హతవిధీ!

ABN , First Publish Date - 2022-08-09T05:15:22+05:30 IST

మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంఽధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే వధువు తండ్రి, ఆయన తల్లి విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు.

హతవిధీ!
విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన తల్లీకొడుకు


విద్యుదాఘాతంతో తల్లీ కొడుకుల దుర్మరణం
మూడు రోజుల్లో కుమార్తె వివాహం
అంతలోనే తండ్రి, నానమ్మ మృత్యువాత
వావిలపాడు జంక్షన్‌లో విషాదం
వేపాడ, ఆగస్టు 8:
మూడు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంఽధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంది. వివాహం సన్నాహక పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే వధువు తండ్రి, ఆయన తల్లి విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన వావిలపాడు జంక్షన్‌లో సోమవారం ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నల్లబిల్లి గ్రామానికి చెందిన కరక సత్యనారాయణ (50) సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పొలంలో మోటారు వేసేందుకు వెళ్లాడు. గట్టుపై ఉన్న స్టే వైరు సాయంతో వెళ్లే ప్రయత్నంలో విద్యుదాఘాతంతో కుప్పకూలిపోయాడు. అయితే పొలానికి వెళ్లిన కుమారుడు ఎంతసేపటికీ రాకపోవడంతో తల్లి సింహాచలం (70) వెతుకుతూ వెళ్లింది. కుమారుడు అచేతనంగా పడి ఉండడంతో ఆందోళనకు గురై సపర్యలుచేసే ప్రయత్నంలో షాక్‌ గురై దుర్మరణం పాలైంది. తల్లీ కొడుకులు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెతుకుతూ పొలం వైపు వెళ్లారు. అయితే ఇద్దరూ పొలంలో ఒకేచోట కుప్పకూలిపోయి ఉండడాన్ని గమనించారు. విద్యుత్‌ షాక్‌గా భావించి ముందుగా సరఫరాను నిలిపివేశారు. మృతదేహాల వద్ద కుటుంబసభ్యులు గుండెలలిసేలా రోదించారు. మృతుడు సత్యనారాయణకు భార్య వీరలక్ష్మి, కుమార్తెలు శ్రావణి, పావని, తండ్రి వెంకటేశ్వరరావు, అత్త, మామలు పండారి రామలక్ష్మి, పాపారావులు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. తూర్పు గోదావరి జిల్లా ఊలపల్లి గ్రామం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. వావిలపాడు జంక్షన్‌లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. అక్కడే టిఫిన్‌ షాపు నడుపుతున్నారు. ఈ ప్రాంతీయులకు సత్యనారాయణ సుపరిచితుడు. తల్లీ కొడుకుల మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెళ్లింట ‘మృత్యు’ ఘోష
ఈ నెల 11న చిన్న కుమార్తె పావని వివాహం జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సారె కూడా సమకూర్చుకున్నారు. బంధువులు కూడా చేరుకున్నారు. ఇంతలో పొలంలో మోటారు వేసి వస్తానని చెప్పిన సత్యనారాయణ మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలలిసేలా రోదిస్తున్నారు. అటు కుమారుడు, ఇటు భార్య మృతదేహాలు చూసి వృద్ధుడు వెంకటేశ్వరరావు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. ఎంతో ఆనందంగా మనుమరాలి వివాహం చేస్తామనగా.. దేవుడు కరుణించ లేదంటూ కన్నీమున్నీరయ్యాడు.  సమాచారమందుకున్న వల్లంపూడి ఎస్‌ఐ రాజేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహా లను పోస్టుమార్టం కోసం ఎస్‌.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.


Updated Date - 2022-08-09T05:15:22+05:30 IST