నాడు-నేడు పనులు పూర్తయ్యేది ఏనాడు?

ABN , First Publish Date - 2020-10-31T10:17:14+05:30 IST

నాడు-నేడు పనులు పూర్తయ్యేది ఏనాడు?

నాడు-నేడు పనులు  పూర్తయ్యేది ఏనాడు?

-గత ఏడాది నవంబరు 14న మొదలైన పనులు

-ఇప్పటికి నాలుగు సార్లు గడువు పొడిగింపు

-అయినా పూర్తి కాని నిర్మాణాలు, మరమ్మతులు

-ప్రభుత్వ సరఫరా మెటీరియల్‌ కోసం ఎదురుచూపులు


 ‘‘ఇపుడున్న పాఠశాలల ఫొటోలు తీసి పెడతాం... ఆరు నెలల్లో వాటి రూపురేఖలు మార్చి మునుపటి ఫొటోతో పోల్చి చూపుతాం’’.... ఇదీ గతేడాది నవంబరులో ముఖ్యమంత్రి జగన్‌ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పిన మాటలు. ఆరు నెలలు కాదుకదా ఇప్పటికి ఏడాదవుతోంది. జిల్లాలో తొలి విడత ఎంపిక చేసిన 1533 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలలోనూ పనులు వందశాతం పూర్తి కాలేదు. ప్రభుత్వం సరఫరా చేయాల్సిన సిమెంట్‌ కోసం సివిల్‌ పనులు పెండింగులో పడ్డాయి. అవి ముగిసిన చోట పెయింట్ల కోసం ఎదురు చూపులు.టాయిలెట్‌ గదులు కట్టేసినా శానిటరీ మెటీరియల్‌ సరఫరా కాలేదు. 70 శాతం స్కూళ్ళకు ఫర్నిచర్‌ అందలేదు. కొన్ని స్కూళ్ళకు అత్యుత్సాహంతో ఒకేసారి సిమెంట్‌ సరఫరా చేసేయడంతో గాలికి గడ్డకట్టుకుపోయి వృధా అయ్యాయి. మరికొన్ని చోట్ల సిమెంట్‌ లేక నిర్మాణాలు ఆగిపోయాయి. ఒకదానికొకటి పొంతన లేని ఆదేశాలు, మార్గదర్శకాలతో ప్రధానోపాధ్యాయులకు రక్తపోటు, మధుమేహాలు పెరిగిపోతున్నాయి. ఒకటా రెండా? సవాలక్ష అయోమయాలు, అభ్యంతరాలు, అసౌకర్యాల నడుమ నాడు నేడు పనుల పూర్తికి నాలుగు సార్లు గడువు పొడిగించారు. చివరి గడువు నేటితో ముగుస్తోంది. అయితే నేడు కాదుకదా సమీప భవిష్యత్తులో ఈ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. రూపురేఖలు మారి నూతన జవసత్వాలతో పిల్లలను ఆకర్షించాల్సిన ప్రభుత్వ పాఠశాలలు ఇపుడు అసంపూర్తి నిర్మాణాలతో, పోగుపడ్డ నిర్మాణ సామగ్రితో ప్రాంగణాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి.


(తిరుపతి,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నాడు-నేడు కార్యక్రమం కింద మొదటి విడతలో 1533 పాఠశాలలు ఎంపికయ్యాయి. రూ. 314 కోట్లతో అవసరమైన మేరకు అదనపు గదులు, టాయిలెట్లు, వంట గదులు, ప్రహరీల నిర్మాణం, మరమ్మతులు వీటిలో చేపట్టాలి. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, నల్ల బల్ల స్థానంలో గ్రీన్‌ చాక్‌ బోర్డు వంటివి ఏర్పాటు చేయాలి. పిల్లలకు, ఉపాధ్యాయులకు అవసరమైన ఫర్నిచర్‌ సరఫరా చేయాలి. క్రీడా సామగ్రి కూడా అందించాలి. ఓ విధంగా చెప్పాలంటే పాఠశాలలకు పూర్తిగా కొత్త హంగులు అద్దాలి. గతేడాది నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జిల్లాలో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌ 12న స్కూళ్ళు తెరుస్తారు కనుక మే నెలాఖరు నాటికి స్కూళ్ళను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం గడువు కూడా నిర్దేశించింది.


