సైన్యం బలోపేతం!

ABN , First Publish Date - 2020-07-03T07:09:56+05:30 IST

చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భారత్‌ సాయుధ సంపత్తిని మరింత బలపరుచుకుంటోంది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధా ల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం పచ్చజెండా ఊపింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన కొనుగోళ్లు

సైన్యం బలోపేతం!

  • రూ.38,900 కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం
  • అందులో ఎక్కువ కాంట్రాక్టులు స్వదేశీ సంస్థలకే
  • లద్దాఖ్‌ సరిహద్దులకు ప్రత్యేక బలగాల తరలింపు
  • మేము అదనపు బలగాల్ని పంపలేదు: పాక్
  • పూంఛ్‌లో పాక్‌ కాల్పులు
  • దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక కసరత్తులు
  • స్వదేశీ సాంకేతికతకు పెద్దపీట


న్యూఢిల్లీ, జూలై 2: చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భారత్‌ సాయుధ సంపత్తిని మరింత బలపరుచుకుంటోంది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధవిమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధా ల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం పచ్చజెండా ఊపింది. వీటిలో రూ.31,130 కోట్ల విలువైన కొనుగోళ్లు భారత పరిశ్రమలకే కేటాయించడం గమనార్హం. స్వదేశీ సాంకేతికతతో రూపకల్పనకు రక్షణశాఖ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి 21 మిగ్‌-29 యుద్ధవిమానాలు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) నుంచి 12 సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న 59 మిగ్‌-29 విమానాల్ని ఆధునికీకరించేందుకు ప్రత్యేక ప్రతిపాదనను ఆమోదించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. 1000 కిలోమీటర్ల పరిధి కలిగిన దీర్ఘశ్రేణి ఉపరితల దాడి క్షిపణులు, ‘అస్త్ర’ క్షిపణుల్ని నావికాదళం, వాయుసేన కోసం రక్షణ శాఖ సమీకరిస్తోంది. ఇక.. సరిహద్దు పరిస్థితుల్లో ఏ మార్పూ రాకపోవడంతో.. ప్రత్యేక బలగాలను భారత్‌ లద్దాఖ్‌ సరిహద్దులకు తరలించింది.


చైనా రెచ్చగొడితే ఏం చేయాలనేదానిపై సైనికులందరికీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. వ్యూహాత్మకంగా కీలకమైన శ్రీనగర్‌-కార్గిల్‌-లెహ్‌ రహదారిలో ఉన్న జోజిలా సొరంగం పనుల్ని త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తెలిపారు. భారీ మంచు కారణంగా కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాల మధ్య శీతాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయని.. జోజిలా పూర్తయితే ఏడాదంతా ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక.. చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్‌ విధించిన నిషేధాన్ని శివసేన డిజిటల్‌ దాడిగా అభివర్ణించింది. ఇది అభినందించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ.. 20మంది సైనికులు అమరులైన తర్వాత గానీ సర్కారుకు చైనా యాప్‌లు ప్రమాదకరమని తెలియలేదా అంటూ ప్రశ్నించింది. ఇక.. భారతీయులకు చెం దిన సంస్థలను మాత్రమే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలుగా(ఎంఎ్‌సఎంఈ) పరిగణించాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) అనుబంధ సంస్థ లఘు ఉద్యోగ్‌ భారతి(ఎల్‌యూబీ) డిమాండ్‌ చేసింది.


కాగా.. మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా సరిహద్దులకు తాము అదనపు సైన్యాన్ని పంపలేదని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. స్కర్దులోని వైమానిక స్థావరంలో చైనా విమానాల్ని మోహరించిందన్న విషయం కూడా అవాస్తవమేనని పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ సైనిక కసరత్తు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో పాక్‌ కాల్పులకు తెగబడింది. కిర్ని, షాపూర్‌ సెక్టార్లలో పాక్‌ సైనికులు కాల్పులు జరుపుతున్నారని, భారత్‌ సైతం దీటుగా స్పందిస్తోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత వార్తాపత్రికలు, వెబ్‌సైట్లను చైనాలో నిషేధించడం పట్ల భారత వార్తాపత్రికల సొసైటీ(ఐఎన్‌ఎ్‌స) మండిపడింది. భారత్‌లోనూ చైనా మీడియాను పూర్తిగా నిషేధించాలని కోరింది. 


పారామిలిటరీ చీఫ్‌గా ట్రాన్స్‌జెండర్‌?

ట్రాన్స్‌జెండర్లకు కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేసే అవకాశం లభించనుందా? అవునంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. కేంద్ర పారామిలిటరీ బలగాలకు(సీఏపీఎఫ్‌) నాయకుల ఎంపికకై నిర్వహించే యూపీఎ్‌ససీ పరీక్షలో ఇకపై ట్రాన్స్‌జెండర్లను కూడా అనుమతించాలన్న ఆలోచనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు వారికి అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాల్ని కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. 


యాప్‌ల నిషేధం వివక్షే : చైనా 

తమ దేశానికి చెందిన 59యాప్‌లను భారత్‌ నిషేధించడం వివక్షతో కూడిన చర్య అంటూ చైనా ఆరోపించింది. చైనా ఎప్పుడూ భారత్‌ ఉత్పత్తులపై చర్యలు తీసుకోలేదని, తమ యాప్‌లపై భారత్‌ విధించిన నిషేధం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించడమేనని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్‌ ఈ మేరకు ఆరోపించారు.


భారత్‌లో పలుచోట్ల నిలిచిన ఉత్పత్తి 

చైనా దిగుమతులపై భారత్‌ కఠినంగా వ్యవహరిస్తుండటంతో, దేశంలో పలు ఉత్పత్తి సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తయారుచేసే ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. తమిళనాడులోని శ్రీపెరంబుదూరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటిల్లో ఉన్న ఫాక్స్‌కాన్‌ సంస్థ, చైనా నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని, యాపిల్‌, షామీ ఫోన్లను సమీకరించి(అసెంబ్లింగ్‌) విక్రయిస్తుంటుంది. భారత పోర్టుల్లో చైనా దిగుమతుల్ని కస్టమ్స్‌ అధికారులు నిలిపేయడంతో.. ఇలాంటి పలు అసెంబ్లింగ్‌ సంస్థల్లో తయారీ నిలిచిపోయింది. 

Updated Date - 2020-07-03T07:09:56+05:30 IST