చైనాతో భారత్‌కు మరిన్ని సవాళ్లు!

ABN , First Publish Date - 2022-02-13T07:23:54+05:30 IST

చైనాతో భారత్‌ మరిన్ని భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని

చైనాతో భారత్‌కు మరిన్ని సవాళ్లు!

  • అమెరికా వ్యూహాత్మక నివేదిక వెల్లడి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: చైనాతో భారత్‌ మరిన్ని భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా తాజాగా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ విషయంలో చైనా ప్రవర్తన భారత్‌కు సవాలుగా మారనుందని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో సుస్థిరత కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలు నిర్మించడంలో భాగంగా భారత్‌లో కలిసి పని చేస్తామని ప్రకటించింది. అమెరికా శ్వేతసౌధం శనివారం ఇండో పసిఫిక్‌ వ్యూహాత్మక నివేదికను వెలువరించింది.


ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం, ఈ ప్రాంతాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయంగా నాయకత్వం వహించే విధంగా భారత్‌ ఎదుగుదలకు సహకరించడం అమెరికా వ్యూహంలో భాగాలుగా నివేదికలో పేర్కొంది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌ స్పేస్‌ రంగాల్లో భారత్‌తో పరస్పరం సహకరించుకుంటామని, ఆర్థికపరంగా, సాంకేతికంగా సహకారాన్ని మరింత పదిలం చేసుకుంటామని తెలిపింది. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్రంలో భారత్‌ తనకు భావ సారూప్యత కలిగిన భాగస్వామి అని ఈ సందర్భంగా అమెరికా వ్యాఖ్యానించింది. ఆగ్నేయాసియాతో గట్టి సంబంధాలున్న దేశంగా, క్వాడ్‌ను ముందుకు నడిపించే శక్తిగా భారత్‌ను అభివర్ణించింది.


చైనా వల్లే గల్వాన్‌ ఘర్షణ: జైశంకర్‌ 

సరిహద్దుల్లో గుంపులుగా బలగాలను మోహరించరాదని భారత్‌తో చేసుకున్న లిఖిత పూర్వక ఒప్పందాన్ని చైనా గౌరవించకపోవడం వల్లే 2020లో గల్వాన్‌ లోయలో ఘర్షణ, సంక్షోభ పరిస్థితి తలెత్తిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు.


బుధవారం ఆయన 4 దేశాల క్వాడ్‌ సమావేశంలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైనా పదేపదే విమర్శించినంత మాత్రాన భారత్‌ విశ్వసనీయత ఏమీ దెబ్బతినదన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్‌ పేన్‌ మాట్లాడుతూ, రష్యా, చైనా, ఉత్తర కొరియాల పెత్తందారీ వైఖరి ఈ ప్రాంత భద్రతకు ఏ మాత్రం దోహదపడేది కాదన్నారు. ఇక.. విద్యార్థులు, ఇతర వీసాదారుల కోసం ఆస్ట్రేలియా 21 నుంచి సరిహద్దులు తెరవడంపై జైశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-02-13T07:23:54+05:30 IST