అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులలో భారత్ స్థానమెంతంటే?

ABN , First Publish Date - 2021-01-13T01:30:54+05:30 IST

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశం ఏది? ఈ ప్రశ్నకు జవాబు తర్వాత తెలుసుకుందాం కానీ

అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టులలో భారత్ స్థానమెంతంటే?

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశం ఏది? ఈ ప్రశ్నకు జవాబు తర్వాత తెలుసుకుందాం కానీ, భారతదేశ పాస్‌పోర్ట్ మాత్రం ఈ జాబితాలో 85వ స్థానంలో నిలించింది. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 పేర్కొంది. తాజాగా ఇది విడుదల చేసిన జాబితాలో ఇండియన్ పాస్‌పోర్టు 85వ స్థానంలో నిలిచింది. గతేడాది 84వ స్థానంలో నిలిచిన మన పాస్‌పోర్ట్ ఈసారి ఒకస్థానం కిందికి దిగజారింది. అంటే, దీనర్థం ముందస్తు వీసా లేకుండా ఇండియన్ పాస్‌పోర్టుతో 58 దేశాల్లో పర్యటించవచ్చు. ఈ విషయంలో తజికిస్థాన్‌తో కలిసి భారత్ ఈ స్థానాన్ని పంచుకుంది. 


ఇక, పైన అడిగిన ప్రశ్నకు సమాధానం.. జపాన్. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశం జపాన్. ఈ విషయంలో జపాన్ మరోమారు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ దేశ పాస్‌పోర్టుతో ముందస్తు వీసా లేకుండా ఏకంగా 191 దేశాల్లో తిరిగి రావొచ్చు. జపాన్ అగ్రస్థానంలో కొనసాగడం ఇది వరుసగా మూడోసారి. ఈ జాబితాలో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టు కలిగినవారు 190 దేశాలకు ముందస్తు వీసా లేకుండానే వెళ్లిరావొచ్చు. ఆ తర్వాతి స్థానంలోనూ ఆసియా దేశమే ఉంది. యూరోపియన్ కంట్రీ జర్మనీతో కలిసి దక్షిణ కొరియా ఈ స్థానంలో నిలిచింది. ఈ రెండు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 189 దేశాల్లో పర్యటించవచ్చు. 


జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీలు టాప్-3లో నిలవగా, ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్ (188) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాయి. బ్రిటన్, అమెరికా పాస్‌పోర్టులు ఏడో స్థానంతో టాప్-10లో చోటు సంపాదించుకున్నాయి. గతేడాది ఇవి రెండు 8 స్థానంలో ఉండగా, ఈసారి ఒక స్థానం ఎగబాకాయి. ఇక, గతేడాదిలానే ఈసారి కూడా ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్టుకు అట్టడుగు స్థానమే లభించింది. పాకిస్థాన్ పాస్‌పోర్టు కిందినుంచి నాలుగో స్థానంలో నిలిచింది. 


టాప్-10లో నిలిచినవి ఇవే: 1. జపాన్ (191); 2. సింగపూర్ (190); 3. జర్మనీ, దక్షిణ కొరియా (189); 4. ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్ (188); 5. ఆస్ట్రియా, డెన్మార్క్ (187); 6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (186); 7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ (185); 8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (184);  9. కెనడా (183), 10. హంగరీ (182). 


ఈ జాబితాలో ఉన్న దేశాల పాస్‌పోర్టులు కలిగినవారు ముందస్తు వీసా లేకుండానే ఆయా దేశాల్లో పర్యటనకు వెళ్లొచ్చు. అంటే దానర్థం పూర్తిగా వీసా అక్కర్లేదని కాదు. అక్కడికి వెళ్లాక వీసా పొందొచ్చు. 

Updated Date - 2021-01-13T01:30:54+05:30 IST