దోమలతో పరేషాన్‌...

ABN , First Publish Date - 2020-11-26T05:20:16+05:30 IST

దోమలతో పరేషాన్‌...

దోమలతో పరేషాన్‌...
మాచన్‌పల్లి గ్రామంలో మురుగు కాలువ

  • గ్రామాల్లో ఎక్కడికక్కడ పారిశుధ్య లోపం
  • ఓపెన్‌ డ్రెయిన్లతో విజృంభిస్తున్న దోమలు
  • నెలకోసారైనా జాడలేని ఫాగింగ్‌
  • అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

షాబాద్‌: షాబాద్‌ మండలం పరిధిలోని మాచన్‌పల్లి గ్రామంలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు తమకేమీ పటనట్లు వ్య వహరిస్తుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎక్కడికక్కడ పారిశుధ్యం లోపించింది. ఓపెన్‌ డ్రెయిన్లతో ఈగలు, దోమలు ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాటు ప్రతి నెలలో రెండు, మూడు సార్లు ఫాంగింగ్‌ చేస్తే ఎంతో కొంత దోమలను నివారించే ఆస్కారం ఉంటుంది. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు. అధికారులు సంవత్సరంలో కనీసం రెండు, మూడు సార్లు కూడా ఫాగింగ్‌ చేయించడం లేదు. దీంతో రోజురోజుకూ దోమల బెడద ఎక్కువవుతోంది. బయటకు వస్తే దోమలతో తట్టుకోలేకపోతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా వైరస్‌ ఆపై దోమల వల్ల గున్యా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు సోకుతాయని భయపడుతున్నారు. ఓపెన్‌ డ్రెయిన్లు, మురుగు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో  దోమల ఎక్కువ వృద్ధి చెందుతున్నాయి. మాచన్‌పల్లి గ్రామంలోకి వెళ్తుంటే పెద్ద ఓపెన్‌ మురుగు కాల్వ ఉంది. అది దోమలకు స్థావరంగా మారింది. ఇప్పటికై గ్రామంలో అధికారులు ఫాంగింగ్‌ నిర్వహించి దోమలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేక ఇబ్బందులు

సాయంత్రం అయ్యిందంటే చాలు మా గ్రామంలో దోమలతో వేగలేకపోతున్నాం. చిన్నపిల్లలు అయితే మరీ ఇబ్బందులు పడుతున్నారు. దోమలు కుట్టి అనారోగ్యం పాలవుతున్నాం. గ్రామంలో అండర్‌ డ్రైనేజ్‌ ఏర్పాటు చేయాలి. వారానికోసారి ఫాగింగ్‌ నిర్వహించాలి.

- కె.మహేందర్‌, వార్డు సభ్యుడు, మాచన్‌పల్లి


దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తాం

గ్రామంలో దోమలను చంపేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. మురుగు కాల్వల వద్ద బ్లీచింగ్‌ చల్లిస్తున్నాం. ఇకపై గ్రామంలో ఎప్పటికప్పుడు ఫాగింగ్‌ నిర్వహించి దోమల బెడద లేకుండా చర్యలు తీసుకుంటాం.

- మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, మాచన్‌పల్లి

Updated Date - 2020-11-26T05:20:16+05:30 IST