శ్రీలంకలో 600 మందికిపైగా నిరసనకారుల అరెస్టు

ABN , First Publish Date - 2022-04-04T09:10:20+05:30 IST

శ్రీలంకలో వందల సంఖ్యలో నిరసనకారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి నిరసనలు తెలపడానికి ప్రయత్నించారంటూ 644 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీలంకలో 600 మందికిపైగా నిరసనకారుల అరెస్టు

కర్ఫ్యూ ఆంక్షలున్నా ర్యాలీ చేపట్టిన ప్రతిపక్షాలు

కొలంబో/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: శ్రీలంకలో వందల సంఖ్యలో నిరసనకారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి నిరసనలు తెలపడానికి ప్రయత్నించారంటూ 644 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అరెస్టులు కొనసాగాయి. విద్యుత్‌ కోతలపై నిరసన తెలియజేయడానికి అధ్యక్షుడు రాజపక్స ఇంటి బయట ఉన్న కరెంటు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి... ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించాడు.

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం కొలంబోలో నిరసనలు చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అయితే ప్రతిపక్షాల నిరసనలను ఆపడం లక్ష్యంగా శ్రీలంక ప్రభుత్వం 36 గంటలపాటు కర్ఫ్యూ విధించింది.

కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ర్యాలీ చేపట్టాయి. వందల సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస ఇంటి దగ్గర పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రికత్త చోటుచేసుకోవడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించారు. కాగా... శ్రీలంకలో తాజా పరిస్థితులపై మాజీ క్రికెటర్‌ మహేల జయవర్థనే స్పందించారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న వ్యక్తులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, దీన్ని పునరుద్ధరించాలంటే కొత్త టీమ్‌ అవసరమని జయవర్థనే అన్నారు. కాగా... సోషల్‌ మీడియాపై విధించిన నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఎత్తేసింది.

శనివారం అరెస్టు చేసిన ఓ సోషల్‌ మీడియా కార్యకర్తను కూడా విడుదల చేశారు. మరోవైపు... కొలంబోకు విమానాల రాకపోకలను తగ్గించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై నుంచి కొలంబోకు వారంలో 16 సర్వీసులు తిరుగుతున్నాయి. డిమాండ్‌ లేనందున ఏప్రిల్‌ 9 నుంచి వారానికి 13 సర్వీసులను మాత్రమే తిప్పనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.

Updated Date - 2022-04-04T09:10:20+05:30 IST