ఇక్కడ కిలో టీ పొడి ఏకంగా రూ.75 వేలు.. ఎక్కడో కాదు భారత్‌లోనే..!

ABN , First Publish Date - 2021-06-21T22:39:54+05:30 IST

చాయ్.. అలసిపోయిన శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

ఇక్కడ కిలో టీ పొడి ఏకంగా రూ.75 వేలు.. ఎక్కడో కాదు భారత్‌లోనే..!

చాయ్.. అలసిపోయిన శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఒక కప్పు టీ తాగితే చాలు.. అలసట తొలగిపోయి శరీరం ఉత్తేజితమవుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలోనే టీ ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ చాయ్ దాసులే. 


అందరూ తాగేది టీనే అయినా.. దాని తయారీలో ఉపయోగించే పదార్థాల వల్ల రుచి మారిపోతుంటుంది. టీ పొడి లభించే ప్రాంతాలు, దాని సేకరణ, సాగు, శుద్ధి విధాన పద్ధతుల వల్ల ధరలలో కూడా మార్పులు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ కప్పు టీ ఖరీదు రెండు రూపాయల నుంచి లక్షల వరకు ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సాగు అయిన తేయాకు భారీ ధర పలుకుతుంది. అలాంటి ప్రాంతాలు మన దేశంలో కూడా ఉన్నాయి.


మనోహరి గోల్డ్ టీ


ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీలలో ఒకదానిని తాగాలనుకుంటే మీరు అసోం వెళ్లాల్సిందే. అసోంలోని డిబ్రూఘర్ జిల్లాలో ఈ తేయాకు సాగు అవుతుంది. ఔషధ గుణాలు హెచ్చు స్థాయిలో ఉన్న ఈ తేయాకును సూర్యోదయానికి పూర్వమే సేకరిస్తారు. అందువల్ల దీని సువాసన చెక్కుచెదరదు. ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా పూర్తిగా చేతితోనే దీనిని శుద్ధి చేస్తారు. 2018లో ఈ టీ పౌడర్ కిలో రూ.39,001 ఉండేది. 2020లో కిలో రూ.75 వేలకు చేరుకుంది.


 సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీ


డార్జిలింగ్‌లో లభించే ఈ టీ పౌడర్ ప్రతి సంవత్సరం పరిమిత పరిమాణంలో మాత్రమే తయారవుతుంది. పులియబెట్టిన పద్ధతిలో ఈ టీ పౌడర్‌ను తయారు చేస్తారు. ఈ టీ వెండి రంగులో ఉండి ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది. ఈ తేయాకును పౌర్ణమి రోజు మాత్రమే సేకరిస్తారు. ఈ టీ పౌడర్ కిలో ధర రూ.30 వేల వరకు ఉంటుంది. అది కూడా పరిమిత పరిమాణంలో మాత్రమే లభిస్తుంది. 


డా-హాంగ్ పావో టీ


చైనీస్ మూలాలకు చెందిన డా హాంగ్ పావో టీ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని వుయ్ పర్వతాలలో దొరుకుతుంది. మింగ్ రాజవంశానికి చెందిన చక్రవర్తి తల్లి డా హాంగ్ పావోకు ఈ ఆకుల ద్వారానే జబ్బు నయమైందని అంటారు. 600 మీటర్ల ఎత్తులో శుభ్రమైన పర్వత గాలి, ప్రత్యేక వాతావరణం ఈ టీకి ప్రత్యేకతనిస్తుంది. వసంతకాలంలో మాత్రమే ఇది పండుతుంది. దీని వెల చాలా ఎక్కువ. ఒక గ్రాము టీ పౌడర్ ధరే సుమారు రూ.30,000 వరకు ఉంటుంది.


పాండా డంగ్ టీ


అంటే పాండాల విసర్జనతో తయారుచేసే టీ అన్నమాట. ఔను మీరు చదివింది నిజమే.. పాండాల పేడతోనే ఈ టీని తయారు చేస్తారు. పాండాలు వెదురు మొక్కలను తింటాయి. ఈ నేపథ్యంలో వాటి విసర్జితాలలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అప్పటి నుంచి పాండాల విసర్జనతో టీ పౌడర్‌ను తయారు చేస్తున్నారు. ఈ పాండా డంగ్ టీ ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన టీలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ టీ పౌడర్ 50 గ్రాముల ధర రూ. 2.5 లక్షలు. 


యెల్లో గోల్డ్ బడ్స్


ప్రపంచంలోనే అరుదైన టీలలో ఒకటైన ఈ యెల్లో గోల్డ్ టీ సింగపూర్‌లో దొరుకుంది. ఈ టీ ఆకులను సంవత్సరంలో ఒకసారి మాత్రమే కత్తిరించి టీ పొడిగా మారుస్తారు. పసుపు రంగంలో బంగార పూతపూసినట్టు ఉండే ఈ టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ టీ పౌడర్ కిలో ధర సుమారు రూ. 7.7 లక్షలు. 

Updated Date - 2021-06-21T22:39:54+05:30 IST