ఏజెన్సీలో ఉద్యమం

ABN , First Publish Date - 2022-08-13T05:49:11+05:30 IST

బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా మేము సైతం అంటూ ఉద్యమించారు కొర్రివానివలస గిరిజనులు. తమ ధైర్య సాహసాలతో బ్రిటీష్‌ సైన్యానికి వణుకుపుట్టించారు.

ఏజెన్సీలో ఉద్యమం
నీలయ్యమ్మ చెరువు పితూరీ జరిగిన ప్రాంతం

గెరిల్లా తరహాలో పోరు

తిరగబడిన గిరిపుత్రులు

  బ్రిటీష్‌ సేనల కాల్పులు 

పలువురు గిరిజన యోధులు వీరమణం 

గుర్తింపునకు నోచని నీలాయమ్మ చెరువు పితూరి

సాలూరు రూరల్‌, ఆగస్టు 12: బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా మేము సైతం అంటూ ఉద్యమించారు కొర్రివానివలస గిరిజనులు. తమ ధైర్య సాహసాలతో బ్రిటీష్‌ సైన్యానికి వణుకుపుట్టించారు.  పన్ను వేధింపులకు వ్యతిరేకంగా  1899-1900 సంవత్సరాల్లో  సాలూరు ఏజెన్సీలో ప్రస్తుత పాచిపెంట మండలం కొర్రివానివలస గిరిజనులు (ప్రస్తుతం ఆ గ్రామం లేదు) జరిపిన మన్యం తిరుగుబాటు చెప్పుకోదగ్గది. గెరిల్లా తరహాలో పోరు జరిపి పలుమార్లు గిరిపుత్రులు పైచేయి సాధించారు. ఈ తిరుగుబాటును నీలయ్యమ్మ చెరువు పితూరీగా స్థానికులు అభివర్ణిస్తుంటారు. కరువు కాటకాలోచ్చినా పన్ను వసూలే లక్ష్యంగా బ్రిటీష్‌ వారి పెత్తందారులు వ్యవహరించడంతో గిరిజనులు ఈ ఉద్యమానికి నాంది పలికారు. కొర్రవానివలసకు చెందిన మల్లన్నదొర, గంటన్నదొరలు  ఓ దండును తయారు చేసి నీలయ్యమ్మ చెరువును అనుకోని ఉన్న దొంతికొండపై నుంచి బ్రిటీష్‌ సేనలపై విల్లంబులతో దాడులు జరిపేవారు. ఈ పోరాట యోధులు కొందరు ప్రస్తుత పారమ్మకొండపై ఉన్న పాండవుల గుహ వద్ద రహస్యంగా ఉండేవారని పెద్దలు చెబుతున్నారు.  ఇదిలా ఉండగా గిరిజన దండు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం వేగులను ఏర్పాటు చేసుకుంది. కాగా వారి ప్రలోభానికి లోనైన ద్రోహులు నీలయ్యమ్మ చెరువు వద్ద జరుగుతున్న గిరిజనయోధుల సమావేశ వివరాలను ఉప్పందించారు. దీంతో అప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అదనపు బ్రిటీష్‌ సేనలు అకస్మికంగా సమావేశంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అధికసంఖ్యలో గిరిజనులు మరణించినట్టు భోగట్టా. మల్లన్నదొర, గంటన్నదొర తదితరులను బ్రిటీష్‌ సేనలు బంధించి జైల్లో పెట్టారు. స్వాతంత్య్రయోధులు జైల్లో మరణించినట్టు సమాచారం. నీలయ్యమ్మ పితూరీ విషయమై పార్వతీపురం ఎంపీగా ఉన్నప్పుడు శత్రుచర్ల విజయరామరాజు పలుమార్లు ప్రస్తావించారు. ఈ ఉద్యమ ప్రస్తావన మద్రాస్‌ ప్రెసిడెన్సీ గెజిట్‌లో ఉన్నట్టు సమాచారం. దీనిపై పరిశోధన చేసి మన్యంలో ఉద్యమవీరులకు గుర్తింపు దక్కేలా ప్రస్తుత ప్రజాప్రతినిధులు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 



Updated Date - 2022-08-13T05:49:11+05:30 IST