తొలి విడత స్కూళ్ళలో ఏడాది గడుస్తున్నా పూర్తి కాని పనులు

తొలి విడత ఎంపికైన స్కూళ్ళలో పాఠశాల యాజమాన్య కమిటీల ఆజమాయిషీలో ప్రధానోపాధ్యాయులు పనులు చేపట్టాలి. ఇసుక, స్టీల్‌, ఇటుకలు, గ్రానైట్‌, పార్కింగ్‌ టైల్స్‌, విద్యుత్‌ సామగ్రి, ప్లంబింగ్‌ మెటీరియల్‌ వంటివి ప్రధానోపాధ్యాయులే స్థానికంగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సిమెంట్‌, పెయింట్లు, ఫ్యాన్లు, టాయిలెట్‌ గదుల్లో మెటీరియల్‌, వాటర్‌ డ్రమ్ములు, ఫర్నిచర్‌, గ్రీన్‌ చాక్‌ బోర్డులు వంటివి ప్రభుత్వం సరఫరా చేయాల్సి వుంది.వీటిలో ప్రధానోపాధ్యాయులు స్థానికంగా కొనుగోలు చేయాల్సినవి అప్పు రూపంలోనో లేదా సొంత డబ్బో వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. బిల్లులు వచ్చాక చెల్లింపులు జరుపుతున్నారు. అయితే ప్రభుత్వం సరఫరా చేయాల్సిన మెటీరియల్‌ వద్దే సమస్య వస్తోంది. సిమెంట్‌ పాక్షికంగా సరఫరా అయింది. చిత్తూరు, మదనపల్లె డివిజన్ల పరిధిలో పలు స్కూళ్ళకు ప్రారంభంలోనే ఏకమొత్తంగా సిమెంట్‌ సరఫరా చేసేయడంతో దాన్ని వెంటనే వినియోగించలేక గడ్డకట్టుకుపోయి వృధాగా మారింది. ఆ సిమెంట్‌ను ఏం చేయాలో తోచక ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.


మిగిలిన చోట్ల స్కూళ్ళకు సిమెంట్‌ కొరత తీవ్రంగా వుంది. పూర్తిస్థాయిలో సిమెంట్‌ అందక నిర్మాణ పనులన్నీ పెండింగ్‌లో వున్నాయి. ఫర్నిచర్‌ పరిమిత స్కూళ్ళకు మాత్రమే సరఫరా అయింది. అలాగే టాయిలెట్‌ గదులకు అవసరమైన మెటీరియల్‌ కూడా పాక్షికంగా సరఫరా అయింది.ఫ్యాన్లు మాత్రమే ప్రభుత్వం దాదాపుగా అన్ని పాఠశాలలకూ చేరవేసింది. గదులు, ప్రహరీల నిర్మాణాలు పూర్తయితేనే ప్రభుత్వం పెయింటింగ్‌ పనులు చేపట్టనుంది. కాబట్టి పెయింట్లు కూడా రాలేదు. వాటర్‌ డ్రమ్ములు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు సైతం ఇంతవరకూ సరఫరా కాలేదు. పై అధికారుల నుంచీ అందుతున్న ఆదేశాలు, మార్గదర్శకాలు కూడా ప్రధానోపాధ్యాయుల్లో అయోమయం రేపుతున్నాయి. సిమెంట్‌ స్థానికంగా కొనుగోలు చేయాల్సిందిగా పై అధికారులే చెబుతున్నారని, కొనుగోలు చేసేలోగా వద్దంటూ అత్యవసర సందేశాలు పెడుతున్నారని టీచర్లు వాపోతున్నారు. మరోసారి ఇరుగుపొరుగు స్కూళ్ళ నుంచీ అరువు తెచ్చుకోవాల్సిందిగా సూచనలు అందుతున్నాయని, అయితే రవాణా ఖర్చులు ఎవరు భరించాలన్న ప్రశ్నకు సమాధానం రావడం లేదని చెబుతున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు సవాలక్ష వుంటున్నాయి.


నాలుగుసార్లు గడువు పొడిగించినా పూర్తి కాని పనులు

గతేడాది నవంబరులో పనులు మొదలుపెట్టినప్పుడు ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది ప్రభుత్వం. అయితే వాస్తవానికి జిల్లాలో క్షేత్రస్థాయిలో పనులు మొదలైంది ఈ ఏడాది మార్చిలో. మార్చి చివరి వారంలో లాక్‌డౌన్‌ విధించడంతో పనులన్నీ వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా పనుల పూర్తికి గడువును ఆగస్టు 15కు పొడిగించారు. అప్పటికీ పనులు జరగకపోవడంతో ఈ నెల 15వ తేదీకి ముగించాలని నిర్దేశించారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఈ నెల 30వ తేదీ వరకూ గడువు పొడిగించారు. కానీ పనులేవీ పూర్తి కాలేదు సరికదా ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కేటాయించిన రూ. 314 కోట్లలో ఇప్పటి వరకూ ఖర్చు చేసింది కేవలం రూ. 125 కోట్లే కావడం గమనార్హం. మొత్తం నిధుల్లో సివిల్‌ పనులకే రూ. 202 కోట్లు ఖర్చు పెట్టాల్సి వుంది. అవే ప్రధానంగా ఇపుడు పెండింగులో వున్నాయి.  


