కరోనా భారం

ABN , First Publish Date - 2020-05-31T11:04:11+05:30 IST

మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్‌ 4.0 గడువు ముగియనుండడం, ఇప్పటికే పలు రకాల సడలింపుల కారణంగా జన సంచారం పెరగడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా వైద్యులు

కరోనా భారం

  • ఇకపై నెలవారీ బడ్జెట్‌లో
  • కొంత మొత్తం కేటాయించాల్సిందే...
  • వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు
  • అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు కొనుగోలు తప్పనిసరి
  • ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు
  • పెరగనున్న రవాణా ఖర్చులు
  • భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున
  • ఆటోల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తుండడంతో
  • రెండింతలు ఎక్కువ చార్జీ వసూలు
  • స్కూల్‌ ఆటోలు/బస్సుల చార్జీలు కూడా పెరిగే అవకాశం
  • సాధారణ, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్‌ 4.0 గడువు ముగియనుండడం, ఇప్పటికే పలు రకాల సడలింపుల కారణంగా జన సంచారం పెరగడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం ఇకపై ప్రతిఒక్కరూ తమ బడ్జెట్‌లో కొంత కరోనా నియంత్రణ పరికరాల కొనుగోలుకు కేటాయించాలని సూచిస్తున్నారు. నెలవారీ ఖర్చుల్లో ఇంటి అద్దె, కిరాణా, కరెంట్‌ బిల్లు, పిల్లల చదువులు, మందులు...మాదిరిగానే కరోనా బారినపడకుండా ముందస్తు జాగ్రత్తల కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలని పేర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ ఇది తప్పనిసరి అంటున్నారు.


శానిటైజర్లు, మాస్క్‌లు

ఇప్పటివరకు శానిటైజర్లు, మాస్క్‌లు వినియోగించాల్సిన అవసరం సాధారణ ప్రజలకు రాలేదు. కానీ కరోనా వైరస్‌ రాకతో ప్రతి ఒక్కరి జీవితంలో మాస్క్‌, శానిటైజర్లు తప్పనిసరిగా మారాయి. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ వీటికోసం తప్పనిసరిగా నెలవారీ కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో వుంచుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత, బయటి వ్యక్తులు ఇంటికి వచ్చినా తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంత తక్కువ వాడినా నెలవారీ కనీసం ఒకటి, రెండు లీటర్లు శానిటైజర్‌ అవసరమవుతుంది. 


ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు

ఆన్‌లైన్‌లో పలు సంస్థలు మాస్క్‌లు, శానిటైజర్లను విక్రయిస్తున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీలు మాస్క్‌లు ఐదు, పది, 15 చొప్పున ప్యాక్‌ల రూపంలో విక్రయిస్తున్నాయి. వీటి ధర 150 నుంచి రూ.500 వరకూ ఉంటోంది. బయట దుకాణాల్లోను మాస్క్‌లు విక్రయిస్తున్నారు. వీటితోపాటు సర్జికల్‌, క్లాత్‌ మాస్క్‌లు బయట అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మాస్క్‌ ధర కనీసం రూ.5 నుంచి రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వాషబుల్‌ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా శానిటైజర్‌ బాటిల్స్‌ 50 ఎంఎల్‌, 100 ఎంఎల్‌, అరలీటర్‌, లీటరు చొప్పున విక్రయిస్తున్నారు. ఆయా కంపెనీలను బట్టి 100 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌ రూ.50 నుంచి రూ.70 ధరల్లో లభిస్తున్నాయి. ఓ ప్రముఖ కంపెనీ 100 ఎంఎల్‌ పది శానిటైజర్‌ బాటిళ్లను రూ.500 విక్రయిస్తుండగా, మరికొన్ని కంపెనీలు రూ.250-రూ.300 మధ్య విక్రయిస్తున్నాయి. 


రవాణా ఖర్చులు

కరోనాతో రవాణా బడ్జెట్‌ కూడా భారీగా పెరగనుంది. ఇప్పటివరకు షేర్‌ ఆటోల్లో ప్రయాణించడం వల్ల తక్కువ మొత్తంలోనే ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ఆటోల్లో ఇద్దరు, ముగ్గురికి మించి ప్రయాణించరాదు. ఈ నేపథ్యంలో గతంలో ప్రయాణించిన దూరాలకు డబుల్‌, ట్రిపుల్‌ చార్జీలను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అంటే రెండు, మూడింతలు రవాణా ఖర్చులు పెరగనున్నాయి. గతంలో చార్జీలు కోసం నెలకు వేయి నుంచి రెండు వేలు ఖర్చు అయిన వారికి ఇప్పుడు రూ.మూడు వేల నుంచి నాలుగు వేలు కానుంది. ఇప్పటికే జీతాల కోతతో ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది ఉద్యోగులకు ఇది అదనపు భారం కానుంది. అదేవిధంగా పిల్లలను స్కూల్‌కు తీసుకువెళ్లే బస్సులు, ఆటోల్లో కూడా భౌతిక దూరం పాటించాల్సి వున్నందున చార్జీలు కూడా పెరగనున్నాయి. 


హాస్టల్‌ చార్జీలు

ఇప్పటివరకు ప్రైవేటు హాస్టళ్లలో వుంటున్న వారికి నెలకు కనీసం రూ.4 వేలు వరకు అద్దె రూపంలో వసూలు చేసేవారు. గతంలో ఒకే గదిలో ఐదారుగురు వరకు ఉండేవారు. ఇకపై అలా వుండేందుకు అవకాశముండదు. మహా అయితే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే హాస్టల్‌ రూముల్లో వుండేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల అదనంగా వసూలు చేసేందుకు అవకాశముంది. ముఖ్యంగా బ్యాచిలర్స్‌, నిరుద్యోగ యువతపై ఈ భారం అధికంగా పడనుంది. 


హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి

ఇప్పటివరకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను అతి తక్కువ మంది మాత్రమే తీసుకుంటున్నారు. ఇకపై ఇది తప్పనిసరి కానుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా ఉపయుక్తంగా ఉంటుంది.   

Updated Date - 2020-05-31T11:04:11+05:30 IST