అప్కాబ్‌ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-03-08T07:29:34+05:30 IST

మాజీ ఎమ్మెల్యే, అప్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొల్లికొదురు వీరారెడ్డి(74) గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

అప్కాబ్‌ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి గుండెపోటుతో మృతి
వీరారెడ్డి భౌతికకాయంపై పూలమాలవేసి నివాళలుర్పిస్తున్న రేవంత్‌రెడ్డి

బంజారాహిల్స్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, అప్కాబ్‌ మాజీ చైర్మన్‌ కొల్లికొదురు వీరారెడ్డి(74) గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. పదిరోజుల క్రితం అనారోగ్యం బారిన పడటంతో బంధువులు జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గుండెపోటు రావడంతో కన్ను మూశారు. నారాయణపేట జిల్లా, మరికల్‌ మండలం, పీలేరు గ్రామానికి చెందిన వీరారెడ్డి కాంగ్రెస్‌ నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్కాబ్‌ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని శ్రీ వెంకటేశ్వర హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరారెడ్డి మరణ వార్త తెలియడంతో బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన స్వగృహానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఆర్డీఓ చంద్రకళ తదితరులు వెళ్లి నివాళులర్పించారు. వీరారెడ్డి అంతిమ సంస్కారాలు స్వగ్రామంలో సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2021-03-08T07:29:34+05:30 IST