మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం.. క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు

ABN , First Publish Date - 2022-03-21T22:44:14+05:30 IST

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరే‌న్ సింగ్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం..

మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం.. క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు

ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్.బీరే‌న్ సింగ్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో బీరేన్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ఎల్.గణేషన్ ప్రమాణం చేయించారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా బీరేన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు బీజేపీకి చెందిన వారు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌‌పీఎఫ్)కు చెందిన ఒకరు ఉన్నారు. వీరి చేత కూడా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి టీహెచ్ బిశ్వజిత్, యుమ్నమ్ ఖేమ్‌చంద్, గోవిందాస్ కొతౌజమ్, మెమ్చా కెప్‍‌జిన్, ఎన్‌పీఎఫ్ నుంచి అవాంగ్‌బౌ న్యుమాయ్‌ ప్రమాణ్వీకారం చేసిన వారిలో ఉన్నారు.


ఫుట్‌బాలర్ నుంచి...

బీరేన్ సింగ్ ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తన కెరీర్ ప్రారంభించారు. బీఎస్ఎఫ్‌లో రిక్రూట్ అయి తమ టీమ్ తరఫున ఆడేవారు. ఆ తరువాత్ బీఎస్‌ఎఫ్‌కు రాజీనామా చేసి, 1992 ఒక దినపత్రిక ప్రారంభించారు. 2001 వరకూ ఆ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు. 2002లో డెమోక్రాటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీలో చేరి, హెయ్‌గాంగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2007లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2012 మళ్లీ అదే స్థానం నుంచి గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2016లో ఆయన బీజేపీలో చేరి, 2017లో కూడా మళ్లీ గెలుపొందారు. ఇటీవల జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి 17 వేల ఓట్ల  తేడాతో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందాడు.


కాగా, రెండోసారి సీఎంగా రాజ్‌భవన్‌లో జరిగిన బీరేన్ ప్రమాణస్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యాంతుంగో పట్టోన్, మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఒక్రం ఇబోబి సింగ్, మణిపూర్ నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

Updated Date - 2022-03-21T22:44:14+05:30 IST