కనిపిస్తే చంపేస్తాం: టిక్‌టాక్‌లో మిలిటరీ బెదిరింపులు

ABN , First Publish Date - 2021-03-05T00:41:42+05:30 IST

ఈరోజు రాత్రి నగరం మొత్తం పెట్రోలింగ్‌ నిర్వహించబోతున్నాను. నాకు ఎవరైనా కనిపిస్తే కాల్పిపారేస్తా. ఎవరికైనా చావాలని ఉంటే చెప్పండి. వారి కోరిక నేను తీరుస్తా

కనిపిస్తే చంపేస్తాం: టిక్‌టాక్‌లో మిలిటరీ బెదిరింపులు

నేపిడా: ఇండియాలో నిషేధానికి గురైన టిక్‌టాక్ ఇప్పుడు మయన్మార్‌లో మిలిటరీకి ఆయుధంగా మారింది. ఆర్మీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు టిక్‌టాక్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోంది అక్కడి మిలటరీ. మిలిటరీకి అనుకూలంగా ఇప్పటికే టిక్‌టాక్‌లో 800 పైగా ఇలాంటి బెదిరింపులకు సంబంధించిన వీడియోలను గుర్తించినట్లు మయన్మార్ ఐసీటీ ఫర్ డెవలప్‌మెంట్ (ఎంఐడీఓ) పేర్కొంది. కాగా బుధవారం ఒక్కరోజే మయన్మార్‌లో 38 మంది నిరసనకారులు చనిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.


సోషల్ మీడియా ద్వారా మిలిటరీ విధ్వేషాలకు పాల్పడుతోందని, ప్రస్తుతం కనిపిస్తున్నవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమేనని ఎంఐడీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టాకియే టాకియే ఆంగ్ తెలిపింది. మయన్మార్, సైనికులు, పోలీసులు వందల సంఖ్యలో ఇలాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.


‘‘ఈరోజు రాత్రి నగరం మొత్తం పెట్రోలింగ్‌ నిర్వహించబోతున్నాను. నాకు ఎవరైనా కనిపిస్తే కాల్పిపారేస్తా. ఎవరికైనా చావాలని ఉంటే చెప్పండి. వారి కోరిక నేను తీరుస్తా’’ అని ఓ సైనికుడు టిక్‌టాక్ వీడియో చేశాడు. మరో సైనికుడు అదే టిక్‌టాక్‌లో ‘‘నేను నిజంగా నిజమైన బుల్లెట్లే పేలుస్తాను. నాకెవరైనా బయట కనిపిస్తే చెప్పరాని చోట్ల కాల్చేస్తా’’ అని వీడియో చేశాడు. మయన్మార్‌లో ధ్వేషాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను మిలిటరీ బాగా ఉపయోగిస్తోంది.


అయితే చైనాకు చెందిన ఈ టిక్‌టాక్ చెప్పే విషయం మరోలా ఉంది. ఈ కంపెనీ చెందిన ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘టిక్‌టాక్‌కు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ధ్వేషపూరితమైన కంటెంట్‌ను, తప్పుడు సమాచారాన్ని మేం ఎంత మాత్రం ఒప్పుకోం. అలాంటివి అప్‌లోడ్ అయినా వెంటనే మా సిబ్బంది వాటిని టిక్‌టాక్ నుంచి తొలగిస్తుంది’’ అని పేర్కొన్నారు.


ప్రజాస్వామిక ప్రభుత్వం కూల్చివేత

గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. అంగ్‌సాన్ సూకీని అరెస్టు చేసి, నిర్బంధించింది. దీంతో మయన్మార్‌ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలను సైనిక ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఇప్పటి వరకు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


మన దేశంలో ఇప్పటికే మయన్మార్ శరణార్థులు వేలాది మంది ఉన్నారు. సహజసిద్ధ స్థానికులైన చిన్ జాతివారు, రొహింగ్యాలు మన దేశానికి వచ్చారు. గతంలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో వీరు తమ దేశాన్ని విడిచి, మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు.

Updated Date - 2021-03-05T00:41:42+05:30 IST