పశు సంరక్షణ కరువు!

ABN , First Publish Date - 2021-08-06T05:22:04+05:30 IST

పశు సంరక్షణపై పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లావ్యాప్తంగా 80 గ్రామీణ లైవ్‌స్టాక్‌ కేంద్రాలు, 98 వెటర్నరీ డిస్పెన్సరీలు, 19 వెటర్నరీ అసుపత్రులు, ఒక ప్రయోగశాల, ఒక పాలిక్లీనిక్‌లు ఉన్నాయి. పశుసంవర్ధకశాఖలో ఉన్నతాధికారుల పోస్టుల నుంచి అన్ని విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో పది విభాగాల్లో సుమారు 488 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశుసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.

పశు సంరక్షణ కరువు!
తలుపులు తెరవని ఈదుపురం పశువుల ఆసుపత్రి

(ఇచ్ఛాపురం రూరల్‌)

పశు సంరక్షణపై పర్యవేక్షణ  కొరవడుతోంది. జిల్లావ్యాప్తంగా 80 గ్రామీణ లైవ్‌స్టాక్‌ కేంద్రాలు, 98 వెటర్నరీ డిస్పెన్సరీలు, 19 వెటర్నరీ అసుపత్రులు, ఒక ప్రయోగశాల, ఒక పాలిక్లీనిక్‌లు ఉన్నాయి. పశుసంవర్ధకశాఖలో ఉన్నతాధికారుల పోస్టుల నుంచి అన్ని విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో పది విభాగాల్లో సుమారు 488 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశుసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సిబ్బంది కొరతతో కొన్నిచోట్ల ఉన్న సిబ్బందిని ఇతర పథకాల పర్యవేక్షణకు కేటాయించారు. దీంతో చాలాచోట్ల పశువుల ఆసుపత్రులు తెరవడం లేదు. జిల్లావ్యాప్తంగా ఆవులు, ఎద్దులు 5.72 లక్షలు, బర్రె  జాతి పశుసంపద 0.47 లక్షలు, గొర్రెలు 7.04 లక్షలు, మేకలు 3.45 లక్షలు, ఇతరత్రా ఉత్పత్తి జాతి జీవాలు 17 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ మూగజీవాలకు వ్యాధులు సంక్రమిస్తాయని పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. గాలికుంటు, నీలినాలుక, ఇతరత్రా వ్యాధులు పశువులకు సోకే అవకాశముందని పేర్కొంటున్నారు. వీటి నివారణ చర్యలు చేపట్టాల్సి ఉండగా.. ఆస్పత్రుల్లో సేవలు సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు.  క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉన్నారు. పోస్టులను పెంచకుండా కేవలం పర్యవేక్షణ చేసే అధికారుల పోస్టులను డివిజన్‌, సబ్‌ డివిజన్‌ స్థాయిలో పెంచడం వల్ల గ్రామీణ పాడి రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


సమన్వయంతో..  

సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో పశువులకు మెరుగైన వైద్యం అందజేస్తున్నాం. గడ్డి నాటించడం, పశు, మత్స్యదర్శిని పుస్తకాలను అమ్మడం, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడం, వాటిని ఆన్‌లైన్‌  చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాస్తవంగా పశుసంవదర్థక శాఖలో నాలుగు కేడర్లుగా పని చేసే పారా వెటర్నరీ ఉద్యోగాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ప్రభుత్వం పదోన్నతులతో కొన్ని పోస్టులు భర్తీ చేస్తుంది. వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

- డాక్టర్‌.ఎం.కిషోర్‌, జేడీ పశుసంవర్థకశాఖ.

 

పశుసంవర్థక శాఖలో సిబ్బంది సంఖ్య ఇలా..

------------------------------------------------------

పోస్టు మంజూరు     భర్తీ ఖాళీలు

------------------------------------------------------

జాయింట్‌ డైరెక్టర్‌    1   1   0

డిప్యూటీ డైరెక్టర్లు    5   4   1

అసిస్టెంట్‌ డైరెక్టర్లు  22  20   2

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు 105  84  21

వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అధికారులు  21  20   1

జూనియర్‌ వెటర్ననీ అధికారులు  41  40   1

లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్లు   65  62   3

వెటర్నరీ అసిస్టెంట్లు   70  35  35

యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్లు 790 379 411

గోపాలమిత్రలు 171 158  13

Updated Date - 2021-08-06T05:22:04+05:30 IST