పాత నేరస్తుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-03-08T05:24:01+05:30 IST

జేబు దొంగతనాలకు పాల్పడే ముఠా సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. దోచుకున్న డబ్బును పంచుకోవడంలో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు దారితీశాయి.

పాత నేరస్తుడి దారుణ హత్య
హత్యకు గురైన పవన్‌

కత్తితో పొడిచిన సహచరులు

ఆర్థిక విభేదాలే కారణం


నెల్లూరు(క్రైం), మార్చి 7: జేబు దొంగతనాలకు పాల్పడే ముఠా సభ్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. దోచుకున్న డబ్బును పంచుకోవడంలో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు దారితీశాయి. పోలీసుల సమాచారం మేరకు... నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీకి చెందిన నెల్లూరు వెంకటేశ్వర్లుకు బాబ్జీ, పవన్‌ అనే కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు బాజ్జీ జేబు దొంగతనాలు చేస్తూ జల్సా చేయడానికి అలవాటుపడ్డాడు. ఇటీవలే బాబ్జీని అతని ప్రత్యర్థులు హత్య చేశారు. ఇక చిన్న కుమారుడు పవన్‌ తండ్రితో ఉంటూ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తండ్రి వెంకటేశ్వర్లు చనిపోవడంతో పవన్‌ అంకయ్య, రాము, మరో ఇద్దరితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును పంచుకునే వారు. రోజుకో ప్రాంతంలో తలదాచుకునే వాడు. అతనిపై కావలి, బుచ్చి, నెల్లూరు నగరంతోపాటు ప్రకాశం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులున్నాయి. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం పవన్‌కు ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో చోరీ చేసిన సొమ్ములో ఎక్కువ భాగం పవన్‌ తీసుకుంటూ దానిని సదరు మహిళకు ఇస్తుండటంతో స్నేహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పవన్‌ స్నేహితులతో దూరంగా ఉంటూ వచ్చాడు. ఇది సహించలేని స్నేహితులు శనివారం అర్ధరాత్రి ఎన్‌టీఆర్‌ నగర్‌ వెళ్లి పవన్‌తో గొడవకు దిగారు. ముగ్గురు కలిసి పవన్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యారు. సహజీవనం చేస్తున్న మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పవన్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్థారించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని నగర డీఎస్పీ జే శ్రీనివాసులు రెడ్డి, బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జీ మంగారావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-08T05:24:01+05:30 IST