కదులుతున్న గట్టు

ABN , First Publish Date - 2021-05-09T03:52:15+05:30 IST

మట్టి నమూనాల సేకరణతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి.

కదులుతున్న గట్టు
గజ్జలమ్మ గుట్ట ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరిస్తున్న ఇరిగేషన్‌ శాఖ

ప్రారంభమైన ఎత్తిపోతల పథకం పనులు

గజ్జలమ్మ గుట్టపై 3 టీఎంసీలతో రిజర్వాయర్‌ 

మట్టి నమూనాల సేకరణతో తొలి అడుగులు

రూ.650 కోట్లకు గాను రూ.192 కోట్ల మంజూరు


మట్టి నమూనాల సేకరణతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి. గట్టు మండలం గజ్జలమ్మ గుట్టుపై మూడు టీఎంసీల 

రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రతిపాదనలతో ఆలస్యమైన ఈ పథకం ఎట్టకేలకు ప్రారంభం కావడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.        

 - గద్వాల

2005లో ప్రారంభమైన జలయజ్ఞంలో గట్టు ఎత్తిపోతల పథకం పురుడు పోసుకుంది. 15 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోలేదు. 2018లో 0.71 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టి, 28 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ రూ.552 కోట్లు మంజూరు ఇచ్చారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 8న పథకం శంకుస్థాపనకు వచ్చినప్పుడు రిజర్వాయర్‌ చిన్నగా ఉందని, స్థాయి పెంచాలని సీఎం చెప్పడంతో గట్టు మండలం పెంచికలపేట వద్ద 4 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.1,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 


15 టీఎంసీలకు పెంచాలన్న ఎమ్మెల్యేలు

ఇదే సమయంలో నాలుగు టీఎంసీలకు బదులు 15 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే బాగుంటుందని అదే సంవత్సరంలో సీఎంతో జరిగిన సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం సూచించారు. ఈ క్రమంలో గట్టు రిజర్వాయర్‌ను గజ్జలమ్మ గుట్టకు తీసుకెళ్లారు. అక్కడ 15 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడానికి రూ.2,200 నుంచి రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి మోక్షం వస్తుందని భావిస్తున్న తరుణంలో రిటైర్డ్‌ ఇంజనీర్ల ఫోరం కొత్త ప్రతిపాదనలతో ఆ ప్రతిపాదనలకు బ్రేకులు పడ్డాయి.


20 టీఎంసీల ప్రతిపాదనలు 

15 టీఎంసీల ప్రతిపాదనపై ఆలోచనలు జరుగుతుండగా జూరాల ప్రాజెక్టు వెనుకభాగం ధరూర్‌ మండలం నాగర్‌దొడ్డి వద్ద 20 టీఎంసీలతో రూ.6,600 కోట్లు వెచ్చించి రిజర్వాయర్‌ నిర్మించాలని రిటైర్డ్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ ప్రతిపాదనలు రూపొంచింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కృష్ణాబోర్డు నుంచి అనుమతులు తీసుకోవడం తప్పని సరికావడంతో ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టింది. తాజాగా నెట్టెంపాడులో భాగంగా ఉన్న పాత గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు చేపట్టారు.


పాత పద్ధతిలోనే నిర్మాణం

20 టీఎంసీల రిజర్వాయర్‌కు మోక్షం లభించకపోడంతో గట్టు మండలం గజ్జలమ్మ గుట్టపైనే రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీల రిజర్వాయర్‌కు పెంచారు. ఈ మండలం సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. సమాంతరమైన భూమి ఎక్కడా లేదు. ఎత్తు వంపులుగా ఉన్న ఈ భూములకు రిడ్జ్‌ కెనాల్‌ పద్ధతిలో నీరందించనున్నారు. మొత్తం 33 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. పథకం నిర్మాణానికి రూ.650 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, నెట్టెంపాడు కింద రూ.192 కోట్ల నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పంపులు, పైపులను దుమ్ముగూడెం నుంచి తేనున్నారు. గజ్జలమ్మ గుట్టపై మట్టి నమూనాలను సేకరించారు.


సంతోషంగా ఉంది

గట్టు ఎత్తిపోతల పథకానికి తొలి అడుగులు పడ్డాయి. మట్టి నమూనాలు సేకరించారు. అ నంతరం టెండర్లు నిర్వహించే అవకాశం ఉంది. చాలా కా లంగా ఈ పఽథకానికి నిధుల లేమి ఉండేది. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వచ్చాక సీఎం కేసీఆర్‌ ఈ పథకానికి శంకుస్థాపన చేశా రు. ఆ తర్వాత వివిధ ప్రతిపాదనలతో కాలయాపన జరిగింది. చివరకు పాత గట్టు పథకాన్నే నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. బడ్జెట్‌లో పఽథకానికి నిధులను కేటాయించింది. ఈ పథకం గట్టు ప్రజలను కష్టాల నుంచి దూరం చేస్తుందని భావిస్తున్నా. గట్టుకు మోక్షం రావడం సంతోషంగా ఉంది.

- బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గద్వాల

Updated Date - 2021-05-09T03:52:15+05:30 IST