Abn logo
Dec 2 2020 @ 19:43PM

సడెన్‌గా ఎడారిలో ప్రత్యక్షమైన ఉక్కుస్తంభం.. ఇప్పుడు మరో చోట!

ఇంటర్నెట్ డెస్క్: మనుషులెవరూ సంచరించని ఎడారి ప్రాంతంలో సడెన్‌గా ఓ స్తంభం ప్రత్యక్షమైతే? దానిపై ఏవో వింత వింత డిజైన్‌లతో ఏదో రాసినట్లు కనబడితే? అదేంటో అంతు బట్టడం లేదని శాస్త్రవేత్తలు కూడా చేతులెత్తేస్తే? సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని ఉటా ప్రాంతంలో జరిగింది. ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్‌కు సాయం చేస్తున్న కొందరు అధికారులు హెలికాప్టర్లో వెళ్తుండగా ఈ పొడవైన సిల్వర్ రంగులో మెరుస్తున్న ఓ 12 అడుగుల స్తంభం వారి కంటపడింది. ఇది చూసిన సదరు సిబ్బంది మరోసారి కన్‌ఫర్మ్ చేసుకునేందుకు దానివైపు వెళ్లి చూశారు. ఆ స్తంభం అక్కడ ఎందుకుందో వారికి అర్థం కాలేదు. స్థానిక అధికారులను అడిగితే వారికి కూడా దీని గురించి తెలియదని తేలింది.


ఈ స్తంభం ఎవరో పొరబాటున పడేసిందో, లేక భూమిలోంచి బయటకు పొడుచుకు వచ్చిందో కాదు. ఎవరో కావాలనే ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని నిలబెట్టినట్లు అధికారులు భావించారు. అసలు ఈ స్తంభం ఇక్కడ ఎందుకుంది? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. ఇలాంటిది ఈ ప్రాంతంలో ఉందని స్థానిక ప్రజలకు కూడా తెలియదట. దీంతో ఈ స్తంభం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని గ్రహాంతర వాసులే ఇక్కడ పెట్టి ఉంటారని ప్రచారం జరిగింది. దీని ఫొటోలను కెమెరాలో బంధించడానికి  బెర్నార్డ్ అనే ఓ ఫొటోగ్రాఫర్ 6గంటలపాటు కారులో ప్రయాణించాడు. మిత్రులతో కలిసి ఈ స్తంభం వద్దకు వచ్చాడు.ఎడారి ప్రాంతంలో కనిపించిన స్తంభాన్ని రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసిన బెర్నార్డ్స్.. దీనికి సంబంధించిన వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. స్తంభంపై ఏవో వింత గుర్తులున్నాయని, ఏదో రాసినట్లు కనబడుతోందని అతను అభిప్రాయపడ్డాడు. దీంతో నెట్టింట్లో ఇది మరింత సంచలనంగా మారింది. అయితే ఇలా హటాత్తుగా ప్రత్యక్షమైన స్తంభం.. అంతే హటాత్తుగా మాయం అయిపోయింది. ఇది ఎక్కడికి పోయిందో కూడా ఎవరికీ తెలీదు. అయితే కొందరు మాత్రం ఎవరో నలుగురు వ్యక్తులు ఇక్కడకు వచ్చి, చాలా వేగంగా దీన్ని ఎత్తుకెళ్లి పోయారని అంటున్నారు.


ఇప్పుడు మళ్లీ తాజాగా రోమేనియాలో కూడా ఇలాంటిదే ఓ స్తంభం ప్రత్యక్షమైంది. దీని ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాకపోతే పాజిటివ్‌గా కాదు. రొమేనియాలోని నీమ్ట్ ప్రాంతంలో ఈ స్తంభం వెలుగు చూసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. కనీసం కాపీ కూడా సరిగా చేయలేదని, ఈ స్తంభంపై వెల్డింగ్ చేసిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ స్తంభం కూడా ఉన్నట్లుండి మాయమైపోయింది. ‘‘ఎంత వింతగా ప్రత్యక్షమైందో అంతే వింతగా ఈ స్తంభం మాయమైపోయింది’’ అని ఓ వార్తా సంస్థ చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం ఉటాలో జరిగిన ఘటనను చూసి ఎవరో కాపీ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారని అంటున్నారు. మరి వీటి వెనుక ఏదైనా కనెక్షన్ ఉందా? లేక ఎవరో చిలిపిగా చేస్తున్న తుంటరి చర్యా? అని తేలాల్సి ఉంది.

Advertisement
Advertisement