బీమా సాయం కోసం వెళ్తూ..

ABN , First Publish Date - 2021-06-25T05:20:58+05:30 IST

భర్త మృతిచెందడం తో... వచ్చిన బీమా డబ్బులను తీసుకునేందుకు ఒడిశా బ్యాంకుకు వెళుతున్న తల్లీకొడుకులు ప్రమాదంలో అసువులు బాశారు. కంచిలి మండలం జాడుపూడి కాలనీ వద్ద గురువారం సంభవించిన రోడ్డుప్రమాదంలో విజయనగరం జిల్లాకేంద్రానికి చెందిన తల్లీకొడుకులు మృతిచెందారు.

బీమా సాయం కోసం వెళ్తూ..
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో లక్ష్మీ, జగన్‌ల మృతదేహాలు

- రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి

- కంచిలి మండలం జాడుపూడి సమీపంలో ఘటన

- మృతులు విజయనగరం పట్టణ వాసులు

కంచిలి, జూన్‌ 24: భర్త మృతిచెందడం తో... వచ్చిన బీమా డబ్బులను తీసుకునేందుకు ఒడిశా బ్యాంకుకు వెళుతున్న తల్లీకొడుకులు ప్రమాదంలో అసువులు బాశారు. కంచిలి మండలం జాడుపూడి కాలనీ వద్ద గురువారం సంభవించిన రోడ్డుప్రమాదంలో విజయనగరం జిల్లాకేంద్రానికి చెందిన తల్లీకొడుకులు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణం కాళీఘాట్‌ కాలనీకి చెందిన పెంటకోట లక్ష్మి(45), తన కుమారుడు జగన్‌(19), మేనల్లుడు కేశవతో కలసి కారులో గురువారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు బయలుదేరారు. వీరి వెంట డ్రైవర్‌ బొత్స అశోక్‌ కూడా ఉన్నాడు. లక్ష్మి భర్త శ్రీనివాసరావు మూడేళ్ల కిందట జంషెడ్‌పూర్‌లో సంభవించిన ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఆయనకు సం బంధించిన బీమా డబ్బులు భువనేశ్వర్‌ బ్యాంకు అకౌంట్‌లో జమయ్యాయి. వాటిని తీసుకు నేందుకు వీరు కారులో ప్రయాణమయ్యారు. ముందు భాగంలో డ్రైవర్‌ అశోక్‌తో పాటు కేశవ ఉండగా, వెనుక సీటులో లక్ష్మి, జగన్‌ కూర్చున్నా రు. వీరి కారు కంచిలి మండలంలోని జాడుపూడి కాలనీ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును ఢీకొంది. కారు తునాతునకలైంది. ప్రమాదంలో నలుగురూ గాయపడ్డా రు. క్షతగాత్రులందరినీ తొలుత సోంపేట, ఇచ్చాపురం ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న లక్ష్మి, జగన్‌లను బరంపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికి త్స పొందుతూ ఇద్దరూ కన్నుమూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కంచిలి ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉండగా, పెంటకోట లక్ష్మీకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త శ్రీనివాసరావు మూడేళ్ల కిందట మరణించగా లక్ష్మీయే పిల్లలందరినీ చూస్తోంది. కుమారుడు జగన్‌ ఇంటర్‌ చదువుతుండగా, పెద్ద కుమార్తె ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటోంది. చిన్న కుమార్తె చార్టెడ్‌ అకౌంటెన్సీకి ప్రిపేర్‌ అవుతోంది. తల్లి, సోదరుడు చనిపోవడంతో తమకు దిక్కెవరని వారు బోరున విలపిస్తున్నారు. 

Updated Date - 2021-06-25T05:20:58+05:30 IST