Abn logo
May 13 2021 @ 11:38AM

ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ.. చివరి దశకు చేరుకున్న పనులు

హైదరాబాద్/సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్‌గా రూపుదిద్దుకుంటోంది. అటు కంటోన్మెంట్‌ వాసులతోపాటు ఇతర ప్రాంతాల రోగులకు కూడా కొవిడ్‌ వైద్యసేవలు అందించడానికి సరికొత్త హంగులతో సిద్ధమవుతోంది. బొల్లారంలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆస్పత్రి పాత భవనాన్ని కొద్ది సంవత్సరాల క్రితం నేలమట్టం చేశారు. దాని స్థానంలో కోట్ల రూపాయిలు వెచ్చించి, నూతన భవనాన్ని నిర్మించారు. నిధుల లేమి కారణంగా ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించలేకపోయారు. దాంతో బొల్లారం, తిరుమలగిరి తదితర ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 


ఈ ఆస్పత్రికి ప్రత్యేక నిధులు కేటాయించి, అన్ని రకాల వైద్య సేవలకు శ్రీకారం చుడితే, కంటోన్మెంట్‌ వాసులతోపాటు నగర శివార్లు, తెలంగాణ జిల్లాల నుంచి అత్యవసర సేవల కోసం వచ్చే రోగులకు కూడా ప్రయోజనం కలుగుతుందని కంటోన్మెంట్‌ 8వ వార్డు మాజీ సభ్యుడు లోకనాథం ఎన్నోసార్లు రక్షణ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. రక్షణశాఖ నుంచి స్పందన లేదు. టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బోర్డు మాజీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, రక్షణ శాఖతో సమన్వయం లోపించడంతో సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఈ ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్య సేవలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 


కొవిడ్‌ ఆస్పత్రిగా  సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆస్పత్రి

బొల్లారంలోని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆస్పత్రిని త్వరలోనే కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బొల్లారంలోని సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దిన ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగకపోవడం ఆస్పత్రిని అభివృద్ధి చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రిని కలిసి కంటోన్మెంట్‌ బొల్లారం సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆస్పత్రికి కావల్సిన నిధులను మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆక్సిజన్‌ సౌకర్యంతో కూడిన పూర్తి స్థాయి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 


పెద్దఎత్తున ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి రాష్ట్రాలకు నిర్వహించుకునే అవకాశం కల్పించామని అన్నారు. దేశవ్యాప్తంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లను పారామెడికల్‌ సిబ్బందిని తిరిగి తాత్కాలికంగా విధుల్లోకి తీసుకొని కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు అఽధ్యక్షుడు అభిజిత్‌ చంద్ర, సీఈఓ అజిత్‌ రెడ్డి బీజేపీ సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ గౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.రామకృష్ణ, ధనంజయ చారీ, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, రాజశేఖర్‌ రెడ్డి, బానుక మల్లికార్జున్‌, బీజేపీ యువమోర్చా జైనపల్లి శ్రీకాంత్‌, మోండా కార్పొరేటర్‌ దీపిక పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలి: లోక్‌నాథ్‌ డిమాండ్‌

బొల్లారం సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని కంటోన్మెంట్‌ బొర్డు 8 వార్డు మాజీ సభ్యుడు లోక్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. కంటోన్మెంట్‌ బోర్డులో నిధులులేని కారణంగా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోయామన్నారు. అయితే కేంద్ర నిధులు వెచ్చించి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైధ్య సేవలు అందించడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ

ఈ నేపథ్యంలో ఇటీవల మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కంటోన్మెంట్‌ ఆస్పత్రిపై ప్రత్యేకదృష్టి సారించారు. ప్రదేశ్‌కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం వ్యవహారాలు చూసే వేణుగోపాల్‌తో చర్చించారు. ఇతర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తూనే, ప్రస్తుత కొవిడ్‌ కష్ట కాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఇక్కడ కొవిడ్‌ సెంటర్‌ ప్రారంభిస్తే బాగుంటుందని నిర్ణయించారు. ఈ మేరకు కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ అభిజిత్‌చంద్ర, ముఖ్యకార్యనిర్వహణాధికారి అజిత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కంటోన్మెంట్‌ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ సదుపాయాలను మెరుగుపరచడానికి, నూతన వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి కోటి నిధులిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన వారం రోజులకే నిధులను మంజూరు కూడా చేశారు. దాంతో ఆస్పత్రి ఆవరణలోని భవనాల్లో ఓ వైపు కొవిడ్‌ సెంటర్‌, మరో వైపు సాధారణ వైద్య సేవలు అందించేలా పనులు ప్రారంభించారు. 50 పడకల కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో ఐదారు రోజుల్లో ఈ సెంటర్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement