Abn logo
Mar 2 2021 @ 23:36PM

నల్లమలలో ఏటా కార్చిచ్చులు..!

దగ్ధమవుతున్న వన సంపద.. పరిరక్షణకు గట్టి చర్యలు శూన్యం

పెద్దదోర్నాల, మార్చి 2 : వేసవి కాలం ప్రారంభమవకుండానే నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుతోంది. ఏటా ఇలాంటి ప్రమాదాల వల్ల విలువైన వన సంపద, వన్య ప్రాణుల రక్షణకు విఘాతం కలుగుతోంది. చిన్న చిన్న ప్రాణులు, క్రిమి కీటకాలు అగ్నికి కాలిపోతున్నాయి. అరుదైన జంతువులు, సర్పాలు, నక్షత్ర తాబేల్లు, ఆ మంటల నుంచి తప్పించుకోలేక కాలిపోతున్నాయి. 

ఏటావర్షాకాలంలో  అడవిలో నానా గడ్డిజాతులు ఏపుగా పెరుగుతాయి. ఎండలు ప్రారంభమవగానే ఆ గడ్డి ఎండడంతో పాటు వృక్షాల నుంచి ఎండిన కొమ్మలు, వయస్సు దాటి ఆకాశమంత ఎత్తున పెరిగి నేలకొరిగిన వెదురు బొంగులు, గుబురు పొదలుండడంతో ఏదో రకంగా మంటలు జ్వలిస్తున్నాయి. ఆ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పచ్చి కర్ర కూడా అంటుకుని మాడిపోతున్నాయి. ఒక చోట అగ్గి రాజుకుంటే దాదాపు రోజుల తరబడి కొండ ప్రాంతమంతా  మంటలు మండుతూనే ఉంటాయి. అటవీ శాఖాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా శాశ్వత నివారణకు ఫలితం కనిపించడం లేదు. 

అగ్గి రాజుకుంటుందిలా.. 

శీతాకాలం దాటే సమయానికే అటవీ ప్రాంతంలో మంటలు ఏర్పడుతున్నాయి. అగ్గి రాజేసుకోవడానికి పలు కారణాలున్నాయి. ప్రధానంగా మేకల కాపదారులు, లేదా వాహనాల్లో ప్రయాణించే యాత్రికులు, స్మగ్లర్లు బీడీలు, సిగరెట్లు తాగే క్రమంలో అటవీ ప్రాంతంలో పడవేయడం ద్వారా మంటలు ఏర్పడతాయి. అంతేగాక ఎండలు బాగా ఎక్కువగా ఉంటే కొండ ప్రాంతంలో జీవాలు తిరుగాడే సమయంలో ఒక రాయికి మరొక రాయి బలంగా తాకడం ద్వారా కూడా మంటలు ఏర్పడతాయని అటవీ శాఖాధికారులు చెప్తున్నారు. దీనివల్ల అటు వనసంపదతోపాటు వన్య ప్రాణాలు, జంతువుల ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది.

అడవిని, సంపదను పరిరక్షించేందుకు చర్యలు  

- బబిత, డీఎ్‌ఫవో, మార్కాపురం  

దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన నల్లమల అటవీ ప్రాంతాన్ని, వన సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టామని మార్కాపురం డీఎ్‌ఫవో బబిత తెలిపారు. అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలిపారు. అగ్ని ప్రమాదాలు ఏర్పడకుండా అడవిలోని  రోడ్ల పక్కన ఉన్న గడ్డిని తొలగించామని, ప్రత్యేక సిబ్బందిని నియమించి పర్యవేక్షిస్తున్నామని, అవగాహన కోసం కరపత్రాలు, హోర్డింగులు ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్ని ప్రమాద సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement