ఏసీబీ వలలో ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి

ABN , First Publish Date - 2022-05-21T05:36:11+05:30 IST

మండలంలోని ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి టి. కృష్ణమోహన్‌ శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ వలలో ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి
ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

రూ. 7వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

దోమకొండ, మే 20 : మండలంలోని ముత్యంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి టి. కృష్ణమోహన్‌ శుక్రవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి మండలం బ్రాహ్మణ్‌పల్లి గ్రామానికి చెందిన చెట్కూరి రాజయ్య తన కుమార్తె ధర్ని భూదేవిని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మహేందర్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశాడు. అయితే అనారోగ్యంతో మహేందర్‌ 2018లో మృతి చెందాడు. దీంతో పది నెలల క్రితం భూదేవి వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అలాగే తనింటి సర్వే నెంబరు వివరాలను అడగగా.. తనకు రూ.20వేలు ఇస్తే ఇంటి సర్వే నెంబర్‌తో పాటు వితంతు పింఛన్‌ వచ్చేలా చూస్తానని గ్రామ పంచాయతీ కార్యదర్శి టి. కృష్ణమోహన్‌ చెప్పాడు. చివరకు ఇద్దరి మధ్య రూ.7 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం భూదేవి తన తండ్రి చెట్కూరి రాజయ్యతో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం రాజయ్య గ్రామ కార్యదర్శికి ఫోన్‌ చేయగా.. కామారెడ్డిలో ఉన్నానని చెప్పాడు. కామారెడ్డికి వెళ్లిన రాజయ్య నిజాంసాగర్‌ చౌరస్తాలో కార్యదర్శి కృష్ణమోహన్‌ను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యదర్శిని ముత్యంపేటకు తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడే విచారణ చేపట్టారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ అంజనీకుమార్‌, సీఐలు నగేశ్‌, శ్రీనివాస్‌రావు, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-21T05:36:11+05:30 IST