పడగ విప్పిన పాతకక్షలు

ABN , First Publish Date - 2022-05-18T07:13:31+05:30 IST

ఆస్తి వివాదం అగ్గి రాజేసింది.కొన్నేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

పడగ విప్పిన పాతకక్షలు
గాయపడ్డ మహేష్‌

 అంగేరి చెరువులో ఆస్తి వివాదాలతో

    ఇరువర్గాల పరస్పర దాడులు

 15మందికి గాయాలు

 ఒకరి పరిస్థితి విషమం


శ్రీకాళహస్తి/తొట్టంబేడు/కేవీబీపురం, మే 15:ఆస్తి వివాదం అగ్గి రాజేసింది.కొన్నేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పాతకక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాల పరస్పర దాడుల్లో 15మంది తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు..... కేవీబీపురం మండలం అంగేరిచెరువు గ్రామానికి చెందిన శంకరయ్యకు ఇద్దరు భార్యలు.మొదటి భార్య రాజేశ్వరి ఐదేళ్ల క్రితం మరణించింది.ఆమెకు మహేష్‌,రవీంద్ర అనే కొడుకులతో పాటు ఒక ఆడబిడ్డ ఉంది. ఇక రెండవ భార్య బుజ్జమ్మకు శివ అనే కొడుకు, శైలజ అనే కుమార్తె ఉన్నారు. నాలుగేళ్ల క్రితం శంకరయ్య తన యావదాస్తిని మొదటి భార్య పిల్లలకు బదిలీ చేశాడు. దీంతో ఇద్దరు భార్యల పిల్లల మధ్య ఆస్తి వివాదం రాజుకుంది. రెండవ భార్య తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ భర్తను నిలదీసింది.శంకరయ్య నిరాకరించడంతో నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలమధ్య గొడవలు జరిగాయి.మొదటి భార్య సంతానంతో రెండవ భార్య కుటుంబానికి ఆస్తి గొడవలు చోటు చేసుకుని 2018లో ఇరు వర్గాలూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శంకరయ్య మొదటి భార్య పిల్లల వద్దనే ఉంటున్నాడు. మంగళవారం రెండవ భార్య పిల్లలు శివ, శైలజ బోరు వద్ద నుంచి బిందెలతో నీరు తీసుకుని ఇంటివైపు వెళుతుండగా పెద్ద భార్య కుమారుడు మహేష్‌ వీధిలో ఉన్న కుక్కపై రాయి విసిరాడు.దీంతో శైలజ భర్త దామోదరం, సమీప బంధువు కుమారుడు వెంకటరమణ ఎందుకు రాళ్లు విసురుతావంటూ మహేష్‌ను ప్రశ్నించారు.ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది.పరస్పరం కారప్పొడి కళ్లలో చల్లుకుంటూ కత్తులు, ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో శంకరయ్య(65)తో పాటు ఆయన మొదటి భార్య వర్గానికి చెందిన  చెంగయ్య(50), రవీంద్ర(35), వెంకటేష్‌(60), పల్లవి(26), ఈశ్వరమ్మ, మహేష్‌(32), శ్రీహరి(30), సుజాత(30),రెండవ భార్య బుజ్జమ్మ(54)తో పాటు వెంకట్రమణయ్య(55), సుమతి(30), వెంకట్రామయ్య (55), వెంకట్రమణ(25), శివ(22), మల్లమ్మ (48) గాయపడ్డారు.క్షతగాత్రులంతా చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేరారు.వెంకటేష్‌, మహేష్‌, చెంగయ్య, శంకరయ్య, ఈశ్వరమ్మ,బుజ్జమ్మలను ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.వీరిలో చెంగయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.కుక్కను తరిమిన సాకుతో అకారణంగా దాడి చేశారని మొదటి భార్య వర్గం ఆరోపిస్తుండగా గతంలో రెండుసార్లు శైలజపై దాడి జరగడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశామన్న కక్షతోనే గొడవకు ప్రేరేపించి దాడికి దిగారని రెండవ భార్య వర్గం ఆరోపిస్తోంది. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, ఏఎస్‌ఐ లోకనాథం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకుని ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.



Updated Date - 2022-05-18T07:13:31+05:30 IST