‘డబుల్‌’కు డబ్బుల్‌

ABN , First Publish Date - 2022-09-28T05:35:25+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తోన్న ముఠా వ్యవహారం బయటకు రావడం పాలమూరులో కలకలం రేపింది.

‘డబుల్‌’కు డబ్బుల్‌
దివిటిపల్లిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం పైసలు వసూలు చేస్తోన్న ముఠా

ఆరుగురిని అరెస్ట్‌ చేసి వివరాలు వెల్లడించిన పోలీసులు

ఏ-1 నిందితుడు బీజేపీ మైనార్టీ మోర్చా నాయకుడంటూ టీఆర్‌ఎస్‌ ఆరోపణ

బీజేపీ నాయకులతో ఉన్న నిందితుడి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన గులాబీ పార్టీ

రాజకీయరంగు పులుముకోవడంతో సర్వత్రా కలకలం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తోన్న ముఠా వ్యవహారం బయటకు రావడం పాలమూరులో కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో డబుల్‌ ఇళ్ల కోసం అత్యధికంగా డిమాండ్‌ ఉండడంతో దీన్ని ఆసరాగా చేసుకొన్న కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసిన వ్యవహారాన్ని పోలీసులు బహిరంగ పరిచారు. పట్టణానికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఈ దందాలో నిందితులుగా ప్రకటించిన పోలీసులు, కేసును పూర్తిగా విచారించే నిమిత్తం వారిని కస్టడీకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో విచారణలో ఇంకా ఏమేం విషయాలు బయటకు వస్తాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకున్న డిమాండ్‌ రాజకీయంగానూ కీలక అంశంగా మారింది. ఇక్కడ ఇళ్లు లేని పేదలు అధిక సంఖ్యలో దాదాపు 37 వేల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. పట్టణంలో ఇప్పటికే వీరన్నపేట, దివిటిపల్లి, క్రిస్టియన్‌పల్లి ప్రాంతాల్లో దాదాపు మూడు వేల వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇందులో 1,994 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వరుసగా లబ్ధిదారులకు ఇస్తూ వస్తున్నారు. నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు ఇవ్వని ఇళ్లతో పాటు, నిర్మాణం దాదాపు పూర్తవుతోన్న ఇళ్లకు సంబంధించి పేదల నుంచి భారీగా డిమాండ్‌ నెలకొంది. ఈ డిమాండ్‌ను అవకాశంగా తీసుకొన్న దళారులు పట్టణంలో ప్రస్తుతం నిర్మాణం పూర్తయి, లబ్ధిదారులకు ఇంకా కేటాయించని ఇళ్లపై కన్నేశారు. వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు అమలు చేసిన పథకం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న సయ్యద్‌ హసేన్‌ దివిటిపల్లిలో ఖాళీగా ఉన్న ఇళ్లను డబ్బులిస్తే ఇప్పిస్తామని ఆశ చూపారు. ఇళ్లు కావాలని ఆశిస్తోన్న లబ్ధిదారులతో మాట్లాడేందుకు ఏనుగొండకు చెందిన మరో వ్యక్తిని, వీరన్నపేట డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను భాగస్వాములను చేశాడు. వీరి సహాయంతో మొత్తం 36 మంది నుంచి సుమారు రూ.67 లక్షల వరకు వసూలు చేశారని, వారందరికీ నకిలీ ఇళ్ల మంజూరు పట్టాలను కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముఠా వ్యవహారాన్ని వెలికి తీశారు. ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పథకం, ప్రజల్లో ఎక్కువ ఆసక్తి ఉన్న పథకం కావడంతో స్వయంగా ఎస్పీ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగడంతో డొంక కదలింది. మంగళవారం ఆరుగురు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి, వారి పేర్లు, వృత్తులను వెల్లడించారు. దాంతో ఈ అంశం తక్షణమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఏ-1 నిందితుడిగా పేర్కొంటున్న వ్యక్తి బీజేపీ మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడని పేర్కొనడంతో పాటు, ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర నాయకుడితో కలిసి ఈ నిందితుడు దిగిన ఫొటోగా పేర్కొంటూ టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం వైరల్‌ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. నిందితుడి వాట్సాప్‌ డీపీగానూ ఈఫొటోనే పెట్టుకున్నారని, నిత్యం విమర్శలు చేసే బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలం టూ చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. మొత్తంగా ఈ వ్యవహారం కీలక రాజకీయ పక్షాల నడుమ వాదోప వాదాలకు తెరలేపింది. దాంతో విచారణ పూర్తయ్యే సరికి ఇంకా ఏమేం అంశాలు తెరమీదకు వస్తాయోననే ఉత్సుకత ఇటు రాజకీయ, అటు అధికార వర్గాల్లో కనిపిస్తోంది.


అక్రమాలకు పాల్పడితే  చర ్యలు: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌: పేదల కు అందాల్సిన డబుల్‌ బెడ్‌ రూ మ్‌ ఇళ్ల విషయంలో అకమ్రాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.వెంక ట్రావు మంగళ వారం ఒక ప్రకటనలో హెచ్చరిం చారు. ఇందులో అధికారులు తప్పు చేసినా ఉపేక్షిం చేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉదంతంలో బాధ్యుల ను గుర్తించేందుకు అధికారిక కమిటీని నియమిస్తామని, అడిషనల్‌ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించా మని చెప్పారు. ప్రజలు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దన్నారు.

Updated Date - 2022-09-28T05:35:25+05:30 IST