అమ్మా..బడికెళ్తానే!

ABN , First Publish Date - 2022-07-02T06:33:34+05:30 IST

స్కూల్‌కి వెళ్లకపోతే నేను వెనకబడిపోతాను. ..అంటూ ఆ పిల్లవాడు ఏడుస్తూ మారాం చేస్తుంటే తల్లిదండ్రుల గుండెల్లో కన్నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి.

అమ్మా..బడికెళ్తానే!
మోక్షిత్‌

బోన్‌మారో క్యాన్సర్‌తో 9వ తరగతి పిల్లవాడు

డబ్బులుంటే బిడ్డ బతుకుతాడని వేడుకుంటున్న తల్లిదండ్రులు


సూళ్లూరుపేట: అమ్మా.. స్కూల్‌ తెరిచేశారు. అందరూ వెళ్తున్నారు. నా యూనిఫారం ఉతికిపెట్టు.. నేనూ వెళ్తాను. నాన్నా.. బుక్స్‌ తీసుకురా. స్కూల్‌కి వెళ్లకపోతే నేను వెనకబడిపోతాను. ..అంటూ ఆ పిల్లవాడు ఏడుస్తూ మారాం చేస్తుంటే తల్లిదండ్రుల గుండెల్లో కన్నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. బడికి పంపలేక, పిల్లాడికి సమాధానం చెప్పలేక దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు. మృత్యు విష కౌగిలిలో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి తమకున్నవన్నీ తెగనమ్ముతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఆసుపత్రి పడక మీద ఉన్న నట్టేటి మోక్షిత్‌ సూళ్లూరుపేటలోని టైనీటాట్స్‌ పాఠశాల విద్యార్ధి. 8వ తరగతి పూర్తవగానే జబ్బు పడ్డాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అత్యంత అరుదైన బోన్‌ క్యాన్సర్‌గా నిర్ధారించారు. కారు నడుపుకునే తండ్రి కుప్పకూలిపోయాడు. బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి చెన్నైలోని పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్లాడు. బోన్‌ క్యాన్సర్‌కి తక్షణం వైద్యం అందించాలి. క్లిష్టమైన చికిత్స. ఖర్చుతో కూడుకున్న వైద్యం. ఉన్న నగానట్రా అమ్మేశారు. ఇప్పటికి రూ.7 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.30 లక్షలు ఖర్చవుతుందని ఆసుపత్రి వాళ్లు లెక్కగట్టి చెప్పారు. లోన్‌ కింద తీసుకున్న కారును కూడా కంతులు కట్టలేకపోవడంతో తీసుకుపోయారు.ఇటు బతుకుతెరువు పోయింది. అటు బిడ్డ ప్రాణం ఆసుపత్రిలో రెపరెపలాడుతోంది. దిక్కుతోచని స్థితిలో  తల్లిదండ్రులు  వెంకటేశ్వర్లు, అనిత తల్లడిల్లుతున్నారు.  వీరి స్థితి చూసి మోక్షిత్‌ చదువుకునే టైనీటాట్స్‌ సీబీఎ్‌ససీ స్కూల్‌ అధినేత వేనాటి ధనంజయరెడ్డి 3 లక్షల రూపాయలను అందజేశారు. శుక్రవారం పాఠశాల వద్ద అతని కుటుంబానికి చెక్కును అందజేశారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆశ చిగురించింది.దయగల్ల లోకం తమ బిడ్డకు ప్రాణభిక్ష పెడుతుందనే నమ్మకం కలిగింది. వైద్య చికిత్స పూర్తి చేసుకుని తూనీగలా మళ్లీ బడికి వెళ్లే బిడ్డను కనుల నిండుగా చూసుకోవాలని కలలు కంటోంది. ఆదుకునే చేతులు ముందుకొస్తే అది అసాధ్యం కాదు. రూపాయి రూపాయి పోగయితే లక్షలవుతాయి. సాయం చేయాలనుకునేవారు ఆ కుటుంబాన్ని వివరాలకోసం సంప్రదించవచ్చు. ఫోన్‌ నెంబర్‌: 6300651336. మోక్షిత్‌ తల్లి నట్టేటి అనిత అకౌంట్‌ నెంబర్‌: 9108842606-4 (ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ ఏపీజీ0004134), ప్రగతి గ్రామీణ బ్యాంక్‌, సూళ్లూరుపేట. 

Updated Date - 2022-07-02T06:33:34+05:30 IST