లాక్‌డౌన్‌ కాలంలోనూ 9 హత్యలు.. జనం ఇళ్లల్లో ఉన్నా నో బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-06-08T14:59:51+05:30 IST

భాగ్యనగరంలో 25 రోజులుగా సాగుతున్న లాక్‌డౌన్‌ను పక్కాగా అమలవుతున్నా

లాక్‌డౌన్‌ కాలంలోనూ 9 హత్యలు.. జనం ఇళ్లల్లో ఉన్నా నో బ్రేక్‌!

  • విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచితే తప్ప..
  • నివారణకు మరో మార్గం లేదు

హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలో 25 రోజులుగా సాగుతున్న లాక్‌డౌన్‌ను పక్కాగా అమలవుతున్నా అందులో హత్యలాంటి నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ జనం బయటకు రాకున్నా నేరస్థులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. అడుగడుగునా చెక్‌ పోస్టులు, ప్రతిచోటా పోలీసుల పహారతో ప్రధాన రోడ్లపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ వీధులు, బస్తీల్లో మాత్రం ఆ సీను కనిపించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే రాత్రిపూట అత్యధిక చెక్‌పోస్టుల వద్ద కూడా పోలీసులు కనిపించడం లేదు. నేరాలను అదుపు చేయాలంటే విజిబుల్‌ పోలీసింగ్‌ ప్రధాన భూమిక పోషిస్తుందనేది పోలీసుల ప్రాథమిక సూత్రం.


కానీ, లాక్‌డౌన్‌లో రోడ్లపై కనిపించినప్పటికీ చిన్నరోడ్లు, బస్తీల్లో పోలీసులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారని, ఎలాగోలా కేసులు తగ్గుతున్నాయని, పగటిపూట లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేస్తారనే సంకేతాలు వస్తున్నందున ఆ విషయాలపై జనం, పోలీసులు అంతగా సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదనే చెప్పవచ్చు. కానీ, లాక్‌డౌన్‌లో హత్య లాంటి నేరాలు చోటుచేసుకోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత నగరంలో మొత్తం 9 హత్యలు జరిగాయి. వాటిలో 7 హత్యలు లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే జరగ్గా, 2హత్యలు అంతకు ముందు జరిగినప్పటికీ.. లాక్‌డౌన్‌ అమలైన తర్వాత వెలుగు చూశాయి.


ఇటీవల జరిగిన హత్యలు...

మే 13: సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొత్తపేటలో ఉన్న శ్రీదుర్గా భవానీ హోటల్‌లో చికెన్‌ ఇవ్వలేదన్న కోపంతో నలుగురు యువకులు కలిసి సర్వర్‌ బాలాజీని బండరాయితో మోది హతమార్చారు. 


మే 14: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రామ్మూర్తి అనే బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ మే11న ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆ తర్వాత మే 14న చెరువులో శవమై తేలడంతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని గుర్తించారు. 


మే 17: నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముంటున్న శ్యాంసుందర్‌, నవీన్‌లు స్నేహితులు. గతంలో మద్యం మత్తులో శ్యాం దూషించాడు. దీంతో కక్ష పెంచుకున్న నవీన్‌ ఆ రోజు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి సిమెంట్‌ బ్రిక్‌తో దాడి చేయగా అతను మృతి చెందాడు. 


మే 21: బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌ ప్రాంతంలో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మరాఠీగల్లీ ప్రాంతానికి చెందిన ఎజాజ్‌ను రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 


మే 23: తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో బీకేఆర్‌ శర్మ, మహేశ్‌, ఉదయ్‌, అబ్రహార్‌, సుదీప్‌లు చికిత్స పొందుతున్నారు. గత నెల15న బీకేఆర్‌ శర్మతో ఆ నలుగురూ గొడవ పడి సమీపంలోని కిటికీ అద్దాలతో శర్మ గొంతులో పొడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 


మే 23: తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆల్బర్ట్‌ అనే వ్యక్తి తన భార్య రేఖను హతమార్చి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త ప్రతిరోజు మద్యం తాగడంతో వారి మధ్య గొడవలు జరిగేవని, ఆ విషయంలోనే భార్యాభర్తలు గొడవ పడటంతో ఆమెను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.


జూన్‌ 1: అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో బహదూర్‌ అనే యాచకుడు బోర్‌పంపు వద్ద స్నానం చేస్తుండగా.. పురుషోత్తం రెడ్డి అనే మరో యాచకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. వారిద్దరి మధ్య గొడవలో బహదూర్‌ దాడి చేయగా పురుషోత్తం రెడ్డి హతమయ్యాడు.  


జూన్‌ 2: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాజుల రామారంలో కేతావత్‌రాజు అనే వ్యక్తి తన భార్య సువర్ణను అనుమానంతో హతమార్చాడు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి గొడవ పడ్డాడు. ఆగ్రహానికి లోనైన రాజు కర్రతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.


జూన్‌ 6: ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో షారుక్‌ అనే యువకుడిని అతని మామ పట్టపగలు హత్య చేశాడు. మరి కాసేపట్లో లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిన పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. పోలీసుల చెక్‌పోస్టుకు 100మీటర్ల దూరంలో గొంతు కోసి హతమార్చాడు.

Updated Date - 2021-06-08T14:59:51+05:30 IST