వీడిన మిస్టరీ

ABN , First Publish Date - 2020-11-01T10:25:16+05:30 IST

భోగాపురంలో ఆళ్ల విజయలక్ష్మి (65) అనే వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ విడింది. ఇంటి కోసం అక్క కుమారుడు ఆళ్ల విజయ్‌కుమారే ఆమెను

వీడిన మిస్టరీ

ఇంటి కోసం వృద్ధురాలి హత్య

అక్క కుమారుడే నిందితుడు


భోగాపురం, అక్టోబరు 31: భోగాపురంలో ఆళ్ల విజయలక్ష్మి (65) అనే వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ విడింది. ఇంటి కోసం అక్క కుమారుడు ఆళ్ల విజయ్‌కుమారే ఆమెను హత్యచేశాడు. బంగారు ఆభరణాల కోసం దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నమ్మించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు...సమగ్రంగా దర్యాప్తు చేసి... హత్యగా నిర్ధారించారు. నిందితుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆళ్ల విజయలక్ష్మికి ఐదుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఆమె భోగాపురంలోని కొమ్మూరు వీధిలో నివాసముంటోంది. భర్త కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి అక్క కుమారుడు విజయ్‌కుమార్‌ను తెచ్చుకొని ఆ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంటి కోసం వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గత నెల 26న మరోసారి వారి మధ్య వివాదం జరిగింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ అదే ఇంట్లో నిద్రపోయారు. ఆ మరుసటి రోజు విజయలక్ష్మి ఇంట్లో విగత జీవిగా కనిపించింది. మెడలోని బంగారు ఆభరణాలు కనిపించలేదు.


ఇది దొంగలు చేసిన ఘాతుకంగా విజయ్‌కుమార్‌ నమ్మించాడు. ఇంతలో అదే కుటుంబానికి చెందిన ఆళ్ల సంధ్య... వృద్ధురాలి మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ మహేష్‌ రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తులో విజయ్‌కుమారే హత్యకు పాల్పడినట్టు నిర్థారణ అయ్యింది. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి ప్రశ్నించగా ఇంటి కోసం తానే హత్యకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. కేసును పక్కదారి పట్టించేందుకు బంగారు ఆభరణాలు తీసి బీరువాలో దాచిపెట్టినట్టు చెప్పినట్టు వీరాంజనేయరెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ మహేష్‌, ఏఎస్‌ఐ రాజులను డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-11-01T10:25:16+05:30 IST