Abn logo
Feb 25 2021 @ 01:31AM

రాళ్ళలో రహస్యాలు

అరుణగ్రహం మీద మనిషికి ఎంతో మమకారం. అంగారకుడిని అధ్యయనం చేయాలన్న ఆ ఆసక్తి ఎన్నటికీ తరగనిది. మన పొరుగున ఉంటూ, ధరణీగర్భ సంభూతుడనిపించుకొన్న ఆ గ్రహాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అనేక ప్రయత్నాలూ ప్రయోగాలూ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జీవం ఉన్నదేమోనన్న అనుమానాలూ ఆసక్తులనుంచి, అన్వేషణలు బాగా ఊపందుకున్న తరువాత జీవం ఉనికికి సంబంధించిన ఆశలూ హెచ్చుతూ వచ్చాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘పర్సవర్సన్‌’ రోవర్‌ అంగారకుడిపై సురక్షితంగా కాలూనడం ఆ గ్రహ పరిశోధనలో మరో ముందడుగు. రాబోయే పదేళ్ళకాలంలో దాని ప్రయోగ లక్ష్యం పరిపూర్ణమైనపక్షంలో అరుణగ్రహం మీద మనకున్న అవగాహన మరింత పెరుగుతుంది. భూగోళం పుట్టుకతో పాటు మొత్తం సౌరకుటుంబం ఆవిర్భావం వరకూ మనం చేసుకున్న సిద్ధాంతాలను కాస్తంత సవరించుకోవలసి రావచ్చు. భూమిమీదకు అది పంపిన నమూనాలు విశ్వావిర్భావ రహస్యాలనూ ఛేదించవచ్చు.


అరుణగ్రహం మీదకు రోవర్‌ దిగుతున్న దృశ్యం ఎంతో ఉద్వేగాన్నీ, సంభ్రమాన్నీ కలిగించింది. ఏడునెలల దాని ప్రయాణం వేరు, చివరి ఏడునిముషాలూ వేరు. అంతరిక్షంలో లక్షలాదిమైళ్ళ అఖండ ప్రయాణాన్ని నియంత్రించడంతో పోల్చితే, అంగారకుడి నేలమీద రోవర్‌ వాలే ఈ చివరి ఘట్టాన్ని పరిపూర్ణం చేయడమే శాస్త్రవేత్తల నైపుణ్యానికి అసలైన పరీక్ష. సిగ్నల్‌ రాకపోకలకు పదినిముషాలకు పైగా పడుతున్నస్థితిలో దానిని ఎప్పటికప్పుడు ఇక్కడనుంచి కంట్రోల్‌ చేయడం జరిగేపనికాదు. అనుకున్న స్థలంలో అది నిక్షేపంగా దిగడం, ఆ తరువాత క్రమం తప్పకుండా తనపని ఆరంభించడం విశేషం. ‘జెజిరో క్రేటర్‌’ మీద పారాచూట్‌ తెరుచుకోవడం దగ్గరనుంచి నేలవాలే ఆ మొత్తం పదకొండునిముషాల విడియోతో పాటు, అంగారకుడి ఉపరితలం మీద శబ్దాల్ని మైక్రోఫోన్‌తో రికార్డు చేసి పంపడం ద్వారా శాస్త్రవేత్తల నమ్మకాన్ని వమ్ముచేయబోనన్న భరోసా ఇచ్చింది. ‘పర్సవరెన్స్‌’ రోవర్‌ సైజులోనూ, బుద్ధిలోనూ ఇప్పటివరకూ తయారైన ఇతర రోవర్‌లకంటే ఎన్నోరెట్లు పెద్దది. కారుసైజున్న ఈ రోవర్‌కు అమర్చిన ఇరవై త్రీడీ కెమెరాలు, సెన్సార్‌లు, మైక్రోఫోన్లు అన్నీ అత్యంత శక్తిమంతమైనవి, ఆధునాతనమైనవి. రోవర్‌ వాటిని పరిపూర్ణంగా వినియోగించి, సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాసాకు చేరవేయగలదు. మరో రెండునెలల్లో రోవర్‌నుంచి వీడిన ఒక చిన్న డ్రోన్‌ సమీపంలోని ఎత్తయిన గుట్టల్ని కూడా అన్వేషించి అక్కడి గుట్టు తేలుస్తుంది. నమూనాలను నిక్షిప్తంచేయడానికి నలభైకిపైగా చిన్నచిన్న కంటైనర్లు సిద్ధంగా ఉన్నాయి. విశ్వరహస్యాలను తమలో నిక్షిప్తం చేసుకున్న ఈ నమూనాలు భూమికి చేరడానికి దశాబ్దం పట్టవచ్చును కానీ, అవి తెలియచెప్పబోయే విశేషాలు చిన్నవేమీ కావు.


అంగారకుడిమీద ద్రవరూపంలో నీరుందని ఇప్పటికే నాసా నిర్థారించింది. కోట్లాది సంవత్సరాల క్రితం నీరుపారిన ఆ గ్రహం అగ్నిపర్వతాలవల్లనో, భారీ గ్రహశకలాల తాకిడివల్లనో గడ్డకట్టుకుపోయి ఉండవచ్చు. 350కోట్ల సంవత్సరాల క్రితం అతిపెద్ద సరస్సు ఉన్నదని నమ్ముతున్న చోటనే ఇప్పుడు పర్సవరెన్స్‌ పరిశోధనలు చేయబోతున్నది. సరిగ్గా అదే కాలంలో భూమిమీద ఏకకణజీవి ఆవిర్భావం, తదనంతర పరిణామక్రమంలో మానవుడితో సహా అత్యంత సంక్లిష్టమైన జీవజాలం అభివృద్ధిచెందడానికి ద్రవరూపంలో ఉన్న నీరే మూలకారణం. అరుణుడిమీద ఉన్న నీరు కూడా ఇటువంటిదేనా? అది మనకు ఊహకందనంత ఉప్పగా ఉండవచ్చునా? ఆ నీరు ఎటువంటిదైనా సరే, భూమిమీద మాదిరిగానే నీరు ఉంటే చాలు అక్కడా జీవం ఉన్నట్టేనా? జీవం ఉనికిని సమర్థించే మీథేన్‌ కూడా అక్కడ పుష్కలంగా ఉన్నదని తేలింది కనుక, తొట్టతొలిసారిగా అత్యంత శక్తిమంతమైన రోవర్‌ కదలికలతో అంగారకుడిమీద అధ్యయనాలు కొత్తపుంతలు తొక్కబోతున్నాయి. తన పేరుకు తగ్గట్టుగానే, పర్సవరెన్స్‌ పట్టువదలని పరిశోధనలు సాగించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి తేవాలని కోరుకుందాం.

Advertisement
Advertisement
Advertisement