కాల్‌.. నాగులు

ABN , First Publish Date - 2022-07-13T05:25:15+05:30 IST

కాల్‌మనీ కాల నాగులు మళ్లీ కోరలు విప్పి బుస కొడుతున్నాయి. ఆన్‌లైన్‌ రుణాల పేరిట ఆడవాళ్లను టార్గెట్‌ చేసి దొరికినకాడికి దోచేస్తున్నాయి.

కాల్‌.. నాగులు

 లోన్‌ యాప్‌తో పీడిస్తున్న నిర్వాహకులు 

ఆన్‌లైన్‌ రుణ వేధింపులు తాళలేక వారంలో ఇద్దరు మృతి

రుణాల పేరిట ఆడవారిపై లోన్‌ యాప్‌ల వల

వ్యక్తిగత సమాచారం చోరీ..  

ఒకటికి పదింతలు వసూళ్లు.. అయినా ఆగని ఆగడాలు

కాల్‌గరల్స్‌గా ముద్రవేసి బంధువులకు నగ్నచిత్రాలు, మెసేజ్‌లు 

తూతూ మంత్రపు చర్యలతో సరిపుచ్చుతున్న అధికారులు


 ‘లోన్‌ రీ పేమెంట్‌ చేయాలి. నేను ఆల్రెడీ రీ పేమెంట్‌ చేశాను. చాలాసార్లు కట్టాను. మళ్లీ ఇవ్వాళ ఏడింటిలోపు కట్టకపోతే చుట్టాలందరికీ మెసేజ్‌లు పెడతామని చెప్పారు. దాంట్లో ఉండేది నేను మాత్రం కాదమ్మా... అందరినీ నేను ఫేస్‌ చేయలేనమ్మా.. ఐయామ్‌ సారీ.. చచ్చిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. నాకు ఇప్పటికీ బతకాలని ఉంది. కానీ వేరే ఆప్షన్‌ లేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. 

- లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకుని, వేధింపులు తాళలేక తనువు చాలించిన బాధిత మహిళ  చెప్పిన హృదయ విదారకమైన చివరి మాటలివి.

  

గుంటూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): కాల్‌మనీ కాల నాగులు మళ్లీ కోరలు విప్పి బుస కొడుతున్నాయి. ఆన్‌లైన్‌ రుణాల పేరిట ఆడవాళ్లను టార్గెట్‌ చేసి దొరికినకాడికి దోచేస్తున్నాయి. గతంలో మాదిరి యాప్‌ నిర్వాహకులు ఫోన్లు చేసి తిట్టడం, ఒత్తిడి చేయడం వంటివి కాకుండా కొత్త పద్ధతుల్లో బాధితులను వెంటాడి, వేటాడి, వేధిస్తున్నారు. ఒకటికి పదింతలు వసూలు చేసినా తృప్తి చెందని ఈ కాలనాగులు బాధితుల వ్యక్తిగత సమాచారం చోరీచేసి ఆకృత్యాలకు తెగపడుతున్నారు. డెడ్‌లైన్లు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. అడిగింది ఇవ్వకుంటే బతుకులను బుగ్గి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే మంగళగిరి మండలం చినకాకానీలో మంగళవారం వెలుగుచూసింది. సరిగ్గా వారం రోజుల క్రితం అదే ప్రాంతంలోని నవులూరులో చోటు చేసుకుంది. నవులూరుకు చెందిన ఒక బీటెక్‌ విద్యార్థిని కూడా ఇలానే లోన్‌యాప్‌ ద్వారా లోన్‌ తీసుకుని చెల్లించినా నిర్వాహకుల వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గడిచిన వారం రోజుల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందారంటే వీరి వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే తెలిసిపోతుంది. 


చిన్న చిన్న రుణాలకు భారీ మూల్యం

చినకాకానికి చెందిన ఒక మహిళ ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్‌ల ద్వారా రూ.20 వేలు అప్పు తీసుకుంది. తిరిగి రూ.2 లక్షల వరకూ చెల్లించింది. అయినప్పటికీ లోన్‌ నిర్వాహకులు ఆమెను విడిచి పెట్టలేదు. పదే పదే లోన్‌ కట్టాలంటూ వేధింపులకు దిగారు. రీ పేమెంట్‌ చేయకపోతే ఆమె నగ్న చిత్రాలు బంధువులకు పంపుతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా వారి పేరిట తప్పుడు మెసేజ్‌లు బంధువులందరికీ పంపించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.  


కొత్త పద్ధతిలో దందా.. లైంగిక వేదింపులు

 అప్పట్లో బాధితులను తిట్టడం, వారి ఇళ్ల వద్దకు వచ్చి వేదించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల్లో వేదింపులకు దిగారు. లైంగిక వేధింపుల ద్వారా ఒకటికి పదింతలు వసూలు చేస్తున్నారు. అందుకోసం ప్రధానంగా స్మార్ట్‌ ఫోన్లు వాడే మహిళలను టార్గెట్‌ చేస్తున్నారు. యాప్‌లో లాగిన్‌ అవడానికి ముందే వ్యక్తిగత సమాచారం, లొకేషన్‌ యాక్సెస్‌ తీసుకుంటారు. తద్వారా ఆయా వ్యక్తులు వినియోగించే ఫోన్‌లో ఉన్న సమాచారం మొత్తం చోరీ చేస్తారు. వేలల్లో అప్పులు ఇచ్చి లక్షల్లో వసూలు చేస్తారు. అలా చెల్లించకపోతే ఫోన్‌లో నుంచి కాజేసిన కాంటాక్టు నంబర్లకు మెసేజీలు, నగ్న చిత్రాలు పంపిస్తామని బెదిరిస్తారు. దీంతో ఒత్తిడి భరించలేని మహిళలు ఏళ్ల తరబడి రుణాలు చెల్లిస్తూనే ఉంటారు.  


కరోనాతో విజృంభించిన కాలనాగులు

కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా సాధారణ ప్రజాజీవనం అతలాకుతలం అయిపోయింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థికంగా సతమతమవుతున్న సామాన్యులను టార్గెట్‌ చేసి ఆన్‌లైన్‌ కాల్‌మనీ యాప్‌లు దందా మొదలు పెట్టాయి. ఆర్థిక అవసరాన్ని ఆసరా చేసుకుని షరతులు లేని రుణాల పేరుతో పేద, మధ్యతరగతి వర్గాన్ని తమ గుప్పెట్లో బంధించారు. రుణాలు ఇచ్చే సమయంలోనే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. 


నామమాత్రపు చర్యలతో సరి..

జిల్లాలో కొన్ని వేల మంది ఆన్‌లైన్‌ కాల్‌మని బారిన పడి నలిగిపోతున్నారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది బయటికి చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.  కాగా గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌ కాల్‌మనీ యాప్‌ల దందా యథేచ్ఛగా కొనసగుతోంది. దీనిని శాశ్వతంగా నివారించడానికి ప్రభుత్వం, అధికారులు తీసుకుంటున్న చర్యలు లేవనే చెప్పాలి. ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన సందర్భంలో ఒకటి రెండు రోజులు హడావుడి చేసే పోలీసులు ఆ తరువాత ఈ విషయాన్ని వదిలేస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది అభాగ్యులు బలైపోతున్నారు. 

Updated Date - 2022-07-13T05:25:15+05:30 IST