నా కొడుకు పోయాడు.. ఇప్పుడు నా కోడలిని ఆర్మీకి పంపిస్తా.. హెలికాఫ్టర్ ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన తల్లి వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2021-12-10T17:37:41+05:30 IST

అనుకోని ప్రమాదంలో కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ ఆ తల్లి తన దేశభక్తిని ఘనంగా చాటుకుంది.

నా కొడుకు పోయాడు.. ఇప్పుడు నా కోడలిని ఆర్మీకి పంపిస్తా.. హెలికాఫ్టర్ ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన తల్లి వ్యాఖ్యలు!

ఊహించని ప్రమాదంలో కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ ఆ తల్లి తన దేశభక్తిని ఘనంగా చాటుకుంది. కొడుకు పోతే ఏం?, కోడలిని దేశ సేవ కోసం పంపిస్తానని సగర్వంగా ప్రకటించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన కో-పైలెట్ కుల్దీప్ సింగ్ తల్లి కమలా దేవి చెప్పిన మాటలు ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నాయి. అండగా ఉండాల్సిన సమయంలో కొడుకు దూరమైనందుకు బాధగానే ఉన్నా.. అలాంటి కొడుకుకు తల్లినైనందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 


`దేశానికి సేవ చేస్తూ నా కొడుకు మరణించాడు. ఇప్పుడు నా కోడలిని ఆర్మీకి పంపిస్తా. మా తుఝే సలామ్` అంటూ కన్నీళ్లతో కమలాదేవి చెప్పారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఝుంఝును గ్రామానికి చెందిన కుల్దీప్ చిన్నప్పట్నుంచి పైలెట్ కావాలనే కోరికతోనే ఉండేవాడు. తనను తాను ఎప్పుడూ పైలెట్‌గానే ఊహించుకునే వాడని అతని మామ రాజేందర్ సింగ్ తెలిపారు. అతను ఎప్పుడు గ్రామానికి వచ్చినా తన చదువుకున్న పాఠశాలకు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేవాడని, దేశానికి సంబంధించిన విషయాలు చెప్పేవాడని చెప్పారు. 


కుల్దీప్ మరణ వార్త విని ఆయన భార్య యశస్విని విషాదంలో మునిగిపోయింది. కుల్దీప్ మరణానికి ఊరు ఊరంతా మౌనం పాటించింది. ఆ రోజు ఊరిలో ఎవరూ వంట చేసుకోకుండా అందరూ కుల్దీప్ ఇంటి దగ్గరే ఉన్నారని సర్పంచ్ హర్‌పాల్ సింగ్ చెప్పారు. కుల్దీప్ తమ గ్రామానికి చెందిన వాడైనందుకు ఎంతో గర్వపడుతున్నామని చెప్పారు. కుల్దీప్ గొప్ప దేశభక్తుడని, అతను తమ గ్రామానికి ఎంతో వన్నె తెచ్చాడని పేర్కొన్నారు. కుల్దీప్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తామంతా ఎంతో ఉద్వేగంగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. 



Updated Date - 2021-12-10T17:37:41+05:30 IST