ఓటమికి భయపడే వైసీపీ బెదిరింపులు

ABN , First Publish Date - 2021-03-05T15:18:47+05:30 IST

ప్రజాక్షేత్రంలో నిలబడలేక, దొడ్డిదారిన గెలుపు సాధించేందుకు వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను కొంటున్నారని నూజివీడు టీడీపీ..

ఓటమికి భయపడే వైసీపీ బెదిరింపులు

ముద్దరబోయిన మండిపాటు


నూజివీడు: ప్రజాక్షేత్రంలో నిలబడలేక, దొడ్డిదారిన గెలుపు సాధించేందుకు వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను కొంటున్నారని నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మండిపడ్డారు. నూజివీడు పురపాలక పోరులో వివాదాలపై గురువారం ముద్దరబోయిన మాట్లాడారు. మున్సిపల్‌ పరిధిలో 32 వార్డులకు టీడీపీ అభ్యర్థులు పోటీలో దిగారని, తమ అభ్యర్థులను భయపెట్టి, ప్రలోభపెట్టి రెండు వార్డుల్లో నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంతో పాటు ఒక వార్డులో అభ్యర్థిని బలవంతంగా వైసీపీలో చేర్చుకున్నారన్నారు. రెండో వార్డులో పోటీలో ఉన్న తమ అభ్యర్థి ఎరకయ్యను భూముల విషయంలో బెదిరించి లోబరుచుకున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు నటించి, వాటిని లబ్ధిదారులకు అప్పగించకుండా నాటకాలాడుతున్న వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T15:18:47+05:30 IST