఉప్పుడు బియ్యం కొంటారా లేదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒప్పందం ప్రకారం బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని కేంద్ర మంత్రి అన్నారని చెప్పారు. కేంద్రం ఎంత రైతు వ్యతిరేకో అర్థమవుతోందని, ఇంతకన్నా దురదృష్ట ప్రభుత్వం మరొకటి ఉండదని ఆరోపించారు. ఒడిసాలోనూ ఇదే సమస్య ఉందని చెప్పారు. కేంద్ర మంత్రి డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారని, అన్ని పార్టీల ఎంపీలకు తెలంగాణ రైతుల సమస్య గురించి వివరించామని నామా అన్నారు.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.