Abn logo
Jun 15 2021 @ 00:32AM

మునిసిపల్‌ కార్మికుల నిరసన

భీమవరం అర్బన్‌, జూన్‌ 14: కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె తప్పదని  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా భీమవరం పురపాలక సంఘంలో పని చేస్తున్న కార్మికులు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా   గోపాలన్‌ మాట్లాడుతూ అనేక సార్లు    మంత్రులు, అధికారులకు మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర సమస్యల్ని విన్నవించినా  పట్టించుకోవడం లేదన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.  ధర్నాలో సీఐటీయు భీమవరం పట్టణ కార్యదర్శి వాసుదేవరావు, గంటి నాగేంద్ర,  ఎన్‌. రాజు, బైర్రాజు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి

పెనుగొండ, జూన్‌ 14: కార్మికులకు వేతనాలు ప్రభుత్వమే చెల్లించాలని సీఐటీయు జిల్లా నాయకుడు ఎస్‌. వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కనీస  వేతనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో పెనుగొండ మండలం దేవ, ములపర్రు గ్రామ పంచాయతీలలో కార్మికులు  వినతిపత్రాలు అందించారు. కార్మికులకు వేతన బకాయిలు  తక్షణమే చెల్లించాలని లేని  పక్షంలో కార్మికులు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.  పంచాయతీ కార్మికులు కరుణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, రమేష్‌, నాగార్జున, శ్రీను, ధర్మారావు పాల్గొన్నారు.