గంజాయి లింక్‌పై నల్గొండ టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2021-10-19T06:08:26+05:30 IST

చింతపల్లి మండలం గాలిపాడు గిరిజనులపై ఆదివారం సాయంత్రం నల్గొండ పోలీసులు తురబాలగెడ్డ సమీపంలో కాల్పులు జరిపిన ఘటనపై జిల్లా పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

గంజాయి లింక్‌పై నల్గొండ టాస్క్‌ఫోర్స్‌

నిందితుల కోసం ఐదారు రోజుల క్రితం నల్గొండ ఎస్పీ సహా 12 మంది బృందం విశాఖ రాక

పోలీసు ఉన్నతాధికారులతో భేటీ

స్థానిక పోలీసుల సహకారంతో చోడవరం, నర్సీపట్నంలో ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్న బృందం

చింతపల్లి పోలీసులకు చెప్పకుండా గాలిపాడు గ్రామానికి...

ముగ్గురిని అదుపులోకి తీసుకుని నర్సీపట్నం తరలింపు

ఈ నేపథ్యంలో గొడవ, కాల్పులు

ఘటనపై కేసు...విచారణకు ఆదేశించిన రూరల్‌ ఎస్పీ 


విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి మండలం గాలిపాడు గిరిజనులపై ఆదివారం సాయంత్రం నల్గొండ పోలీసులు తురబాలగెడ్డ సమీపంలో కాల్పులు జరిపిన ఘటనపై జిల్లా పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. గంజాయి కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న తమపై కొంతమంది గిరిజనులు మారణాయుధాలతో దాడికి యత్నించారని, దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాల్సి వచ్చిందని నల్గొండ పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.


గంజాయి రవాణాకు సంబంధించి నల్గొండ జిల్లాలో 30 వరకు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులను విచారించిన పోలీసులు...గంజాయి రవాణాదారులకు విశాఖ జిల్లాలోని కొంతమంది వ్యక్తులతో సంబంధాలు వున్నట్టు గుర్తించారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి చెందిన 12 మందితో ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఐదారు రోజుల క్రితం ఈ బృందం విశాఖ జిల్లాకు వచ్చింది. ఇదే సమయంలో నల్గొండ ఎస్పీ కూడా విశాఖ వచ్చి రూరల్‌ పోలీసులతో భేటీ అయ్యారు. రూరల్‌ పోలీసుల సహకారంతో చోడవరం, నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో కేసుకు సంబంధించి నిందితుల కోసం ఈనెల 15, 16 తేదీల్లో చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి రెండు వాహనాల్లో వెళ్లారు. శుక్రవారం ఒకరిని, శనివారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భీమరాజు అనే వ్యక్తి విషయంలో గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. పశువుల కాపరి అయిన ఇతనికి గంజాయితో సంబంధం లేదని, అందువల్ల విడిచిపెట్టాలని వారు కోరారు. కానీ నల్గొండ పోలీసులు పట్టించుకోకుండా వాహనంలో ఎక్కించి నర్సీపట్నం తరలించారు. అందరినీ అక్కడ ఒక లాడ్జిలో వుంచి ఇంటరాగేషన్‌ చేశారు. గాలిపాడులో ఒకరి వద్ద 400 కిలోల గంజాయి వుందని పోలీసుల అదుపులో వున్న వారిలో ఒక వ్యక్తి చెప్పాడు. నల్గొండ పోలీసులు అతడి ద్వారా గాలిపాడు గ్రామస్థులకు ఫోన్‌ చేయించారు. భీమరాజును విడిచిపెట్టే విషయమై చర్చించడానికి ఆదివారం లంబసింగి ఘాట్‌ వద్దకు రావాలని పోలీసులు వారికి చెప్పారు. దీంతో అన్నవరం సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యుడు, మరో ఎనిమిది మంది కలిసి జీపులో బయలుదేరి లంబసింగి ఘాట్‌ వద్దకు వచ్చారు. నల్గొండ పోలీసులు రెండు వాహనాల్లో నర్సీపట్నం నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే లంబసింగి ఘాట్‌ వద్ద ఆగకుండా, లోతుగెడ్డ జంక్షన్‌కు రావాలంటూ గాలిపాడు గిరిజనులకు పోలీసులు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో వారు జీపులో బయలుదేరుతుండగా...నల్గొండ పోలీసులు తమ వాహనాలను తిరిగి నర్సీపట్నం వైపు మళ్లించారు. గాలిపాడు గిరిజనులు కూడా తమ వాహనంలో నర్సీపట్నం వైపు బయలుదేరి పోలీసుల వాహనాలను అనుసరించారు. ఘాట్‌ రోడ్డులో తురబాలగెడ్డ సమీపంలో ఒక లారీ ఆగిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ క్రమంలో గిరిజనులు జీపు నుంచి దిగి, పోలీసులు వున్న వాహనాల వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి, కాల్పులకు దారితీసింది. 


స్థానిక పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు?

నల్గొండ పోలీసులు చోడవరం, నర్సీపట్నంలో గంజాయి వ్యాపారం చేసే ఇద్దరిని అదుపులో తీసుకోవడానికి స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. కానీ  చింతపల్లి మండలం గాలిపాడులో నిందితులను పట్టుకోవడానికి అన్నవరం లేదా చింతపల్లి పోలీసుల సహకారం తీసుకోలేదు. కనీసం వారికి సమాచారం కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటన్న దానిపై ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. గంజాయి వ్యాపారులతో ఏజెన్సీలో కొంతమంది పోలీసులకు పరిచయాలున్నాయనే అనుమానంతోనే నల్గొండ పోలీసులు గోప్యత పాటించారని తెలిసింది.


కాల్పుల ఘటనపై కేసు నమోదు

బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్పీ, విశాఖ రూరల్‌

జిల్లాలో గంజాయి నిందితులలను అదుపులో తీసుకునేందుకు నల్గొండ జిల్లా నుంచి పోలీసులు వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. చింతపల్లి మండలం గాలిపాడుకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని తరలించే క్రమంలో తమపై కొంతమంది మారణాయుధాలతో దాడి చేశారని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాల్సి వచ్చిందని నల్గొండ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నాం. 


నల్గొండ పోలీసుల కాల్పులపై చంద్రబాబు ఆరా

విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో నల్గొండ పోలీసులు కాల్పులు జరిపిన ఉదంతంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. సోమవారం సీనియర్‌ నాయకులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో విశాఖకు చెందిన పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చింతపల్లి మండలం గాలిపాడుకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిపై గంజాయి కేసు ఉందని, అతడిని తీసుకువెళ్లేందుకు నల్గొండ పోలీసులు వచ్చారని బండారు తెలిపారు. అయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గాలిపాడు గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులో తీసుకున్నారని, అందులో భీమరాజు అనే వ్యక్తికి గంజాయి వ్యాపారంతో సంబంధం లేదని చెప్పినా వినకపోవడంతో నల్గొండ పోలీసులను గిరిజనులు అడ్డుకున్నారని చంద్రబాబునాయుడుకు బండారు వివరించారు.

Updated Date - 2021-10-19T06:08:26+05:30 IST