నాడునేడు.. నత్తనడకన

ABN , First Publish Date - 2022-08-10T06:00:58+05:30 IST

వందల పాఠశాలలను ఎంపిక చేశారు.. రూ.కోట్లతో అంచనాలు వేశారు.. అయితే విద్యా సంవత్సరం ఆరంభమై నెలగడుస్తున్నా నాడు నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నాడునేడు.. నత్తనడకన
నరసరావుపేట మండలం రావిపాడులో కూల్చివేసిన భవనం

పాఠశాలల్లో సాగని పనులు

రాష్ట్రంలో చివరి స్థానంలో పల్నాడు జిల్లా 

1093కి 450 బడుల్లో ప్రారంభమే కాని వైనం 

5014 పనులు ప్రారంభించలేదని అధికారుల నివేదిక 



నరసరావుపేట, ఆగస్టు 9: వందల పాఠశాలలను ఎంపిక చేశారు.. రూ.కోట్లతో అంచనాలు వేశారు.. అయితే విద్యా సంవత్సరం ఆరంభమై నెలగడుస్తున్నా నాడు నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అధికారులు వీటి గురించి పట్టించుకోవడంలేదు. దీంతో నెల రోజుల నుంచి ఆయా పాఠశాలల్లో జరుగుతున్న పనుల కారణంగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో అయితే నాడు నేడు పనులు ముందుకు సాగడంలేదు. నిధులు కేటాయించినా అవి మంజూరు కాడంలేదు. ఈ నిధుల కొరత కారణంగా కొన్ని పాఠశాలల్లో పనులు జరగడంలేదని సమాచారం. అదనపు తరగతి గదుల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నది. ఉన్న తరగతి గదులను కూల్చి వేసి కొత్త గదుల నిర్మాణాన్ని విస్మరించారు. పనుల పురోగతి సమీక్షలకే పరిమితం అవుతోంది. జిల్లాలో నాడు నేడు రెండో దశ కింద 1093 పాఠశాలల్లో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.265.85 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.  మునిసిపల్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌  పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 9 విభాగాలుగా పనులను విభజించారు. పాఠశాలల వారీగా మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌, రంగులు, బోర్డులు, ప్రహరి, భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు చేపట్టాలి. నాడు నేడులో  ఇంగ్లీషు ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయాలి. ఇలా విభజించిన పనులు సంఖ్య 6171గా ఉంది. అయితే వీటిలో 1157 పనులు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. 5014 పనులు అసలు ప్రారంభించనట్లుగా సదరు శాఖల నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 18.75 శాతం పనులే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల  పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనుల వ్యయంలో 4.75 శాతం నిధులు ఖర్చు చేశారు. నాడు నేడు పనుల్లో రాష్ట్రంలో 24 స్థానంతో జిల్లా అట్టడుగున ఉంది. పనుల పురోగతిలో మాచర్ల మండలం ప్రఽథమ స్థానంలో ఉండగా చిలకలూరిపేట మండలం చిట్టచివరి 28వ స్థానంలో ఉంది.   సిమెంట్‌ సరఫరాలో ఆలస్యం, నిధుల కొరత పనుల జాప్యానికి కారణాలుగా ఉన్నట్లు స్కూల్స్‌ కమిటీలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేర పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిసించడంలేదు.  


 

Updated Date - 2022-08-10T06:00:58+05:30 IST