గుడుపల్లె మండలంలో ఇదీ పరిస్థితి!

 గుడుపల్లె మండలంలో నాడు-నేడు పనులన్నీ పెండింగులోనే వున్నాయి.తొలి విడత ఎంపికైన 24 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ. 6 కోట్లు కేటాయించారు. 75 శాతం పనులు పూర్తయ్యాయని, మరో పదిహేను రోజుల్లో పనులన్నీ ముగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా వుంది.అగరం ప్రాధమికోన్నత పాఠశాలలో సివిల్‌ పనులే ఇంకా పెండింగులో వున్నాయి. తరగతి గదులు, వరండాలలో ఇదివరకే పరిచిన నాపరాళ్ళనే ఇంతవరకూ తొలగించలేదు. గ్రానైట్‌ కొనుగోలు చేసి స్టాక్‌ తెప్పించినా పాత నాపరాళ్ళను తొలగించాకే వీటిని అమర్చాల్సి వుంది. అలాగే రెండు గదులతో కూడిన టాయిలెట్‌ నిర్మాణం జరిగింది. అయితే లోపల ఇంకా మెటీరియల్‌ అమర్చలేదు.తలుపులు బిగించలేదు.పెయింటింగ్‌ పనులు పెండింగులో వున్నాయి. పార్కింగ్‌ టైల్స్‌ కూడా తెప్పించి సిద్ధంగా వుంచారు. కానీ ప్రాంగణమంతా నిర్మాణ సామగ్రితో నిండిపోయి వుంది. పనులు మరో నెలకైనా పూర్తయితే గొప్పే.


శాంతిపురం పెద్దూరు హైస్కూలును ఛిద్రం చేశారు!

 శాంతిపురం మండలం 64 పెద్దూరు గ్రామంలోని జడ్పీ హైస్కూలు భవనం ఇదివరకూ కళాశాలను తలపించేలా వుండేది. నాడు-నేడు కార్యక్రమం పేరిట బాగా వున్న ఆ పాఠశాల భవనాలను పనికిరాకుండా చేసేశారు.తలుపులు, కిటికీలన్నీ తొలగించేశారు. కొత్త తలుపులు, కిటికీలు పెట్టేందుకు గోడలు పగులగొట్టారు. గదుల ఫ్లోరింగ్‌ అంతా తవ్వేశారు. వృధా సామగ్రినంతా ప్రాంగణంలో కుప్పలుగా పేర్చి పాఠశాలను కళావిహీనంగా మార్చేశారు. తీరా ఇంతా చేసి నిర్మాణ, మరమ్మతు పనులేవీ చేపట్టకుండా పెండింగులో వుంచేశారు.


ఇప్పుడు పునాదులు తీస్తుంటే నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు?

బీఎన్‌ కండ్రిగ జడ్పీ హైస్కూల్లో నాడు-నేడు కార్యక్రమం కింద రూ. కోటి నాబార్డు నిధులతో పనులు మంజూరయ్యాయి. ఐదు తరగతి గదులు నిర్మించాల్సి వుండగా పది రోజుల కిందట పునాదుల పనులు మొదలయ్యాయి.ఈ తరగతి గదుల నిర్మాణం మరో ఆరు నెలలకు పూర్తయినా గొప్పేనంటున్నారు స్థానికులు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష ఉదాహరణలు జిల్లావ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నవంబరు 2న పాఠశాలలు తిరిగి తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో పిల్లలు అడుగుపెట్టడానికి కూడా వీల్లేనంత అస్తవ్యస్తంగా నాడు-నేడు పాఠశాలల ప్రాంగణాలు మారాయి.


రామకుప్పం ఆదర్శ పాఠశాలలో మూడు నెలలుగా పనులు పెండింగ్‌

 రామకుప్పంలోని మండల పరిషత్‌ ఆదర్శ ప్రాధమిక పాఠశాలలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు. దీంతో మూడు నెలలుగా పనులు అసంపూర్తిగా వున్నాయి. గోడలకు సిమెంట్‌ పూతతో అరకొర పనులు మాత్రమే జరిగాయి. గ్రానైట్‌ పలకలు కొనుగోలు చేసి తెప్పించినా అమర్చకుండా నిరుపయోగంగా ప్రాంగణంలో వుంచారు.

Updated Date - 2020-10-31T10:17:14+05:30 IST