వృద్ధురాలి హత్య

ABN , First Publish Date - 2022-06-30T05:33:44+05:30 IST

వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.

వృద్ధురాలి హత్య

శరీరంపై బంగారు ఆభరణాల చోరీ 

  దొంగల పనా? తెలిసిన వాళ్లే హతమార్చారా? 

చిట్టినగర్‌, జూన్‌ 29 : వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన వించిపేటలో జరిగింది. వించిపేట ఫోర్‌మెన్‌ బంగ్లా ప్రాంతంలో కుంభా బేబమ్మ (80) నివాసం ఉంటుంది. భర్త రాము కొన్నాళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు కుమార్తె అంజమ్మ ఉన్నారు. అంజమ్మ ఏడు నెలల క్రితం మృతి చెందింది. ఆమె భర్త కూడా మరణించారు. అంజమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అప్పుడప్పుడు బేబమ్మ ఇంటికి మనవరాళ్లు, మనవళ్లు వచ్చి చూసి వెళ్తుంటారు. ఆమె ఇంట్లో  ఒంటరిగా ఉంటుంది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పక్కింట్లో అద్దెకు ఉండే మహిళ బేబమ్మకు టీ ఇచ్చేందుకు పిలువగా రాలేదు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బేబమ్మ మంచంపై చనిపోయి ఉంది. వెంటనే ఆమె విషయం ఫోన్‌లో బేబమ్మ మనవరాళ్లకు, మనవళ్లకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డాగ్‌ స్కాడ్‌ ఘటనాస్థలం నుంచి పాతరాజరాజేశ్వరిపేట సుబ్బరాజు పాకల వరకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్‌ టీం నిపుణలు ఘటనా స్థలం నుంచి కొన్ని వేలిముద్రలను సేకరించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ బాబూరావు, ఏసీపీ హనుమంతరావు పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్‌ సుబ్రమణ్యం కేసు నమోదు చేశారు. బేబమ్మ శరీరంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. ఆస్తి కోసం బేబమ్మ కుటుంబంలో ఒక వివాదం నడుస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బేబమ్మ హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య ఇంట్లో వాళ్ల నుంచే జరిగిందా? బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేబమ్మ ఒంటిపై ఉన్న బంగారం తాడు, కాళ్లకు ఉన్న పట్టీలు, చెవుల దిద్దులు, ముక్కుపుడకను ఎత్తుకెళ్లారు. బేబమ్మ ఒంటిరిగా ఉంటుందన్న సమాచారంతో ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. 


Updated Date - 2022-06-30T05:33:44+05:30 IST