మట్టి మాఫియా..!

ABN , First Publish Date - 2022-01-22T05:45:29+05:30 IST

అఽధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా మండలంలోని గుట్టలు, ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.

మట్టి మాఫియా..!
రాప్తాడు పోలీసు స్టేషన వద్ద సీజ్‌ చేసిన టిప్పర్లు

 అధికార పార్టీ నాయకుల ఇష్టారాజ్యం.. యథేచ్ఛగా ఎర్రమట్టి తరలింపు

కనుమరుగవుతున్న గుట్టలు

టిప్పర్ల దెబ్బకు శిథిలమవుతున్న తారు రోడ్లు

పట్టించుకోని అధికారులు


రాప్తాడు, జనవరి 21 : అఽధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా మండలంలోని గుట్టలు, ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. రోజూ వంద టిప్పర్ల మట్టిని అనంతపురం నగరంలోని వెంచర్లకు తరలించి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు.ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా స ంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల అక్రమాలకు వారు జీ హుజూర్‌ అంటున్నారన్న వాదనలున్నాయి. కళ్లెదుటే గు ట్టలు కరిగిపోతున్నా.. పట్టించుకోకపోవడం వెనుక కాసులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతూ జేబులు నింపుకుంటున్నారు. రాప్తాడుతోపాటు మ ండలంలోని బొమ్మేపర్తి, పుల్లలరేవుకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గొం దిరెడ్డిపల్లి, రామినేపల్లి, హంపాపురం, గొళ్లపల్లి సమీప గుట్టలు, ప్ర భుత్వ భూముల్లోని ఎర్రమట్టి మాఫియాకు ఆదాయ వనరుగా మా రింది. పగలు, రాత్రి తేడా లేకుండా... ఎక్స్‌కవేటర్లు, టిప్పర్ల ద్వారా య థేచ్ఛగా రవాణా చేస్తున్నారు. దీంతో గుట్టలు కనుమరుగవుతున్నాయి.


రాత్రివేళల్లోనే రవాణా

గుట్టల్లోని ఎర్రమట్టిని టిప్పర్లద్వారా పగటి వేళ తరలించాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన అక్రమార్కులు రాత్రిపూట తరలిస్తున్నారు. చీకటి పడగానే మట్టి రవాణా ప్రారంభిస్తారు. రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5:30 గంటల వరకూ ఎక్స్‌కవేటర్‌తో మ ట్టిని తవ్వి, 10 టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.


దెబ్బతింటున్న రోడ్లు...

రోజూ టిప్పర్లు అధిక లోడుతో మట్టిని తరలించడతో తారురోడ్లు దెబ్బతింటున్నాయి. గొందిరెడ్డిపల్లి నుంచి రామినేపల్లి వరకూ తారురోడ్డు చాలావరకు దెబ్బతింది. దారంతా గుంతలమయమైంది. దీంతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమార్కులు మట్టిని తరలించడంతో రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన తారురోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. టిప్పర్లు తారురోడ్డు నుంచి కొండ, గుట్ట ప్రాంతానికి రహదారిలో కాకుండా కొన్నిచోట్ల రైతుల పొలాల్లో అడ్డదార్లలో వెళ్తున్నారని పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు. అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనీ, ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


వాహనాలు సీజ్‌ చేస్తున్నా.. ఆగని రవాణా..

అక్రమంగా మట్టి తరలిస్తుంటే కొన్నిసార్లు విజిలెన్స అధికారులు దాడి చేసి, వాహనాలు సీజ్‌ చేశారు. అయినా అక్రమార్కులు మట్టిని తవ్వే ప్రదేశం మార్చి తరలిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం విజిలెన్స ఏడీ నాగేశ్వరరావు హంపాపురం గ్రామ సమీపాన మట్టి తరలిస్తుండగా అ క్కడికెళ్లారు. అనుమతులు లేకుండా తరలిస్తుండటంతో ఐదు టిప్పర్లు, ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేశారు. 2 వేల క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి అక్రమంగా తరలించినట్లు విజిలెన్స అధికారుల తనిఖీలో తేలింది. అ యినప్పటికీ మట్టి రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు.


అధికార అండతో రోజూ

 రూ. లక్షల్లో అక్రమ సంపాదన...

అధికార పార్టీ నేతల అండదండలతో నాయకు లు మట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు. టిప్పరు ఎర్రమట్టిని అనంతపురం నగరంలో దాదాపు రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు.  రోజూ వంద టిప్పర్లు ఎర్రమట్టిని తరలిస్తున్నారంటే... ఈ లె క్కన రోజుకు రూ.5 లక్షలదాకా అక్ర మ సంపాదన మట్టి మాఫియా జేబుల్లోకి చేరుతోంది. ఇలా నెలకు దాదాపు రూ.1.50 కోట్లు సంపాదిస్తున్నారు.


Updated Date - 2022-01-22T05:45:29+05:30 IST