మరింత ‘ఆసరా’

ABN , First Publish Date - 2022-08-08T06:24:49+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో యాబై ఏడేళ్లు నిండిన వారందరికి ఆసరా పింఛన్లు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మరింత ‘ఆసరా’

 -  వయోపరిమితి తగ్గింపుతో మరో 40,580 మందికి పింఛన్లు

-   ముఖ్యమంత్రి నిర్ణయంతో సర్వత్రా హర్షం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో యాబై ఏడేళ్లు నిండిన వారందరికి ఆసరా పింఛన్లు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. డయాలసిస్‌ పేషెంట్లందరికి ఇప్పుడు అందిస్తున్న ఉచిత డయాలసిస్‌, బస్‌పాస్‌కు తోడుగా నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్‌ ఇస్తామని కూడా తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. రెండేళ్లుగా పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న 57 ఏళ్లు నిండిన వారంతా ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో 40,580 మందికి ఆసరా పింఛన్లు, సుమారు వెయ్యి మందికి డయాలసిస్‌ ఆసరా పింఛన్లు అందనున్నాయి. వీరందరికి నెలకు 2,016 రూపాయల చొప్పున పింఛన్‌ అందించడానికి ప్రభుత్వం నెలకు సుమారు 8.5 కోట్ల రూపాయలు వెచ్చించనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 65 ఏళ్లు పైబడిన వారికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. 

- రెండేళ్లుగా ఎదురుచూపులు

రెండేళ్ల క్రితం బడ్జెట్‌ సమావేశంలో ఆసరా పింఛన్ల వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నామని, 57 ఏళ్లు నిండిన వారంతా ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హులవుతారని ప్రకటించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వయసు గ్రూపులోకి వచ్చిన వారంతా దరఖాస్తులు చేసుకొని పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అదిగో పింఛన్‌, ఇదిగో పింఛన్‌, ఈ నెల నుంచి అమలు చేస్తున్నారు.. అంటూ వివిధ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఉపన్యాసాల్లో ప్రకటించడమే తప్ప అవి మంజూరు మాత్రం కాలేదు. వీరికి తోడు 65 ఏళ్లు దాటిన 13,139 మంది వయో వృద్ధులు కూడా తమకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో వయస్సు కుదింపు విషయం ప్రకటించడంతో జిల్లాలో 57 నుంచి 65 ఏళ్ల వయస్సు గ్రూపులో ఉన్న 27,441 మంది పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త పింఛన్లు గాని, వయస్సు తగ్గించి ఇచ్చే పింఛన్ల విషయంలో ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు ఏమి రాకపోవడంతో వాటి కోసం దరఖాస్తు చేసుకున్న 40,580 పింఛన్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలో 1,14,160 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. టీఆర్‌ఎస్‌ 2014లో అధికారం చేపట్టిన తర్వాత వృద్ధులు, వితంతువులు, చేనేత, బీడీ, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల చొప్పున, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పింఛన్లు పెంచి అమలు చేసింది. 2018లో మళ్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆసరా పింఛన్లను 2,106, దివ్యాంగుల పింఛన్లను 3,016 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మేరకు పెంచి పింఛన్లను అమలు చేస్తున్నది. జిల్లాలో 39,505 మందికి వృద్ధాప్య పింఛన్‌, 34,132 మందికి వితంతు, 9,336 మందికి బీడీ కార్మిక, 3,625మందికి గీత కార్మిక, 2,707 మందికి చేనేత కార్మిక పింఛన్లు అందజేస్తున్నది. 3,294 మంది ఒంటరి మహిళలకు 20,836 మంది దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ప్రస్తుతం 57 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో కొత్తగా 40,580 మందికి పింఛన్‌ యోగం పట్టనున్నది. దీంతో జిల్లాలో పింఛన్‌ పొందనున్నవారి సంఖ్య 1,54,740కి చేరుకోనున్నది. 

- డయాలసిస్‌ రోగులకు చేయూత

 జిల్లా ఆసుపత్రితోపాటు మరో ఐదు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద 550 డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న సుమారు మరో 500 మందికి కూడా ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 2016 రూపాయల పింఛన్‌ నెల నెల లభించనున్నది. డయాలసిస్‌ రోగులకు ఉచిత డయాలసిస్‌తోపాటు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం బస్‌ సౌకర్యం కల్పిస్తున్నది. ప్రస్తుతం 2016 రూపాయల పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ డబ్బు తమ మందుల ఖర్చుకు వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లవుతుందని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-08-08T06:24:49+05:30 IST