విశాఖలో పాగా వేసేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు.. విజయసాయి కొత్త ప్లాన్!

ABN , First Publish Date - 2021-02-11T19:43:22+05:30 IST

విశాఖలో పాగా వేసేందుకు అధికార వైసీపీ విశ్వప్రయ‌త్నాలు చేస్తోందా?

విశాఖలో పాగా వేసేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు.. విజయసాయి కొత్త ప్లాన్!

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు అధికార వైసీపీ విశ్వప్రయ‌త్నాలు చేస్తోందా? సాగరతీర నగరంలోని కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న ప్రయ‌త్నాలు ఏమిటి? టీడీపీకి పట్టున్న విశాఖలో వైసీపీకి ఓటు బ్యాంకు పెంచేందుకు ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు? వాచ్ దిస్‌ ఇంట్రస్టింగ్‌ స్టోరీ.


బహిరంగ సత్యమే అయినా..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న విశాఖ‌ను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయం విశాఖ వాసులకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని గ్రహించే  వైసీపీ నేత‌ల‌తోనే నగరంలో రాజధానికి మద్దతుగా వరుసగా ర్యాలీలు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు విశాఖలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు.. అమరావతిలో రైతుల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే విశాఖలో రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని డిమాండ్ చేశారు. ఇక విశాఖ వైసీపీలోని మెజారిటీ నేతలకు సైతం.. ఇక్కడ పాలనా రాజధానిని ఇష్టం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది బహిరంగ సత్యమే అయినా.. ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహన్‌రెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లో విశాఖ‌కు రాజ‌ధాని తీసుకురావాల‌ని గట్టి పట్టుదలతో ఉండటం గమనార్హం.


ఎక్కువ ఫోకస్‌ విశాఖ మీదే!

నిజానికి 2019 ఎన్నిక‌ల‌లో రాష్ట్రమంత‌టా  వైసీపీ జెండా ఎగిరింది. అయితే విశాఖ నగరంలో తూర్పు, ప‌శ్చిమ, ఉత్తర, ద‌క్షిణ నియోజక‌వ‌ర్గాలు నాలుగింటిని తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంది. దీంతో ఇక్కడ వైసీపీ వ్యవ‌హారాల‌ను చూసేందుకు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందు నుంచి సాగరతీర నగరంలో పాగా వేశారు. విశాఖ‌లో వైసీపీని బలోపేతం చేసేందుకు ఇక్కడ ఫుల్‌ టైం వ‌ర్కవుట్ చేయడంలో ఆయన నిమగ్నం అయ్యారు. విశాఖ‌తోపాటుగా  ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ వ్యవహారాలను ఎంపీ విజయసాయిరెడ్డే చూస్తున్నారు. అయితే ఎక్కువ ఫోకస్‌ మాత్రం విశాఖ మీద పెట్టారు. గ‌తంలో జీవీఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ అభ్యర్థుల జాబితా నుండి ప్రతీది ఆయ‌న ద‌గ్గరుండి చూశారు. ఇంత‌లో కొవిడ్‌తో ఆ ఎన్నికలు వాయిదా ప‌డ్డాయి. జీవీఎంసీలో  టీడీపీకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని గ‌తంలో వారి స‌ర్వేలో సైతం వెల్లడి అయింది. ఈ క్రమంలో ఒక‌వేళ విశాఖకు పాల‌నా రాజ‌ధాని వ‌చ్చి, జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ గెలిస్తే ప‌రిస్థితి ఊహించడానికి కూడా కష్టతరంగా ఉంటుందని వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. 


కొత్త ఎత్తుగ‌డ‌లు!

సాధారణంగా విశాఖ‌లో ప్రజ‌లు కాస్తా తెలివిగానే వ్యవ‌హరిస్తారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఓట్లు వేస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం వ‌చ్చాక  పెద్దగా, కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీలేదనే అభిప్రాయం విశాఖవాసుల్లో నెలకొంది. ఇక ఇటీవలకాలంలో విశాఖలో టీడీపీ నేతలే టార్గెట్‌గా అధికార వైసీపీ వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇటు టీడీపీ గ్రాఫ్‌ మరింత పెరగడం వంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇది గ్రహించిన విజ‌య‌సాయిరెడ్డి విశాఖలో కొత్త ఎత్తుగ‌డ‌లకు తెరలేపారని చర్చ జరుగుతోంది.


రంగం సిద్ధమైంది!

ఈ మ‌ధ్యనే సంక్రాంతి పండ‌ుగ‌కు జీవీఎంసీ పరిధిలోని వార్డుల స‌చివాల‌య సిబ్బందితో పాటుగా వాలంటీర్‌లు అందరికీ బ‌ట్టలు, స్వీట్లు, డైరీలు వంటివి అందజేశారు. అంత‌కుముందు దీపావ‌ళి పండ‌ుగకు కూడా అలాగే అందించారట. ఇవన్నీ కూడా ప్రగ‌తిభార‌తీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారని టాక్. అలా అందజేసిన బట్టలు, స్వీట్లు, డైరీలపై జ‌గనన్న కానుక అని ప్రింటింగ్  కూడా చేశారు. ఇందులో నుండే జ‌ర్నలిస్టుల‌కు కూడా  సంఘాల ద్వారా  పండ‌ుగ అయిపోయిన త‌ర్వాత‌ బ‌ట్టలు పంపిణీ చేశారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు నిర్వహించే ఆర్పీల‌తో  ఒక పిక్నిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనీ, మహిళలకు కూడా బట్టలు, స్వీట్లు వంటివి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైందనీ సమాచారం.


ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో..!

ఇక విశాఖలోని మురికివాడలు ఎప్పటినుంచో సమస్యల వలయాల్లో సతమతం అవుతున్నాయనీ, వాటిల్లో మౌలిక వసతులు కల్పిస్తామనీ ఇటీవల హామీలు ఇస్తుండటం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండటం వంటివి చేశారు. మురికివాడల్లో వైసీపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి విశాఖలో విజయసాయిరెడ్డి ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో.. టీడీపీకి పట్టున్న సాగరతీర నగరంలో ఆయన వ్యూహాలు వైసీపీ బలాన్ని పెంచుతాయో లేదో చూడాలి.



Updated Date - 2021-02-11T19:43:22+05:30 IST